భగవాన్ రమణమహర్షి వారి “విచార సాగర సార సంగ్రహ” పుస్తకాన్ని తమిళంలో 1917 ప్రాంతంలో అరుణాచల మొదలియార్ ముద్రించారు. అయితే అప్పట్లో ఆ పుస్తకం మీద భగవాన్ పేరు వెయ్యలేదు. కనుక అది ఎవరు రాసారో చాలా సంవత్సరాల వరకు ఎవరికీ తెలియలేదు. అయితే 1947 ప్రాంతంలో ఒకరు విచార సాగరం అనే శీర్షికన మలయాళంలో ఉన్న పుస్తకాన్ని ఓ లైబ్రరీ నుంచి తీసుకుని చదివి తిరిగి ఇచ్చేసే ముందు అది భగవాన్ చేతులకు అందింది. అప్పుడు ఆయనకు అది ఒకప్పుడు తాను రాసిన “విచార సాగర సార సంగ్రహ” పుస్తకం గుర్తుకు వచ్చి ముద్రిత కాపీ ఎక్కడుందో అడిగారు. అయితే వెతకగా కొన్ని రోజులకు జీర్ణావస్థలో ఉన్న ఆ పుస్తకం బయటపడింది. ఒక భక్తుడు దానిని పునర్ ముద్రించడం కోసం కాపీ చేస్తుండగా భగవాన్ వైరాగ్య అనే దానికి ఒక జెండాను గుర్తుగా కలపమన్నారు. ఆ ఉపమానానికి ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆ భక్తుడు అడిగాడు. అప్పుడు భగవాన్ చిన్న నవ్వు నవ్వి జ్ఞానికి విరాగం అనే పతకం, అజ్ఞానికి రాగం అనే పతకం కట్టబడినట్టు అర్ధమని చెప్పారు. అది చూడటంతోనే ఎవరు జ్ఞాని? ఎవరు అజ్ఞాని అనేది తెలుసుకోవచ్చు అని భగవాన్ భావం. విరాగం ఎప్పుడూ చలించదు. జ్ఞానికి అంతకన్నా గొప్ప చిహ్నం మరొకటి అక్కరలేదన్నారు.
ఇంతలో మరొక భక్తుడు ఈ పుస్తకం రాయడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు భగవాన్ ని.
అప్పుడు భగవాన్ ఇలా అన్నారు….
విచార సాగరం అనే పుస్తకాన్ని హిందీలో సాదు నిశ్చల దాసు అనే ఆయన రాసారు. అందులో అనేక తర్కవాదాలు ఉన్నాయి. అది అనువదించి ముద్రించిన పుస్తకాన్ని అరుణాచల మొదలియార్ తీసుకొచ్చి “హిందీలో చాలా విస్తారంగా ఉంది. దానిని సంగ్రహించి భగవాన్ చిన్న పుస్తకం రాయాలి” అని పట్టుబట్టారు. సరేకదాని జిజ్ఞాసువులకు అనుకూలంగా ఉంటుందని రాసాను. దానిని వెంటనే ఆయన ముద్రించారు. అది ముప్పై సంవత్సరాల మాట” అని.
“మరి మీ పేరెందుకు వెయ్యలేదు?” అనిమరొకరు అడిగారు భగవాన్ ని. తానె పేరు వెయ్యవద్దని చెప్పినట్టు జవాబిచ్చారు.
అయితే మరిన్ని పుస్తకాలు అలా మీ పేరు లేకుండా అజ్ఞాతంలో ఉన్నాయో చెప్పమని భక్తుడు అడగ్గా “నీకేమీ పని లేదూ” అంటూ భగవాన్ మౌనం వహించారు.
ఈ పుస్తకానికి మొదట్లో ఉన్న పేరు సరి కాదని దానికి విచారమణిమాల అని పేరు పెట్టారు భగవాన్. అప్పుడు భగవాన్ పేరు కలిపారు. ఆప్రతి ప్రెస్సుకి పంపుతున్నప్పుడు తెలుగులో భగవాన్ తమ పేరు తామే రాస్తే బాగుంటుందని మనసులో ఉన్నా భగవాన్ ని అడగలేకపోయాడు ఆ భక్తుడు. మొత్తానికి ఆ బుక్కు తెలుగులో కూడా ఆ తర్వాత అచ్చయ్యింది.
– యామిజాల జగదీశ్