విజువల్ వండర్ ‘2.ఓ’

ఇండియా గర్వించదగ్గ దర్శకుడు శంకర్‌. ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ.. సక్సెస్‌లో ఉన్న నార్త్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌. ఇవే కాక త్రీడీ, 4డీ సౌండ్‌ సిస్టమ్‌, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇలాంటి ఎన్నో స్పెషాలిటీస్‌తో వస్తోన్న చిత్రం ‘2.ఓ’. మామూలుగా రజనీ సినిమా వస్తోందంటేనే అభిమానుల సంబరాలకు హద్దులుండవు.

ర‌జ‌నీకాంత్ ‌సినిమా. అందులోనూ సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కితే… ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది? అందుకే రోబో 2.ఓ పై అన్ని న‌మ్మ‌కాలు పెంచుకున్నారు సినీ అభిమానులు. త‌ర‌చూ వాయిదా ప‌డుతూ వ‌స్తున్నా.. ర‌జ‌నీ అభిమానులు ఎక్క‌డా నిరుత్సాహ ప‌డ‌కుండా ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్ష‌ణ ఫ‌లించింది. శంకర్‌ కాంబినేషన్‌లో తలైవా వస్తున్నాడంటే బాక్సాఫీస్ కూడా హడలెత్తిపోతుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన శివాజీ, రోబో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే రోబోకు సీక్వెల్‌గా ఇండియన్‌ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కించిన ‘2.ఓ’ అంచనాలను అందుకుందా? బాహుబలి రికార్డులను చిట్టి బద్దలుకొట్టనున్నాడా? శంకర్‌ మరోసారి తన విజన్‌తో మ్యాజిక్‌ చేశాడా?.. ఇవన్ని తెలియాలంటే ఓ సారి కథలోకి వెళ్దాం..

కథ
2.0హఠాత్తుగా నగరంలోని సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. (సాక్షి రివ్యూస్‌) డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. అయితే సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌)ను చిట్టి ఒంటరిగా ఎదురించిందా? ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు పక్షిరాజాలా అక్షయ్‌ మారడానికి దారి తీసిన కారణాలు ఏంటి?

శంక‌ర్ ఎప్పుడూ సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్న‌తంగా చూపిస్తుంటాడు. ఈసారి సాంకేతిక విష‌యాన్నే ఎంచుకోవ‌డం మ‌రింత క‌లిసొచ్చింది. 2.ఓ విష‌యంలో ఆయ‌న సెల్‌ఫోన్‌ల‌పై ఫోక‌స్ పెట్టాడు. సెల్ ఫోన్‌ల వ‌ల్ల వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో, భ‌విష్య‌త్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వ‌స్తుందో… ఈ సినిమాలో క‌ళ్ల‌కు క‌ట్టారు. వాటి చుట్టూ ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ క‌థ అల్లారు. ప్ర‌ధ‌మార్ధంలో సెల్ ఫోన్ల మాయం, ప‌క్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్ర‌వేశం చేస్తాడో.. అప్పుడు ఓ ర‌స‌వత్త‌ర‌మైన పోరు చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. ప‌క్షిరాజుగా అక్ష‌య్ ని చూపించ‌డంతో విశ్రాంతి కార్డు ప‌డుతుంది.

ద్వితీయార్ధం మొత్తం చిట్టి – ప‌క్షిరాజుల ఆధిప‌త్య పోరే చూపించారు. అస‌లు ప‌క్షిరాజు క‌థేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విష‌యాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పారు. ఆ ఎపిసోడ్ హృద‌యాన్ని హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు. అస‌లు ఈ సినిమాలో ఎమోష‌న్ పండింది అంటే… ఈ ఒక్క ఎపిసోడ్ లోనే. ప‌తాక స‌న్నివేశాల్ని విజువ‌ల్‌గా ఓ స్థాయిలోకి తీసుకెళ్లాడు శంక‌ర్‌. కొన్ని స‌న్నివేశాలు రోబోలో చూసిన‌ట్టే అనిపిస్తుంటాయి. ప్ర‌చార చిత్రాలు చూసిన‌వాళ్ల‌కు ఈ సినిమా క‌థ‌పై ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డి ఉంటుంది. వాటికి లోబ‌డే సినిమా ఉంటుంది.

నటీనటులు
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్‌ పాత్రలో వసీకరణ్‌గా, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు కన్నులపండువగా ఉంటుంది. ఇక అక్షయ్‌కుమార్‌ నటన ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది. పక్షిరాజాలా అక్షయ్‌ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అక్షయ్‌ నటనలోని మరోకోణాన్ని శంకర్‌ అద్భుతంగా ఆవిష్కరించాడు. అమీ జాక్సన్‌ తన పరిధి మేర ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నారు.

విశ్లేషణ
శంకర్‌ సినిమా సామాజిక స్పృహ, సందేశాత్మక సినిమాలు చేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ శంకర్‌ తీసిన సినిమాలను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకు కూడా సామాజిక కోణంలోంచే కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించిన తీరు అద్భుతం. సెల్‌ఫోన్లకు మనుషులు ఏవిధంగా బానిసవుతున్నారో? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. (సాక్షి రివ్యూస్‌) విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆస్కార్‌ అవార్డు గ్రహీతలు ఏఆర్‌ రెహమాన్‌, రసూల్‌ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది. స్వర మాంత్రికుడు తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయగా.. ఇండియన్‌ సినిమాలో 4డీ సౌండ్‌ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్‌ తీసుకెళ్లారు. నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్‌ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఆంటోని ఎడిటింగ్‌ పనితనం కూడా ఈ సినిమాకు కలిసివచ్చింది.

నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుదాంశు పాండే, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాంజాన్‌, రియాజ్‌ఖాన్‌ తదితరులు
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా, ఎడిటింగ్‌: ఆంథోని, ఆర్ట్‌: టి.ముత్తురాజు
వీఎఫ్‌ఎక్స్‌ అడ్వైజర్‌: శ్రీనివాసమోహన్‌. ఫైట్స్‌: సెల్వ, నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం
రచన, దర్శకత్వం: శంకర్‌

Send a Comment

Your email address will not be published.