విశ్వవ్యాప్త రంగుల పండుగ

విశ్వవ్యాప్త రంగుల పండుగ….హోళీ

holi hai

హోళీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగుల ఉత్పత్తి అయ్యి వృద్ధిపొంది , వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం. పురాణ కథలతో పాటుగా హోళీ పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళీ పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగిపోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోళీ పండుగను సాధారణంగా “ఫాల్గుణి పూర్ణిమ” నాడు జరుపుకుంటారు. ఇలా ఒక ఋతువు వెళ్ళి మరో ఋతువు వచ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం ‘చలి’ వెళ్ళిపోయి ఎండాకాలం ‘వేడి’ వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి.

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగని సత్యయుగం నుంచి జరుపుకుంట్టున్నట్టుగా హిందూ పురాణాలలో వివరించబడింది. హోళీ అంటే అగ్ని, అగ్నిచే పునీతమైనది అనే అర్ధాలు చెప్పబడ్డాయి. హోళీని హోళికా పుర్ణిమగా కూడ వ్యవహరిస్తూవుంటారు.వసంత కాలంలో వచ్చే ఈ పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.హోలీ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే- హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం.

ప్రచారంలో ఉన్న కథ :
హిరణ్యకశపుడు తన కుమారుడైనా విష్ణుచింతనతో కాలం వెళ్లబుచ్చే ప్రహ్లాదుణ్ణి మట్టుబెట్టాలని నిర్ణయంచుకొన్నాడు. ఒకరోజు హిరణ్యకశపుడు తన సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకున్న వరంతో ప్రహ్లాదుణ్ణి మంటలకు ఆహుతిచేయమని పురమాయస్తాడు. ఆ హోలీక తన సోదరుని కోరిక తీర్చడానికి ఆమె ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. కానీ విష్ణుమాయవల్ల హోలిక ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సజీవుడై నిలిచాడు. హోలిక దహనమైన రోజు కనుక హోలీపండుగను చేసుకొంటారు.

పూర్వం రోజులలో ఈ పండుగ నాడు రకలరకాల పూవులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వారి సంతోషాన్ని పంచుకొనేవారట. కాని రానురాను పూవుల స్థానంలో రకరకాల రంగులు వచ్చిచేరాయి. ఈ రంగులను నీళ్లల్లో కలిపి ఒకరిపై ఒకరు చల్లుకొంటారు. ఇలా చల్లుకోవడం వల్ల ప్రేమతో పాటు సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయని అందరూ భావిస్తారు. వంగదేశంలో డోలోత్సవాన్ని జరుపుకుంటారు. శ్రీకృష్ణునితో కలిసి గోపికలు ఆనాడు బృందావనంలో పూవులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావించి ఈ హోళి పండుగనాడు శ్రీకృష్ణుడిని రాధను ఊయాలలో పెట్టి డోలోత్సావాన్ని చేస్తారు.

హోలికను గురించి మరో కథ
కృతయుగంలో రఘునాదుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఎంతో జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ వుండగా కొందరు ప్రజలు వచ్చి హోలిక అను రాక్షసి వచ్చి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకున్నారు. ఆ సమయములో అక్కడే వున్న నారద మహర్షి రఘునాధ మహారాజా హోలిక అను రాక్షసిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజు పూజించాలి. అలా పూజించిన వారి పిల్లలను ఆ రాక్షసి ఏమీ చెయ్యదు . కనుక రాజ్యంలో అందరిని వచ్చే ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలికను పూజించమని ఆదేశించండి, అన్ని బాధలు తొలగిపోతాయి అన్నాడు. రాజ్యములోని ప్రజలందరూ ఫాల్గుణ పూర్ణిమ రాత్రి కాలమందు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చెయ్యాలని మహారాజు ఆదేశించాడు. పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖములు కలుగుతాయి. కనుక హోలికకు రాత్రే పూజలు చేయాలి. అలా ఈ హోళీ ….. హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ హోలిక హిరణ్య కశిపుని చెల్లెల్ని, ప్రహ్లాదుని అగ్నిలో తోయించినప్పుడు ప్రహ్లాదునితోపాటు ఈ హోలిక కూడా అగ్నిలో ప్రవేశించి మారి భస్మం అయ్యిందని అందువల్ల పిల్లల రక్షణ కొరకు ఆమెను పూజించడం ఆచారంగా మారిందని పెద్దలు చెప్తారు

హోలిక దహన్: హోలీ భోగి మంటలు
హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టం మండుచున్న హోలీ మంటలు లేదా హోలీక. అంతేకాక కొందరి ఉద్దేశ్యం ప్రకారం రాక్షసి హోలిక, హోలక మరియు రాక్షసుల దహనం లేదా మదన్‌ను దహనం అని సంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు. ఎలాగంటే విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయిందని దీని అర్థం, చాలా ప్రాంతాలలో, కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణలు చేస్తారు. తరువాత రోజు ఈ విజయాన్ని దుల్‍‌హెండి రోజుగా ఘనంగా జరపుకొంటారు.

రాధ – గోపికల హోళీ:
ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర మరియు బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంతఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.

దేశంలో వివిధ ప్రాంతాల్లో హోళీ వేడుకలు…

ఒరిస్సా :
ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు.

గుజరాత్ :
గుజరాత్ లో ఈ పండగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి సామూహికంగా కూడా మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు.

మహారాష్ట్ర :
మహారాష్ట్రలో హోళీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోళీ వేడుకకు ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

మణిపూర్ :
మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు.

కాశ్మీర్ :
సైనికుల పహారాలో, తుపాకుల చప్పళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్ లో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకుంటారు.

ఉత్తర ప్రదేశ్ :
లఠ్ మార్ హోళీ
ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరగా ఉన్న బర్సన అనే ఊళ్ళో హోళీని వెరైటీగా జరుపుకుంటారు. అక్కడ హోళీ సందర్భంగా మహిళలు మగవారిని లాఠీలతో పిచ్చ కొట్టుడు కొడతారన్న మాట. దీన్నే వారు లఠ్ మార్ హోలీ అని ముద్దుగా పిలుచుకుంటారు. లఠ్ అంటే లాటీ అని అర్థమట. దీనికి ఓ ప్రత్యేక కారణముంది. పురాణ కాలములో చిలిపి క్రిష్ణుడు, తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి, అక్కడ ఆమెను, ఆమె స్నేహితురాళ్ళను ఆటపట్టించాడట. దీనిని తప్పుగా భావించిన ఆ గ్రామం మహిళలు, కర్రలతో క్రిష్ణయ్యను వెంట తరిమారట. అప్పటినుండి, ఈ పండగ ఇలా జరుపుకోవాడం జరుగుతోంది. పక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం, నంద్‌గావ్ నుండి మగవారు హోళీ ఆడడానికి ఈ గ్రామం రావడం, హుషారుగా హోళీ పాటలు పాడడం, ఆడవారిని రెచ్చగొట్టడం వారిచేతిలో లాఠీ దెబ్బలు తినడం ఆనవాయితీ అన్న మాట. కాకపోతే, ఆడవారు కొట్టే దెబ్బలను వారు ఢాలు వంటి దానిని ఉపయోగించి తప్పించుకోవచ్చు. ఆడవారు కూడా వారిని ఢాలు మీదనే ఎక్కువగా కొడతారు.

ఈ హోళీకి అక్కడ ఒక నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు జరుగుతాయి. అత్తలు తమ కోడళ్ళకు ఆ నెల రోజు మంచి పౌష్టిక ఆహారం పెడతారట, బాగా కొట్టడానికి. ఇక్కడ కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాడు, వారి పట్ల తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెబుతారు గ్రామస్తులు. ఇలాంటిదే మరో హోళీ హర్యానాలో జరుగుతుంది. దాని పేరు “కరోర్ మార్” హోళీ. ఇక్కడ వదినలు (మరదళ్ళూ కూడానేమో) మరిదిని (బావను కూడా అని నా అనుకోలు) పిచ్చ కొట్టుడు కొట్టడం స్పెషాలిటీ. సంవత్సరమంతా వారు తమ మీద వేసిన జోకులకూ సెటైర్లకూ, టీజింగులకు ఆరోజు కసి తీర్చుకుంటారన్న మాట. ఇది కేవలం కుటుంబమంతా తమ విభేదాలను మర్చిపోయి, కలిసి మెలసి జీవించడనికి చేసుకునే పండగ అని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమనీ చెబుతున్నారు. విశేషమేమిటంటే, లాఠ్ మార్ హోళీ లా ఇక్కడ మగవారు ఢాలు లాంటివి తెచ్చుకోరు, ఆడవారు కూడా కేవలం దెబ్బలు తగలకుండ కొట్టడం అనే కాన్సెప్టును ఫాలో అవ్వరు. ఏది దొరికితే అది అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలి, లేదా తన్నులు తినాలి.

Send a Comment

Your email address will not be published.