వేయి నామాల వాడా...

Sunitha_Kosnaకరోనా మహమ్మారి జనజీవన స్రవంతిని కబళించిన వేళ. కరాళ నృత్యం చేసి విశ్వ మానవాళి జన జీవన వ్యవస్థను మదించిన వేళ. వేల వేల కళేబరాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వేళ. చివరి చూపుకు కూడా నోచుకోని బడుగు జీవుల ఆక్రందనలు వెల్లువెత్తిన వేళ…

గుండె లోతుల్లోంచి భక్తి పారవశ్యంతో ఈ కరోనా బాధనుండి కాపాడమని ఏడుకొండల వాని రూపాన్ని కన్నులముందు నిలిచేట్లు సుందరమైన పద కోశంతో వర్ణించి వీనుల విందైన సంగీత స్వరాలాపనతో తెలుగుదనమంతా రంగరించి రచించిన గీతమిది.

పల్లవి:
‘ఓ.. వేయి నామాల వాడా… భరధ్వాజ గోత్ర….
శ్రీ వైకుంఠాచల నివాస శ్రీరంగ నాథ శేషాద్రి నివాస..
ఓ.. నీలి మేఘశ్యామ గరుడ స్కంధ నివాస
శ్రీ పధ్బనాభ…. ఓ శ్రీనివాస క్షీరభ్ది నివాస’

అనే పల్లవితో ప్రారంభించిన పాట విని భగవంతుడు దివి నుండి భువికి దిగి రావాల్సిందే అన్నట్లుగా ఉంది. ఒక ఉన్నతమైన ఆశయంతో సందర్భోచితంగా సమయ స్పూర్తితో వ్రాసిన అక్షర మాల ఇది.

ఈ మహమ్మారి వలన ‘నీ దగ్గరకు రావాలని ఉన్నా రాలేకపోతున్నానని చెబుతూ, ఇంటి నుండే నేను చేస్తున్న పూజలందుకోమని నా కన్నీళ్ళతో నీ పాదాలు కడుగుతున్నానని’ వేడుకుంటున్నారు సునీత కొస్న గారు. ఈ మహమ్మారిని తరిమి మానవాళిని ఆదుకోమని అంటున్నారు.

ఆక్లాండ్ నివాసితులైన సునీత గారికి చిన్నప్పటి నుండి పౌరాణిక కథలు వినడం, రంగస్థల నాటకాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఆ ప్రక్రియలో భక్తి ఒక ప్రవృత్తిగా మారింది. ఏడుకొండలవాడు ఇష్ట దైవంగా మారాడు. ఆయనపై ఉన్న ఎన్నో వందల పాటలు వినడం తన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది.

అయితే ఈ సంవత్సరం ‘కరోనా’ వైరస్ వలన భారతదేశం వెళ్ళడం జరగలేదు. వెంకటేశ్వర స్వామిని చూసే అవకాశం రాలేదు. మనసులో బాధ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ ఊగిసలాటలో స్వామి కరుణా వీక్షణాలు ప్రసరిల్లి ఈ గీతం అక్షర రూపంలో వెలువడింది.

చరణం:
‘భక్తులు కొండకు రాక మూగబోతివా
భక్త జనులు రాలేక బోసిపోతివా
నీ ప్రాంగణమే వెలవెల బోయేనా
రావాలని ఉన్న రాలేని‌ మా నిస్సహయత
తరలిరా మా ధరికి తండ్రి తిరుమలేశా’
….

ఈ క్రింది లంకెలో పూర్తి గీతాన్ని వినవచ్చు.
https://youtu.be/UqGjAs6UF-M

గత నవంబరు నెలలో ఆక్లాండ్ నగరంలో జరిగిన ‘న్యూ జిలాండ్ మరియు ఆస్ట్రేలియా మొదటి సాహితీ సదస్సు’ లో శ్రీమతి సునీత గారు గొలుసు కథ పూర్తీ చేసి మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఈ సాహితీ సదస్సు ఈ గీతం వ్రాయడానికి చాలా స్పూర్తినిచ్చిందని సునీత గారు చెప్పారు.

భర్త శ్రీ విజయ్ గారు 2017 డిశంబరు నెలలో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రత్యేక కార్యకర్తగా వ్యవహరించారు. న్యూ జిలాండ్ లో జరిగిన సాహితీ సదస్సు కార్యవర్గ సభ్యులుగా పనిచేసారు. ఏకైక పుత్రుడు శుభప్రద్ ప్రస్తుతం న్యూ జిలాండ్ లోనే వైద్యవృత్తిలో శిక్షణ పొందుతున్నారు.

చిన్నప్పటి నుండి తీపి పదార్దాలంటే సునీత గారికి చాలా ఇష్టం. ముఖ్యంగా చాక్లెట్లంటే మరీను. శ్రీ వేంకటాచలవాసునిపైనున్న భక్తి ప్రపత్తులతో తీపి పదార్థాలు కొన్నాళ్ళ క్రితం విడిచిపెట్టడం జరిగింది. ఈ సారి వెళ్ళినపుడు తిరుపతి లడ్డుతో మళ్ళీ తీపి పదార్థాలు తినాలని ఉవ్విళ్ళూరుతున్నారు శ్రీమతి సునీత గారు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ గీతానికి ఆష్జ గంగాధర్ స్వరకల్పన చేసారు. సౌజన్య ఆలపించగా విల్సన్ సంగీతం అందించారు.

ఇటువంటి సాహితీపరమైన మరిన్ని గీతాలు సునీత గారి కలం నుండి మున్ముందు జాలువారాలని ఆశిద్దాం.

Send a Comment

Your email address will not be published.