‘శివ’ నుంచి ‘ఆటగదరా శివా’ వరకూ

‘శివ’ నుంచి ‘ఆటగదరా శివా’ వరకూ

శివుడిని తనలో నిలుపుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ భరణి
– జూలై 14 ఆయన పుట్టినరోజు

తెలుగు సినిమాల్లో మూడు దశాబ్దాల కిందట వచ్చిన “శివ” సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అందులో విలన్ రఘువరన్ కి అనుచరునిగా “నానాజీ” అనే ఒక పాత్ర. దానిని తనదైన అభినయంతో పరిపుష్టం చేసిన విలక్షణ నటుడు తనికెళ్ళ భరణి. అంతకు కొన్నేళ్ళ ముందే ఆయన సినిమారంగంలో అడుగుపెట్టినా అతనికి గుర్తింపుని తీసుకొచ్చింది శివ సినిమాలోని నానాజీ పాత్రే. తనికెళ్ళ భరణి పేరు శివతోనే ముడిపడి ఉంది. కారణం…ఆయన శివభక్తుడు. ఆటగదరా శివా…! అంటూ ఆ గరళకంఠుడిని నోరారా కీర్తించినవారు. అందుకే… నాటి ‘శివ’ నుంచి నేటి ‘ఆటగదరా శివా’…! వరకూ సాగిన ఆయన సృజనాత్మక ప్రస్థానం అభినందనీయం. ఆయనలో ఓ అక్షర శిల్పి… రంగస్థల, వెండితెర నటుడు, కవి, గాయకుడు, దర్శకుడు… ఇలా బహుముఖ ప్రతిభ తనికెళ్ళ భరణిలో దాగుంది. తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకున్న తనికెళ్ళ భరణి పుట్టినరోజు ఈ నెల 14. ఆ సందర్భంగా ఆయన విశేషాలు…

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య ప్రధాన పాత్రలతో పాటు విలన్ క్యారెక్టర్లలో లీనమై, తన ప్రతిభతో అందరినీ మైమరిపించే సినిమా నటుడు ‘తనికెళ్ల భరణి’! తెలుగు భాషాభిమాని అయిన ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే.. భరణి సకలాకళా కోవిదుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలం జగన్నాధపురంలో జన్మించిన తనికెళ్ళ భరణి దాదాపు 750 సినిమాల్లో నటించారు.

జీవిత విశేషాలు
తనికెళ్ల భరణి 1956 జూలై 14వ తేదీన టివిఎస్ రామలింగేశ్వరరావు, లక్ష్మీ సరసమ్మ దంపతులకు జన్మించారు. భరణిగారి భార్య పేరు దుర్గాభవాని. ఈ దంపతులకు మహాతేజ, సౌందర్యలహరి కుమారుడు, కుమార్తెలు. ఆయన నిర్మించుకున్న స్వగృహానికి కుమార్తె పేరు పెట్టుకున్నారు.

తనికెళ్ల భరణి ఇంటర్ చదివే సమయంలో ఆయన మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన దేవరకొండ ప్రసాద్ ప్రేరణతో రచనలు చేయయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆయన ‘అగ్గిపుల్ల ఆత్మహత్య, కొత్త కాలాలు’ అనే కవితలను రాశారు. తరువాత బీకాం చదివే సమయంలో రాళ్లపల్లితో పరిచయం అయింది. అప్పుడు ఆయన సహకారంతో ఆయన రాసిన ‘ముగింపు లేని కథ’ నాటకంలో తనికెళ్ల భరణి 70 సంవత్సరాల వృద్ధుడి పాత్రను పోషించారు. ఆ నాటకం మంచి విజయం సాధించడంతో భరణికి నాటకరంగంలో ఒక స్థిరమైన స్థానం లభించింది.

రాళ్లపల్లి అప్పట్లో ‘‘శ్రీ మురళీ కళానిలయం’’ అనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒకనాడు రాళ్లపల్లి ప్రత్యేక పనిమీద మద్రాసుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆ నాటక సంస్థకు రచయితలు కరువయ్యారు. ఆ సమయంలో భరణికి నాటక రచయితగా నిలదొక్కకుకోవడానికి ఒక మంచి అవకాశం లభించింది. ఆ సంస్థ కోసం ఆయన దాదాపు 10 నాటకాలను రచించారు. అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన ‘గోగ్రహణం’ అనే నాటకానికి సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం విశేషం.
అప్పట్లో ఔత్సాహిక నాటకాలు వేయడానికి వేదికగా ‘రవీంద్ర భారతి, నారద గానసభ’ వంటి నాటకరంగస్థలాలు వున్నా… వాటికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వుండేది. అప్పుడు భరణి దగ్గర వాటిని వెచ్చించే డబ్బులు లేకపోవడంతో భరణి తాను పనిచేస్తున్న సంస్థవారు బెంగాలీ నాటకకర్త అయిన ‘బాదల్ సర్కార్’ ను ప్రేరణగా తీసుకుని వీధి నాటకాలు చేయడం మొదలపెట్టారు. అందులో ఆయన మొదటిది ‘బాలశిక్ష’ నాటకం. భరణి ఇందులో నటించడమే కాక నాటకాల దర్శ్కత్వ బాధ్యత కూడా వహించారు. నాటకాల్లో భరణి ఎక్కువగా విలన్ పాత్రలే పోషించేవారు.

రంగస్థలం నుంచి

తొలుత ఆయన రంగస్థల రచయిత. సాహితీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా… ఇంటర్మీడియట్‌ వరకూ ఏ రచన చేయలేదు. తప్పని పరిస్థితుల్లో కళాశాలలో ఓ నాటకం ప్రదర్శించాల్సిన సందర్భంలో ఆయనలో రచయిత బయటపడ్డారు. అద్దెకొంప పేరుతో ఆయన రాసిన నాటకానికి సహచర విద్యార్థులు, కళాశాల అధ్యాపకుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఆ నాటకం మొదటి బహుమతిని అందుకుంది. ఆ తర్వాత్తర్వావాత మిత్రులు దేవరకొండ నరసింహ ప్రసాద్‌ ప్రోత్సాహంతో రాసిన అగ్గిపుల్ల ఆత్మహత్య కవిత పత్రికలో చోటు చేసుకుంది. బి.కామ్‌ చదువుతుండగా రాళ్ళపల్లితో పరిచయం… స్నేహం ఆయన్ని నాటక కళ పట్ల ఇష్టాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపకరించింది. రాళ్ళపల్లి రాసిన ముగింపు లేని కధ నాటకం విజయవంతమైన తరువాత తనికెళ్ళ భరణి పేరు వివిధ నాటక సంస్థల్లో ప్రచారంలోనికి వచ్చింది. రాళ్ళపల్లి చెన్నయ్‌ వెళ్లిపోవడంతో… ఆయన నిర్వహిస్తున్న శ్రీ మురళీ కళానిలయం సంస్థకు రచయిత కొరత ఏర్పడింది. తనికెళ్ళ భరణి ఆ కొరతను తీరుస్తూ ఆ నాటక సంస్థ కోసం 10 నాటకాలు రచించారు. ఆ నాటకాలకు తల్లావజ్జుల సుందరం దర్శకత్వం వహించారు. స్త్రీవాదాన్ని బలపరుస్తూ భరణి రాసిన గోగ్రహణం నాటకం సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది.

సినిమా రచయితగా
తనికెళ్ళ భరణి రాసిన చల్‌ చల్‌ గుర్రం నాటకం అయన చలన చిత్ర ప్రవేశానికి ఊతమిచ్చింది. ఆ నాటకాన్ని చూసిన రాళ్ళపల్లి వంశీకి భరణి పరిచయమయ్యేలా చూసారు. దాంతో… భరణికి ‘కంచు కవచం’ చిత్రానికి పనిచేసే అవకాశం దక్కింది. ఆ చిత్రానికి సంభాషణలు సమకూర్చడమే కాకుండా… నటుడిగా ఓ వేషం కూడా భరణి వేశారు. ఆ తరువాత వరుసగా సినీ అవకాశాల్ని ఆయన దక్కించుకున్నారు. ఆయన రాసిన చిత్రాల్లో ‘లేడీస్‌ టైలర్‌’ బాగా గుర్తింపు తెచ్చింది. ‘ఆలాపన’, ‘కనక మహాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌’, ‘లాయర్‌ సుహాసిని’, ‘సంకీర్తన’, ‘వారసుడొచ్చాడు’, ‘మహరి’్ష, ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘శారదాంబ’, ‘చిన్నారి స్నేహం’, ‘స్వరకల్పన’, ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’… ఇలా చాలా చిత్రాలకు కలం బలం అందించారు. తెలంగాణ మాండలికంలో మాటలు రాయడంలో భరణి సిద్ధహస్తుడు. ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’ చిత్రంలో నాయిక విజయశాంతి పాత్రకు తెలంగాణ మాండలికంలోని మాటలు రాసి శభాష్‌ అనిపించుకున్నారు. ఇక నటుడిగా కూడా తన ప్రతిభ చూపించారు. ‘లేడీస్‌ టైలర్‌’, ‘కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌’, ‘చెట్టుకింద ప్లీడర్‌’, ‘స్వరకల్పన’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘చెవిలో పువ్వు’, ‘ సీతారామయ్య గారి మనవరాలు’, ‘మనీ’, ‘గాయం’, ‘యమలీల’, ‘శుభలగ్నం’, ‘మనీ మనీ’, ‘ఘటోత్కచుడు’, ‘ఘ్రాణబుల్లోడు’, ‘బిగ్‌ బాస్‌’, ‘మాయాబజార్‌’, ‘దెయ్యం’, ‘పెళ్లి సందడి’, ‘మావిచిగురు’, ‘వినోదం’, ‘ఎగిరే పావురమా!’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘పరదేశి’, ‘తమ్ముడు’, ‘ఆమ్మో…ఒకటో తారీఖు’, ‘యమజాతకుడు’, ‘పెళ్లి సంభంధం’, ‘చక్రం’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వూ నేను’, ‘ఫామిలీ సర్కస్‌’, ‘ప్రియమైన నీకు’, ‘ఆమ్మో బొమ్మ’…ఇలా చాలా సినిమాల్లో నటించారు. కమెడియన్‌గా, విలన్‌గా ఆయన వైవిద్యం చూపించారు.

కొన్ని విశేషాలు భరణి మాటల్లోనే…..

లేడీస్‌ టైలర్‌ సినిమాకు నేను మాటల రచయితను. అయితే అంతకుముందు నాకు నాటకాల్లో నటించిన అనుభవం ఉన్నట్లు వంశీ గారికి తెలియదు. నటీనటులకు సీన్లు వివరిస్తుంటే ‘బాగా చేస్తున్నావయ్యా నువ్వే ఎందుకు నటించకూడదు’ అని అప్పటికప్పుడు నాతో వేషం వేయించారు. అలా సినీనటుడ్నయ్యాను.

బాపుగారి చమత్కారం
బాపుగారి సినిమా ‘పెళ్ళి పుస్తకం’ షూటింగ్‌ జరుగుతోంది. దానిలో నాక్కూడా ఒక పాత్ర ఇస్తే బావుణ్ననిపించింది. కానీ వాళ్ళు పిలవలేదు. అనుకోకుండా ఒక రోజు కబురు వచ్చింది. అది హీరో, హీరోయిన్ల ఫస్ట్‌ నైట్‌ సీన్‌. వారిరువురి మధ్యకూ పురోహితుడి తమ్ముడిగా ప్రవేశించి దక్షిణ గురించి అడిగే పాత్ర నాది. ఆ సన్నివేశంలో నేను శ్లోకాలు కూడా చెబితే బావుంటుందన్నారు బాపుగారు. గుర్తొచ్చిన ఏవో రెండు శ్లోకాలు చెప్పేసి సీను కానిచ్చేశాను. ఇక బయల్దేరబోతుంటే బాపుగారు నా చేతిలో పదివేల రూపాయల చెక్కు పెట్టారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర వేస్తేనే చాలనుకున్న నేను డబ్బులు వద్దన్నాను. ఆయన వినకుండా బలవంతంగా ముట్టచెప్పారు. ఇవ్వవలసిన డబ్బులే ఎగ్గొట్టే ఈ ఇండస్ట్రీలో ఇంత చిన్న వేషానికి పదివేలా! అని ఆశ్చర్యపోతుంటే, రమణగారు వచ్చి పదివేల రూపాయల కట్ట చేతిలో పెట్టారు. ఆల్రెడీ చెక్కు ఇచ్చారండీ అన్నాను. ‘అది నీ నటనకు, ఇది నీ రచనకు’ అన్నారాయన. స్ర్కిప్ట్‌లో లేని శ్లోకాలను చెప్పినందుకు కూడా రెమ్యూనరేషన్‌ ఇచ్చి వారి దొడ్డ మనసు చాటుకున్నారు. అలా నాకు డబుల్‌ రెమ్యూనరేషన్‌ ఇప్పించిన సీను, తీరా చూస్తే సినిమాలో లేదు. అదేంటండీ అని బాపుగారిని అడిగితే, ‘నీ నటన మాకు బాగా నచ్చి దాన్ని ఎడిట్‌చే సి మేమే ఉంచేసుకున్నామయ్యా’ అని చమత్కరించారు. ఇంతకీ విషయమేమిటంటే నిడివి ఎక్కువయిందని కత్తిరించిన సీన్లలో ఇదీ ఉందట.

‘అద్భుతః’ అసలు కథ
నేను దర్శకత్వం వహించిన ‘మిథునం’ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం మేనరిజం ‘అద్భుతః’ అనే మాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. నిజానికి ఆ పదం ‘అష్టా చెమ్మా’ సినిమాలో అనుకోకుండా నా నోటినుంచి వచ్చిందే. ఆ సినిమాలో నేను వంకాయ పచ్చడి చేస్తూ అవసరాల శ్రీనివాస్‌తో మాట్లాడే సన్నివేశం ఒకటి ఉంది. అప్పుడు నిజంగానే వంకాయను పుటంపెట్టి కాల్చి శాస్త్రోక్తంగా పచ్చడి చేశాను. సీన్‌ ప్రకారం అతడితో మాట్లాడటం అయిపోయాక పచ్చడి బండ నాకి రుచి చూడాలి. అలా రుచిచూస్తూ పచ్చడి చాలా బాగా కుదరటంతో అప్రయత్నంగా ‘అద్భుతః’ అనేశాను. దాన్ని అలా సీన్‌లో ఉంచేశారు. ఆ ఎక్స్‌ప్రెషన్నే తరువాత ‘మిథునం’లో వాడాను.

పిండి పులిహోర కథ
‘పిండి పులిహోర’ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్‌ వంటకం. దాన్ని ‘మిథునం’ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం తినే దృశ్యం ఒకటుంది. అందుకోసం పిండి పులిహోర తెప్పించమని ఆర్ట్‌ డైరెక్టర్‌తో చెప్పా. తీరా షాట్‌ తీద్దామనుకుంటుండగా చూస్తే ఒక గిన్నెలో పులిహోర, మరో గిన్నెలో పిండి ఉన్నాయి. అతడికి పిండితో చేసే పులిహోర గురించి తెలియదట. సినిమా కాబట్టి ఏదోలా మ్యానేజ్‌ చేసేశామనుకోండి.

గుమ్మడికాయ అభిమానం
పరదేశి సినిమా షూటింగ్‌కు అమెరికా వెళ్ళినప్పుడు నాకు, ఎమ్మెస్‌ నారాయణకు, బ్రహ్మానందానికి, బాబూమోహన్‌కు ఒకే మోటెల్‌(అక్కడి హోటల్స్‌ని అలా అంటారు)లో బస ఏర్పాటు చేశారు. ఒక రోజు మమ్మల్ని తీసుకెళ్ళడానికి కారు రాలేదు. అందరం ఆకలితో నకనకలాడి పోతున్నాం. మోటెల్స్‌లో వంట చేసుకోవడానికి కింద ప్రత్యేకంగా రూముల ప్రకారం విడి విడిగా స్టవ్‌లూ, పాత్రలూ ఉంటాయి. కానీ కూరగాయలు, సరుకులూ మనమే తెచ్చుకోవాలి. కింద కెళ్ళి చూస్తే మాకు కేటాయించిన ప్రదేశాల్లో ఒక చోట సేమ్యా వంటిది దొరికింది. నాకు కాస్త గరిటె తిప్పడం అలవాటుండడంతో చుట్టుపక్కల ఉన్న ఇతరుల స్టౌల దగ్గరకెళ్ళి దొంగచాటుగా వెతికితే ఒక ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వంటివి కనిపించాయి. వాటితో ఉప్మా చేస్తే అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. మర్నాడు షూటింగ్‌కు వెళ్ళాక ఈ విషయం దర్శకుడు రాఘవేంద్రరావు గారికి తెలిసి, ‘నీకు ఈ రోజు షూటింగ్‌ కాన్సిల్‌, నేను ఉంటున్న వారింట్లో మంచి గుమ్మడికాయ ఉంది. దానితో చక్కగా కూర వండటమే ఈ రోజు నీ షెడ్యూల్‌’ అని నన్ను ఆయన ఉంటున్న ఇంటికి పంపించారు. నేను వంట చేసి గుమ్మడికాయ కూరతో అందరికీ విందు చేశాను. నా వంట ఆ ఇంటిగల వాళ్ళకు కూడా బాగా నచ్చింది. నన్ను మర్నాడు వారు తమ ఇంటికి ఆహ్వానించారు. వారి అభిమానానికి పొంగిపోతుంటే అప్పుడు తెలిసింది, వారు నన్ను రమ్మన్నది నా చేత గుమ్మడికాయ కూర వండించి, వారి స్నేహితులకు కూడా రుచి చూపించడానికట!

పెట్టుడు గెడ్డం అంటే తగని చిరాకు
నాకు పెట్టుడు గడ్డం అంటే తగని చిరాకు. అందుకోసం రెండు మూడు సినిమాలు కూడా వదిలేసుకున్నా. ‘బాహుబలి’లో నాది స్వామీజీ పాత్ర. గడ్డం ఉంటుందని తెలిసినప్పటికీ, ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుందని నా మనసుకు అనిపించడంతో ఒప్పేసుకున్నాను. అయితే పెట్టుడు గడ్డం అవసరం రాకుండా ఆ పాత్ర అనుకున్నప్పటి నుంచీ గడ్డం పెంచాను. అయినా ఉపయోగం లేకపోయింది. షూటింగ్‌కి వెళ్ళగానే ఇంత బారు పెట్టుడు గడ్డం నా చేతికిచ్చారు. రాజమౌళి గారినడిగితే ‘మీ గడ్డం చాలదండీ, బారు గడ్డం ఉండాల్సిందే’నన్నారు. ఇక తప్పలేదు. ఆ సినిమాలోని నా డైలాగ్‌ ‘శివయ్యేటి చేత్తాడో మనకేటి తెల్సూ…’ అనుకుంటూ ఆ కేరళ అడవుల్లో పదిహేను రోజులపాటు షూటింగ్‌ కానిచ్చేశాను.

నాటకానుభవమే కాపాడింది
అది ‘దయామయుడు’ షూటింగ్‌ ఆఖరి రోజు. రాత్రి పన్నెండయ్యింది. 400 అడుగుల చివరి షాట్‌ అది. ఇంచుమించు ఆ షాట్‌ మొత్తం నా డైలాగులతోనే ఉంది. మధ్య మధ్యలో రెండు మూడు చిన్న చిన్న డైలాగులు ఇతరులవి ఉన్నాయి. ఆ రోజుతో ఆర్టిస్టుల డేట్సన్నీ అయిపోయాయి. ఏమైనా సరే ఆ రోజే షూటింగ్‌ పూర్తయిపోవాలి. చూస్తే ఫిల్మ్‌ కూడా 400 అడుగులే ఉంది. ల్యాబ్‌ పదకొండింటికే మూసేస్తారు. ఫిల్మ్‌ దొరికే టైం కూడా కాదది. విజయచందర్‌గారు నా దగ్గరకొచ్చి ఏం చేస్తావో తెలీదు, షాట్‌ మొత్తం ఒకే టేక్‌లో అయిపోవాలి. అన్ని డైలాగ్‌లు ఎలా గుర్తుపెట్టుకుంటావో ఏమో! నీదే భారం అన్నారు. నాకు లోలోపల టెన్షన్‌ మొదలైంది. అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా సింగిల్‌ టేక్‌లో షాట్‌ కానిచ్చేశాను. అందరం ఊపిరి పీల్చుకున్నాం. నాటకానుభవం ఉండటమే అప్పుడు నన్ను కాపాడింది.

ఎన్నో పురస్కారాలు
అసాధారణమైన నటనకు, ర్చ్నలకూ తనికెళ్ల భరణిని ఎన్నో పురస్కారాలు వరించాయి. వాటిలో…
నంది అవార్డులు
‘సముద్రం’ సినిమాలో ఉత్తమ విలన్‌గా, ‘నువ్వూ నేను’ సినిమాలో ఉత్తమ సహాయనటుడిగా, ‘మిధునం’ సినిమాకి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. ‘మిధునం’ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా సినిమా అవార్డు అందుకున్నారు.

సంగం అవార్డు
తెలుగు సినిమాలో 25 సంవత్సరాలపాటు సృజనాత్మక సేవలు అందించినందుకు సంగం సంస్థ అవార్డుతో తనికెళ్ళ భరణిని సత్కరించింది.

సాహితీ పురస్కారాలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సాహితీ అవార్డు, భానుమతి అవార్డు, శ్రీకాకుళంలో యగళ్ళ ఫౌండేషన్ అవార్డు, శ్రీ వానమామలై వరదాచార్యులు సాహితీ పురస్కారం, కావలిలోని జవహర్‌ భారతి సంస్థ పురస్కారం, అల్లు రామలింగయ్య జాతీయ అవార్డు, అక్కినేని స్వర్ణ కంకణం, నెల్లూరు నాగబైరవ కోటేశ్వరరావు సాహితీ పురస్కారం…ఇలా అనేక పురస్కారాలు తనికెళ్ళ భరణి అందుకున్నారు.

‘ఆటగదరా శివా.. ఆటగదరా కేశవా అంటూ ఆలపించిన భరణి ‘నాలోన శివుడు కలడు…నీలోన శివుడు కలడు … నాలోన కల శివుడు నీలోన కల శివుడు లోకమ్ము నేలగలడు… కోరితే శోకము బాప గలడు…’ అంటూ ఆధ్యాత్మిక సందేశాలు కుడా ఆందిస్తున్నారు.

నాటక రచయితగా, నటుడిగా తనదైన ముద్ర… క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 750 సినిమాలు… మూడు నంది అవార్డులు… రచయితగా ఎనిమిది పుస్తకాలు… దర్శకుడిగా మూడు షార్ట్‌ ఫిల్మ్‌లు, ఒక జనం మెచ్చిన సినిమా… ఇదీ తనికెళ్ళ భరణి ట్రాక్‌ రికార్డ్‌. ‘డిసైడ్‌ చేస్తా’, ‘అద్యెచ్ఛా’(అధ్యక్షా), ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అంటూ ఆయన తనదైన శైలిలో పలికిన డైలాగులు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయేవే. ఆ ‘బహుముఖ ప్రజ్ఞా’భరణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిద్దాం.

Send a Comment

Your email address will not be published.