తెలుగు సంగీత త్రయంలో మణిపూస శ్యామశాస్త్రి
ఫిబ్రవరి 6 శ్యామశాస్త్రి వర్థంతి
కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో త్యాగరాజు , ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్యామశాస్త్రి (ఏప్రిల్ 26, 1763 – ఫిబ్రవరి 6, 1827) ప్రముఖులు. శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవాడు. ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు వాగ్గేయకారులు. కర్నూలు జిల్లాలోని కంభంలో శ్యామశాస్త్రి తల్లిదండ్రులు ఉండెడివారు.మహమ్మదీయుల దండయాత్రలకు బెదరి వీరు కంచిక్షేత్రం చేరుకొనిరి. ఆదిశంకరులకు ఆరాధ్యమగు కంచి కామాక్షి విగ్రహం వీరికి అక్కడ లభించింది. అటుపై కాంచీపురంబున ఆకాలమున (క్రీ.శ.16వ) శ్రీ బంగారు కామాక్షి దుష్ట తురకల కలహమువలన పూజారులను, ఔత్తరులైన కొన్ని సాంస్థానీకులతో శ్యామశాస్త్రి తల్లి దండ్రులు వెడలి, శ్రీపురమను తిరువారూరి క్షేత్రమునకువచ్చి, రమారమి 35సం.లవరకు తంజపురిరాజుల వలన నేర్పరుపబడిన పూజోపచారాదుల అంగీకరించుకొనిరి. వీరు అత్యంత శ్రీమంతులు. శ్రీ శ్యామశాస్త్రి తల్లిదండ్రులు శ్రీ కామాక్షిని అత్యంతభక్తితో పూజించుకొని యుండుటయుకాక, తమకు అప్పటికి పుత్రుడు లేనందున ప్రతిమాసమునందును, కడపటి స్థిరవారములో వేంకటాచలపతికి ప్రీతిగా బ్రాహ్మణ సంతర్పణలు చేసుకొనిఉండెడినప్పుడు, ఒక స్థిరవారమున ఒక బ్రాహ్మణుని మీద వేంకటాచలపతి యావేశించి “ఓ దంపతులారా! మీకు ఒక సం.లోపల యశోవంతుడైన ఒక పుత్రుడు కలుగునని” చెప్పినట్లే ఇతనితల్లి గర్భవతిఅయి క్రీ.శ1763లో చిత్రభానుసం. మేష రవి కృత్తికా నక్షత్రమునందు శ్రీనగరమను తిరువారూరిలో శ్యామశాస్త్రిలు జన్మించిరి ఒక కథ ప్రాచుర్యములో ఉంది.
శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్నతనంలో ముద్దుపేరుగా శ్యామకృష్ణ గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవహరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు.
తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు.
శ్యామశాస్త్రి రచించిన అనేక కీర్తనలు ఉల్లాసం కలిగించేవి, చక్కని లయ, తాళ ప్రదర్శనలకు అనుగుణంగా ఉండేవి. నాడోపాసన ద్వారా ఆత్మానందం సాధించవచ్చని ఆయన అభిప్రాయ పడేవారు. శ్యామశాస్త్రి తెలుగు, తమిళ, సంస్కృత భాషలలొ అనేక కృతులు, కీర్తనలు రచించినా అధికభాగం తెలుగులోనే వ్రాశారు. అయితే, త్యాగరాజు తన కీర్తననలో భావ రాగలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా, శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన ‘తాళ’ రచన చేసినట్లు సంగీతాభిమానులు అంటారు. శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన రచనతోపాటు, ఆయనకు శిష్యులు అధిక సంఖ్యలో లేకపోవడం వల్ల కూడా, ఈయన కీర్తనలు అధిక ప్రాచుర్యం పొందలేదని వారు భావిస్తారు. శ్యామశాస్త్రి రచించిన “ప్రోవవమ్మ” , “మాంజిరాగం” అలాగే ‘కల్లడ ’(కలగడ ), ‘చింతామణి ’ రాగాలు, “హిమాద్రిసుతీ ” అనే కీర్తన, ఒకే స్వరంతో సంస్కృతం,తెలుగు భాషలలొ వేరు వేరుగా రాసిన ఆయన కీర్తనలు సంగీత కళాకారులందరికి సుపరిచతమే.
శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన ఆనంద భైరవీ, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజి, కాపి, చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వర పరిచాడు. సంగీత పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో “రావే హిమగిరి కుమారి”, భైరవి రాగంలో ‘కామాక్షీ అనుదినము’వంటివి కొన్ని ప్రసిద్ధి జెందిన స్వరజతులు.
ఈ స్వరజతులే కాకుండా విలోమ చాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. సాధారణంగా చాపు తాళం గతి 3 + 4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4 + 3 రీతిలో తాళ గతిని మార్చి కొన్ని కీర్తనలు స్వరపరిచాడు. పూర్వి కళ్యాణి రాగంలో ‘నిన్ను వినగ మరి’, ఫరజ్ రాగంలో ‘త్రిలోకమాత నన్ను’ అనేవి ఈ విలోమ చాపు తాళంలో ప్రసిద్ది చెందిన కీర్తనలు.
శ్యామశాస్త్రి తపాలా బిల్లతంజావూరు జిల్లాలో తిరువాయూరులో ఉన్న కామాక్షి దేవాలయ అర్చకత్వం చేసుకుంటూ, తన గాన కళా పాండిత్యంలో కామాక్షి అమ్మవారి సేవలో, ఆమె సన్నిధానంలోనే ‘ శ్యామకృష్ణ’ అనే ముద్రతో అనేక కీర్తనలు, కృతులు రచించాడయన.
శ్యామశాస్త్రి ఇంటి ఇలవేల్పుగా కామాక్షిదేవిని కీర్తిస్తూ, తమ ఇంటి ‘ఆడపడుచుగా’ అమ్మవారిని భావిస్తూ – అపూర్వం, అనన్య సామాన్య కృతులెన్నింటినో శ్యామశాస్త్రి రచించాడని ఆయన శిష్యులు – ప్రముఖ సంగీత కళారాధకులు పేర్కొంటారు. అందువల్లనే, శ్యామశాస్త్రి తన కీర్తనలలో కొన్నింటిని “శ్యామకృష్ణ – సహోదరి” అని పేర్కొన్నట్లు వారు అంటారు.
శ్యామశాస్త్రి కుమారుడు శ్రీ సుబ్బరాయశాస్త్రి కూడా ప్రముఖ వాగ్గేయకారిడిగా ప్రసిద్ది చెందాడు. శ్రీ అలసూరు కృష్ణయ్య , శ్రీ తలగంబాడి పంచనాదయ్య తదితరులు శ్యామశాస్త్రి శిష్యులలో ప్రముఖులు.