సామాజిక ప్రయోజనమే లక్ష్యం

సమాజ సేవకు పునఃరంకితం – కృష్ణ నడింపల్లి

Krishna-Nadimpalli-OAM‘భారతీయత’ ఉనికిని కాపాడుకుంటూ స్థానిక సంస్థలతో మమేకమై ఆస్ట్రేలియా దేశాభివృద్ధికి అందరూ నడుం కట్టాలన్న సంకల్పంతో అంచలంచెలుగా జీవన యానం సాగించిన ఒక పోరాట యోధుని కధనమిది.  తాను ఎదుగుతూ తనతోపాటు చుట్టూ ఉన్న నలుగురినీ ఎదగడానికి అవకాశం కల్పిస్తూ క్రొత్తగా వలస వచ్చినవారి అవసరాలను, ప్రభుత్వ పరంగా వస్తున్న మార్పుల పరిణామాలు దృష్టిలో పెట్టుకొని భావితరాలకు ఒక పూలబాటనేర్పరచాలన్న తలంపుతో దార్శనిక పాత్రను ధరించిన సేవాతత్పరుని వైనమిది.

కృష్ణ నడింపల్లి – ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఈ పేరు పలుమార్లు వినేవుంటారు.  కాన్బెర్రా తెలుగు సంఘం వ్యవస్థాపక సభ్యులు మరియు అధ్యక్షులుగా, FINACT (Federation of Indian Associations in ACT) అధ్యక్షులుగా,  FTAA (Federation of Telugu Associations in Australia) వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఇంకా ఎన్నో సంస్థల కార్యవర్గ సభ్యులుగా, ACT మరియు ఫెడరల్ ప్రభుత్వ కార్యక్రమాలకు వాచస్పతిగా బాధ్యతలను నిర్వహించి భారతీయులతో పాటుగా స్థానిక సంస్థలతో మమేకమై మన ప్రయోజనాలకెప్పుడూ పెద్ద పీట వేసి సామాజిక సేవలో గత 20 ఏళ్లుగా నిమగ్నమై ఉన్నారు.  వారి సేవకు గుర్తింపుగా ఈ సంవత్సరం కేంద్రప్రభుత్వం నుండి OAM (Order of Australia Medal) అందుకున్నారు.  రెండేళ్ళ క్రితం ACTలో  బహుళ సంస్కృతి పురస్కారం అందుకున్నారు.

బహుళ సంస్కృతీ సాంప్రదాయానికి పట్టంగట్టే ఆస్ట్రేలియా దేశంలో నిర్ణయాత్మకమైన ఆలోచనా దృక్పధం ఉండాలే కానీ అవకాశాలకు కొదువ లేదు.  శ్రీ కృష్ణ గారు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మన భారతీయులకు ఉపలభ్యమయ్యే  ఎన్నో ప్రతిపాదనలు చేసి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భారతీయులు లబ్ది పొందడంలో విజయం సాధించారు.

  1. 2017లో ఆస్ట్రేలియా పౌరసత్వ సంబంధమైన నిబంధనలకు సంబందించి స్థానిక సంస్థల మద్దతుతో ప్రభుత్వ పరమైన చట్ట సవరణలకు వ్యతిరేకంగా సెనేట్ కమిటీ విచారణలో తన వాదనలు వినిపించారు. అనేకమంది పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలుపడం వలన ఈ సవరణలు చట్ట సభలో అమలు కాలేదు.
  2. ‘ఆస్ట్రేలియాలో వరకట్నం మరియు దుర్వినియోగం’ పై ఒక న్యాయ విచారణ సంఘం నియమింపబడింది. ఈ సంఘానికి ఇతర స్థానిక సంస్థల సహాయంతో ‘Dowry – A Disgrace and Inhumane Practice’ అన్న అంశంపై  ఒక అర్జీ పెట్టడం జరిగింది.
  3. ‘తెలుగు భాష’ కమ్యునిటీ భాషగా గుర్తించాలని గత ఐదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ప్రస్తుతం NAATI వారు తమ పట్టికలో తెలుగు అనువాదకులు మరియు భాష్యకారులు కావాలని చేర్చే స్థితికి వచ్చింది. కమ్యునిటీ భాషగా గుర్తింపు అతి త్వరలో జరగగలదని ఆశాభావంతో ఉన్నారు.
  4. భావి తరాలకు ఉపయోగపడే ఎన్నో సామాజిక కేంద్రాలను నిర్మించడానికి పథకాలు తయారుచేయడం అందులో కొన్ని కార్యరూపం దాల్చడం కూడా జరిగింది.
  5. ఆధ్యాత్మిక మరియు విద్యా పరమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా ఆరేళ్ళ క్రితం కాన్బెర్రా నగరంలో కృష్ణ గారు తెలుగు సంఘం అధ్యక్షులుగా ఉన్నపుడు స్థాపించిన తెలుగు బడి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు సుమారు 60 మంది పిల్లలు మన భాషను నేర్చుకుంటున్నారు.
  6. మానసిక రుగ్మతలను తగ్గించడానికి ‘ఆర్ట్ అఫ్ లివింగ్ ఫౌండేషన్’ వారి ద్వారా వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
  7. కాన్బెర్రాలో ఊబర్ టాక్సీలకు అనుమతినిచ్చినపుడు స్థానిక వ్యాపార సంస్థల ప్రయోజనాలు కాపాడే నిమిత్తం ఒక విజ్ఞాపన పత్రాన్ని ACT ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది.

‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ గౌరవ పతకం (OAM) తన బాధ్యతను మరింత పెంచి నా జీవితంలో మలిదశకు శ్రీకారం చుట్టిందని’ శ్రీ కృష్ణ గారు చెప్పారు.  శేష జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేసి భావితరాలకు రాజకీయంగా, సామాజికంగా స్పూర్తినందివ్వాలని ధృడ సంకల్పంతో ముందుకెల్తున్నట్లు శ్రీ కృష్ణ గారు చెప్పారు.  సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న వారి ప్రయాణంలో మరెన్నో శిఖరాగ్రాలను అందుకోవాలని తెలుగుమల్లి ఆకాంక్షిస్తోంది.

మరిన్ని వివరాలు https://krishnanadimpalli.com.au/ లో చూడవచ్చు

Send a Comment

Your email address will not be published.