తెలుగు నేల ఎంతోమంది సాహితీమూర్తులకు జన్మనిచ్చిన నేల. అటువంటి నేలపై పుట్టిన అనన్య సాహితీ నిధి పుట్టపర్తి నారాయణాచార్యులు. తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు. తెలుగు, మళయాళం, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అనితర సాధ్యమైన విశేష ప్రతిభ చూపిన పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు
సెప్టెంబర్ 1 ఆయన వర్థంతి. ఈ సందర్భంగా ఆయన జీవితం- రచనల్ని విశ్లేషిస్తూ ఒక ప్రత్యేక వ్యాసం
పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి. తండ్రి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది. నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయన తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు. పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్లసాహిత్యం నేర్చుకున్నారు
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పనిచేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.
ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. ఆయనకి పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని ఇచ్చిన సమాచారంప్రకారం ఆయన చేసిన అనువాదాలు – అవధీ భాషనుండి తులసీదాస్ రామయణం, బ్రజ్ భాషనుండి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలు, పాత అవధీ, బ్రజ్ భోజ్ పురీ భాషల మిశ్రమంనుండి కబీర్ దోహాల హింది. పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువదించారు.
హృషీకేశ్ లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు “సరస్వతీపుత్ర” బిరుదునిచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.
“లీవ్స్ ఇన్ ది విండ్”, దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన “ది హీరో” ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయన ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. ఆయనకు ఆంగ్లం నేర్పిన వి.జే. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
అయితే పిట్ దొరసాని మాత్రం “ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు.” అని చెప్పింది. దాంతో ఆయన చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు ది హీరో నాటకాన్ని వ్రాశారు. కథంతా స్వీయ కల్పితమే.
ఆయన చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు ఆయన్ను పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి ఆయనకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ “ఆయన్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని” సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ “సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?” అని అడిగి, ఆయన దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: “కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ” అని.
భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. గుర్రం జాషువా “పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?” అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో ఆయన సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి. ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పనిచేసి 1990 సెప్టెంబర్ 1న కాలధర్మం చెందారు. .
సాధనా సంపత్తి.. సాహితీ సుధ
సాహిత్యాకాశంలో పుట్టపర్తి ధ్రువతారగా ఎలా నిలిచారో సాధనాపరంగానూ వారిస్థాయి అంతే ఎత్తులో ఉంది..కేవలం యే ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదని సంసారాన్ని విడచి సాధువులను వెతుక్కుంటూ హిమాలయాల దారి పట్టి అక్కడ స్వామి శివానంద సరస్వతిని భగవత్సంకల్పితంగా కలిసి వారిచే సరస్వతీ పుత్రా అనిపించుకుని నడిచేదైవం కంచి పరమాచార్యులు చంద్రశేఖరులచే అమితంగా ప్రేమింపబడి నీ అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది అని వారిచే ఆశీర్వాదమందిన పుణ్య చరితులు పుట్టపర్తి. నా గత జన్మ యేమిటి ఈ జన్మలో నా స్థితి యేమి కృష్ణ సాక్షాత్కారం అవుతుందా..ఇదే ప్రశ్న పుట్టపర్తి తోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది.. ఈ వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికీ,ఆరాధించేవారికీ, ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి ఎవ్వరి జేవితం లోనూ కనిపించని వైవిధ్యాలు పుట్టపర్తిలో ఉన్నాయి జ్యోతిష్య పండితులు పుట్టపర్తి పాండిత్యానికీ ‘సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళలలో అభినివేశానికీ ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది పుట్టపర్తి వారి జాతక వివరాల కోసం మీరు ఈ లింక్ ను దర్శించవలసి వుంటుంది. [3] తప్పకుండా వారు వారి గమ్యాన్ని చేరారని మేము వారి ప్రియ శిష్యులూ భావిస్తున్నాము వారి నిర్యాణ సమయంలో దగ్గరున్న గోవిందు అనే శిష్యుడు అయ్య ఇచ్చామరణం పొందినట్లు మాకనిపించిందమ్మా..వారి సహస్రారం నుంచీ ఆత్మ నిర్గమించిందనిమేము కనుగొన్నాము అని వివరించాడు..ముఖ్యంగా ఇంకో విషయం పుట్టపర్తి అంత్య సమయంలో వారి ఆధ్యాత్మ శిష్యులు మాత్రమే చుట్టూ వుండటం..భాగవతం దశమ స్కందం తీయమని బాబయ్య తదితరులకు చెప్పి వ్యాఖ్యానిస్తూ దాదాపు అరగంట గంట పాటు తెల్లవారి నాలుగ్గంటల నుంచీ.. ఏకాదశీ తిథి నాడు’ ‘ ‘శ్రీనివాసా..’ అని పడకపై ఒరిగిపోయారు.
కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా “పెనుగొండ లక్ష్మి” అనే గేయ కావ్యం రాశారు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయారు. దానికి కారణం “పెనుగొండ లక్ష్మి” కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు “పూర్తి” మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు రాశారు. తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన “శివతాండవం” గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై ఆయనను భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.
తెలుగులో ఆయన రాసిన “శివతాండవం” ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు “ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి” అని భావించేవారు.
ఉదాహరణకు—
“ కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!”
ఆయన 140 పైగా గ్రంథాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని “వ్యాసవల్మీకం”, మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మతో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.
ఆయన రాసిన అనేక కృతుల్లో కొన్ని…..
తెలుగులో స్వతంత్ర రచనలు – పద్యకావ్యాలు….పెనుగొండ లక్ష్మి, షాజీ, సాక్షాత్కారము, గాంధీజీ మహాప్రస్థానము,, శ్రీనివాస ప్రబంధం, సిపాయి పితూరీ, బాష్పతర్పణము, పాద్యము, ప్రబోధము, అస్త సామ్రాజ్యము, సుధాకళశము, తెనుగుతల్లి, వేదనాశతకము, చాటువులు
గేయకావ్యాలు……. అగ్నివీణ, శివతాండవము, పురోగమనము, మేఘదూతము, జనప్రియ రామాయణము
ద్విపద కావ్యం- పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)
వచన కావ్యాలు…….ప్రబంధ నాయికలు, వ్యాస సౌరభము, రాయలనాటి రసికతా జీవనము, రామకృష్ణుని రచనా వైఖరి, విజయాంధ్రులు, భాగవతోపన్యాసాలు, విజయతోరణము, సమర్థ రామదాసు, తెనుగు తీరులు, ఆంధ్రమహాకవులు, విప్లవ యోగీశ్వరుడు, శ్రీసాయిలీలామృతము, సరోజినీదేవి, నవ్యాంధ్ర వైతాళికులు, ఆంధ్రుల చరిత్ర, కర్మయోగులు, రాయల నీతికథలు (5 భాగాలు) మొదలైనవి.
నవలలు…… అభయప్రదానం, ప్రతీకారము, హరిదాసి
ఆంగ్లంలో స్వతంత్ర రచనలు….. Leaves in the Wind, Vain Glorions, The Hero
మలయాళంలో స్వతంత్ర రచనలు- మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు……త్యాగరాజ స్వామి సుప్రభాతం., మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం., శివకర్ణామృతము, అగస్త్యేశ్వర సుప్రభాతం, మల్లికార్జున సుప్రభాతం
అనువాదాలు
హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా (నవల)
మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్ (నవల)
మలయాళం నుండి:శ్మశానదీపం, కొందియిల్క్కురు సిలైక్కు (నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ (నాటిక),సెట్రక్కాడు కథలు, మలయాళం లోకి:ఏకవీర
ఇంగ్లీషు నుండి: మెఱుపులు – తలపులు, అరవిందులు, ఇంగ్లిషు లోకి:భాగవతం వంటి రచనలు ఆయన అద్వితీయ ప్రతిభకు నిదర్శనాలు.
విభిన్న వ్యక్తిత్వం
నారాయణాచార్యులు అహంభావిగా కనిపించే ఆత్మాభిమాని. తన కవిత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే నేను వ్రాసే తరహా కవిత్వం వారికి నచ్చలేదు అనుకుని ఊరుకునే వాడు. కానీ తనకు పాండిత్యం తక్కువంటే మాత్రం సహించే వాడు కాదు. నిజంగా తన సాహితీ కృషికి అవసరమైన అంశాల్లో తనకు తెలియనిదేదైనా ఉంటే పట్టుదలతో నేర్చుకునే వాడు. అందుకే “నేను పెద్ద పండితుణ్ణి. ఇందులో సందేహం లేదు. నేను ఏ పరీక్షకు నిలబడడానికైనా తయారే. అయితే వినయపరుణ్ణి. నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరుణ్ణౌతా.” అనేవాడు.
ఒకసారి ఆయన అనంతపురంలో జరిగిన సాహిత్యోపన్యాసాలకు వెళ్ళినప్పుడు కడపలో ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. గంటి జోగి సోమయాజి సభాధ్యక్షుడు. ఆ సభలో పుట్టపర్తి గురించి “ఆయనకు తెలుగు తప్ప ఏ భాషా రాదు. పధ్నాలుగు భాషలు వచ్చని ప్రచారం చేసుకుంటాడు.” అని విమర్శలు చేశారు. ఆ రాత్రే తిరిగి వచ్చిన ఆయన మరునాడు సభకు వెళ్ళి “14 భాషల్లో ఎవరు ఏ భాషలో నైనా ఏ ప్రశ్నైనా వేయవచ్చు.మీరు అడగండి. ఏ భాషలోనైనా సరే ఆశు కవిత్వం చెబుతాను.” అని సాహిత్యంలో అహంకారం అనే విషయం మీద రెండున్నర గంటలు మాట్లాడి “నాకు అహంకారముంది. దీంట్లో న్యాయముంది.” అన్నారు.