గోల్ఫ్ ఒక సీరియస్ అయిన ఆటగా అనుకుంటాం. అర్ధం కాని వాళ్ళైతే ఆ ఆటను బోర్ అని కూడా చెప్పుకుంటారు. అయితే అక్కడ కూడా కొన్ని విచిత్రకరమైన సంఘటనలు జరిగాయి.
అలెక్స్ డేవీ అనే అతను ఒక్కప్పుడు ఈ క్రీడలో ఛాంపియన్ గా ఉండేవాడు. ఓసారి ఆటను ఆడుతున్నప్పుడు వర్షం వచ్చింది. గొడుగు వేసుకుని నడుస్తున్నాడు. ఇంతలో గొడుగు అంచున పిడుగు తాకింది. అంతే భయపడిపోయి అతను ఒక చెట్టు కిందకు పరుగున వెళ్లి నిల్చున్నాడు. అక్కడ కూడా పిడుగు తాకింది. అదృష్టవశాత్తు చేతికి చిన్న గాయమైంది. బతుకుజీవుడా అనుకున్నాడు.
టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ గోల్ఫ్ ఆడుతున్నప్పుడు ఆకాశం నుంచి ఏదో ఊడి పడినట్టుగా ఆయన మీద ఓ వస్తువు పడింది. అయితే అదృష్టవశాత్తు ఆయనకు గాయమేమీ కాలేదు. ఆయన మీద పడ్డ ఆ వస్తువును విశ్వవిద్యాలయం వారు ఆయన నుంచి కొనుక్కున్నారు. అంతేకాదు ఆయనను సత్కరించారు కూడా. అదొక విలువైన వస్తువుగా విశ్వవిద్యాలయం వారు భావించి దాని మీద పరిశోధనలు చేశారు.
వేగ్ ఫీల్డ్ అనే చోట జొనాటిన్ అనే అతను గోల్ఫ్ ఆడుతున్నప్పుడు గొయ్యికి పది అడుగుల దూరంలో బంతి ఉంది. అతను బంతిని ఆ గొయ్యి లోకి నెడదామని సిద్దపడుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చిన ఒక పక్షి ఆ బంతిని ముక్కున కరచిపట్టుకుని మరో పది అడుగుల దూరంలో పడేసింది. గోల్ఫ్ ఆటలోని నిబంధనల మేరకు బంతిని మునుపున్న చోట పెట్టాలా లేక కొత్త చోటునే ఉంచాలా అనే దానిపై చర్చ జరిగింది. ఇంతలో ఆ పక్షి తిరిగి ఆ బంతిని ముక్కున కరచిపట్టుకుని ఎగిరిపోయింది. అసలు బంతే లేకుండా పోయింది.
– యామిజాల