స్టేజీ మీద పుట్టిన కమలాబాయి

స్టేజీ మీద పుట్టిన కమలాబాయి

టాలీవుడ్ చరిత్రలో తొలి టాకీ చిత్రంగా 1931 లో నిర్మించిన భక్త ప్రహ్లాద చిత్రంలో నాయికగా నటించిన సురభి కమలాబాయి స్టేజీ మీదే జన్మించారు. ఇది నిజం.

కమలాబాయి తల్లిదండ్రులు ఇద్దరూ నటులే. ఆమె తల్లి ఒక నాటకంలో నిండు గర్భవతి పాత్రలో నటిస్తుండగా జరిగిన సంఘటన ఇది. ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు కమలాబాయి తల్లి వెంకూబాయి నిజంగానే నిండు గర్భవతి. వెంకూబాయి స్టేజీ మీద ఒక పాట పాడుతుండగా ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆమెను మరెక్కడికో తరలించే పరిస్థితులు లేకపోవడంతో అప్పటికప్పుడు తెర దించడం, కమలాబాయి పుట్టడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి.

పెరిగి పెద్దయిన కమలాబాయి ఆతర్వాత సురభి నాటక రంగ సంస్థలో చేరి నాటకాలాడుతూ వచ్చారు. ఇంతలో టాలీవుడ్ లో స్వర్ణాక్షరాలతో రాయదగ్గ సంఘటన చోటుచేసుకుంది. దర్శకులు హెచ్ ఎం రెడ్డి భక్త ప్రహ్లాద చిత్రం కోసం నటీనటులను ఎంపిక చెయ్యడంలో అన్వేషణ మొదలుపెట్టారు. అప్పుడు ఆయన దృష్టిలో పడిన కమలాబాయికి తాను తీయబోయే భక్త ప్రహ్లాద చిత్రంలో నాయిక పాత్రలో నటించే అవకాశం కల్పించారు. తెలుగులో వచ్చిన తొలి టాకీ చిత్రంలో నటించిన తొలి నాయికగా సురభి కమలాబాయి రికార్డు పుస్తకాల కెక్కారు. ఈ చిత్రంలో ఆమె స్వయంగా ఒక పాట కూడా పాడారు. ఆ పాట ” …. పరితాప భారంబు భరియింప తరమా కటకట విధినెట్లు గడువంగ జాలుడు….” అని సాగుతుంది. ఈ పాటే తొలి టాకీ సినిమా గీతంగా చెప్పుకోవచ్చు. ఆపాటను చందాల కేశవదాసు రాసారు. ఈ చిత్రంలో ఆయన కొన్ని పద్యాలు, పాటలు రాసారు. ఆయనే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి సినీ గేయ రచయితగా వినుతికెక్కారు. కేశవదాసు ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో జన్మించారు. ఆయన హరికథలు చెప్పేవారు. ఆయన అష్టావధాని కూడా.

భక్త ప్రహ్లాద చిత్రంలో హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య (ఈయననే వల్లూరు సుబ్బయ్య అని కూడా అంటారు), లీలావతిగా సురభి కమలాబాయి, ప్రహ్లాదుడిగా మాష్టర్ కృష్ణా రావు, ఇంద్రగా దొరసామి నాయుడు, ప్రహ్లాదుడి మిత్రుడిగా ఎల్ వీ ప్రసాద్ నటించారు. బీ వీ సుబ్బారావు, చిత్రపు నరసింహా రావు తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు.

అప్పట్లో ఈ సినిమా తీయడానికి ఇరవై వేల రూపాయలు ఖర్చయ్యాయి.

ఈ సినిమా 108 నిముషాలపాటు సాగింది.

దర్శకత్వంలో హెచ్ ఎం రెడ్డికి సి ఎస్ ఆర్ ఆంజనేయులు కూడా సహకరించారు. ప్రహ్లాదుడి మిత్రుడిగా నటించడమే కాకుండా ఎల్ వీ ప్రసాద్ సహాయ దర్శకుడిగానూ పని చేసారు..

సురభి నాటక సంస్థ వారి స్టేజి నాటకాన్నే హెచ్ ఎం రెడ్డి తెరకెక్కించారు. దీనిని ఆంద్ర నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాసారు. కెమెరా : గోవర్ధన భాయ్ పటేల్.

ఈ చిత్రాన్ని సి ఎస్ ఆర్ పర్యవేక్షణలో బాంబే లోని ఇంపీరియల్ స్టూడియో లో చిత్రీకరించారు. దక్షిణాదిలో ఇది తొలి టాకీ చిత్రం.

మిత్రుడు, ఫిలిం హిస్టోరియన్ రెంటాల జయదేవ పరిశోధించిన వివరాల ప్రకారం ఈ చిత్రం 1932 ఫిబ్రవరి 6వ తేదీన బొంబాయిలోని న్యూ చార్లీ రోడ్ లో గల కృష్ణ సినిమాలో మొదటిసారిగా విడుదల అయ్యింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో అదే రోజు ఈ చిత్రంపై సమీక్ష కూడా వచ్చింది. విడుదలకు ముందు ప్రివ్యూ షో చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఈ సమీక్ష రాసారు. ఇక దక్షిణాదిలో ఈ చిత్రం 1932 ఏప్రిల్ 2న మద్రాస్ లోని నేషనల్ పిక్చర్ ప్యాలస్ (ఈ ప్యాలస్ నే ఆతర్వాత బ్రాడ్వే టాకీస్ గా పేరు మార్చారు) లో విడుదల అయ్యింది.. ఈ వివరాలను ది హిందూ దినపత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో జయదేవ్ చెప్పుకొచ్చారు.

– యామిజాల జగదీష్

Send a Comment

Your email address will not be published.