అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో హాస్యనటుడు సన్యాసి వేషంలో నటించిన రేలంగికి
“కాశీకి పోయాను రామా హరీ గంగ తీర్ధము తెచ్చాను రామాహరీ …”
– అని ఆయనకు ఘంటసాల స్వరం అందించగా రేలంగికి భార్యగా నటించిన గిరిజ పాత్రకు
“…. కాశీకి పోలేదు రామాహరీ ….
ఊరికాల్వలూ నీళ్ళండి రామా హరీ ,
మురుగుకాల్వలో నీరండి రామాహరీ ”
– అనే పాటను పాడిన స్వర్ణలత గొంతు చిరస్మరణీయం.
ఆరాధన, అనురాగం, బంగారు తిమ్మరాజు, దాగుడుమూతలు, భార్యాభర్తలు, బంగారు తల్లి, మాయా బజారు, పల్నాటి యుద్ధం తదితర అయిదువందల చిత్రాలలో పాటలు పాడిన స్వర్ణలత 1928 మార్చి 10 వ తీదీన కర్నూలు జిల్లాలోని చాగలమర్రిలో భోగం రామసుబ్బన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఆమెకు కన్న తల్లిదండ్రులు పెట్టిన పేరు మహాలక్ష్మి. అయితే సినిమాలో మొదటి పాట పాడినప్పుడు స్వర్ణలత అని పేరు మారింది.
ఆమె ఫిడేలు సుబ్బన్న వద్ద సంగీతం, శాస్త్రి గారి వద్ద నాట్యం, రంగస్థల నటుడు జమాల్ వద్ద నటన నేర్చుకున్నారు.
చింతామణి, శ్రీకృష్ణ తులాభారం, కృష్ణరాయబారం వంటి నాటకాల్లో నటించిన స్వర్ణలత పాడిన పాటలు మెచ్చి కొల్హాపురి రాజావారి ఆస్థానం ఆమెను స్వర్ణ పతకంతో సన్మానించారు. అటుతర్వాత ఆమె రేడియో గాయనిగా అనేక పాటలు పాడారు.
నటుడు భానుచందర్ తండ్రి మాస్టర్ వేణు ఆమెతో హెచ్ ఏం వీకి పాటలు పాడించారు.
అనంతరం కస్తూరి శివరావు తాను నిర్మించి దర్శకత్వం వహించిన పరమానందయ్య శిష్యులు చిత్రంలో పాడే తొలి అవకాశం కల్పించారు. ఆమె ఈ చిత్రంతోనే వెండితెరకు గాయనిగా పరిచయమయ్యారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
ఆమె ద్వితీయ చిత్రంలో(మాయారంభలో పాట -శివరావుతో కలిసి రాత్రనక, పగలనక…అనే పాట) పాడిన పాటే ముందుగా ప్రేక్షకులముందుకు వచ్చింది.
ఆమె తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, సింహళీస్ తదితర భాషలలోను యుగళగీతాలు, సోలో పాటలు పాడారు. తన గొంతులో కరుణ, శృంగార, భయానక, బీభత్స వంటి నవరసాలను పలికింఛిన స్వర్ణలత ఘంటసాల, పీ బీ శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వర రావు, ఎస్ పీ బాలసుబ్రమణ్యం, పీ లీల, పీ సుశీల, ఎస్ జానకి, వసంత, జిక్కీ, రావు బాలసరస్వతిలతో కలిసి అనేక హిట్లు కొట్టిన పాటలు పాడటం విశేషం.
దేశవిదేశాలలో జరిగిన అనేక సంగీత కార్యక్రమాలలో పాల్గొన్న ఆమెను కేరళకు చెందినా డాక్టర్ అమర్ నాధ్ ప్రేమించి 1956లో వివాహమాడారు. వీరికి ఆరుగురు కుమారులు. ముగ్గురు కుమార్తెలు. వీరి పెద్ద కుమార్తెకు మాటలు రాకపోవడంతో ఆమె 1979లోక్రైస్తవ మతం స్వీకరించారు.
స్వర్ణలత 1997 మార్చి పదవ తేదీన చెన్నైలోని ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
ఆమె పుట్టిన తేదీ, మరణించిన తేదీ మార్చి పదవ తేదీ కావడం యాదృచ్చికమే.
– నీరజా చంద్రన్