నటి నయనతార మూడేళ్ళ క్రితం హిందువుగా మతం మార్చుకున్నారు. ఇది తెలిసిన విషయమే. ఆమె శుద్ధి కర్మ పద్ధతి ద్వారా మతం మార్చుకున్నారు.
ఆమె అసలు పేరు దియానా మరియమ్ కురియన్. అయితే వెండితెర కొచ్చేసరికి ఆమె పేరు నయనతారగా మారిపోయింది. తాను మతం మార్చుకోవడంలో ఎవరి ప్రోద్బలమూ లేదని, తానే మార్చుకున్నానని ఆమె చెప్పారు. హిందూ మతం పట్ల విపరీతమైన అభిమానం చూపుతున్న నయనతార మరింతగా ఈ మతంలోని అంశాలు తెలుసుకోవాలని పరితపిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటున్న ఆమె ఇటీవల హిమాలయాలకు వెళ్లి వచ్చారు. అలాగే అనేక ఆలయాలు సందర్శించారు. అంతేకాదు ఒక సినిమా షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆశ్రమాలను కూడా ఆమె సందర్శించారట. ఈ మధ్య ఆమె మెడలో రుద్రాక్ష మాల కూడా ధరిస్తున్నారు.
ఆధ్యాత్మిక స్థలాలు సందర్శించి రావడం వల్ల మనసుకు చెప్పలేనంత హాయిగా ఉన్నట్టు నయనతార ఆనందంగా చెప్పారు.