హిరణ్యకశిపుడిగా రానా

Ranaహిరణ్యకశిప చిత్రంలో టైటిల్ రోల్ లో రానా దగ్గుబాటి నటించబోతున్నారు. ఇంతకుముందు ఈ పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రలో నటించడానికి రానా సంతకాలు చేసినట్టు తాజా సమాచారం. బాహుబలి – 2 ది కన్క్లూసన్ చిత్రం విడుదల తర్వాత దర్శకుడు గుణశేఖర్ హిరణ్యకశిప చిత్ర కథను రాణాకు వివరించారు. కథ నచ్చడంతోనే రానా అందులో నటించడానికి ఉత్సుకత కనబరిచారు. గుణశేఖర్ – రాణాల మధ్య దాదాపు రెండు నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. చిత్రం చిత్రీకరణ మొదలుపెట్టడానికి ముందే ఎంతో వర్క్ అవసరం కావడం వల్ల వారి మధ్య ఈ చర్చలు జరిగాయని భోగట్టా. ఈ చిత్ర కథకు సంబంధించి గుణశేఖర్ ఆయన బృందం స్క్రిప్ట్ పై ముమ్మరంగా వర్క్ చేస్తోంది. గ్రాఫిక్స్ మీద పది కోట్లు ఖర్చు పెట్టినట్టు కూడా తెలిసింది. బాహుబలి చిత్రం తర్వాత అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల దృష్టి ఈ పౌరాణిక చిత్రంపై కేంద్రీకృతమైంది. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించాలన్నది గుణశేఖర్ ఉద్దేశం.

ఇలా ఉండగా వెంకటేష్ మరొక ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వెంకీ నటిస్తున్న ఆ చిత్రం పూర్తిగా సాంఘిక కథనం అని, ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ ఎంతో ముఖ్యమని సంబంధిత యూనిట్ తెలిపింది. ఈ విషయాన్ని సురేష్ ప్రకటించినప్పుడు అందరూ హిరణ్యకశిప చిత్రమనుకుని ఆ పాత్రలో వెంకీ నటిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. కానీ అది వాస్తవం కాదు. అయితే గుణశేఖర్ సమర్పించబోతున్న హిరణ్యకశిప చిత్రానికి రానా అన్ని విధాలా సరిపోతారని అందరి మాట.

Send a Comment

Your email address will not be published.