A Singing Chemist – OAM

A Singing Chemist – OAM

శ్రుతి లయల మేళవింపు, సుస్వర రాగాలాపనతో శాస్త్రీయ సంగీత సుమధుర గీతాలతో ఆస్ట్రేలియాలో 37 సంవత్సరాల క్రితం ఒక సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన కథనమిది. పరభాషా సంస్కృతితో సహజీవనం చేస్తూ మన ఉనికిని తెలియజేసిన సంగీతభరితమైన ఒక శ్రావ్య గీతమిది. రాగం, తానం, పల్లవి మేళవించి లాభాపేక్ష లేకుండా గళమెత్తి గానం చేసిన ఒక శాస్త్ర సంగీత నిధి. బహుళ సంస్కృతులకు చెందిన వేలమంది విద్యార్ధులు సంగీత విద్యనభ్యసించి తమ గళంతో ఖండాంతరాలలో భారతీయ సంగీత బావుటాను ఎగురవేసిన వైనమిది. రాగాలాపనతోనే శ్రమించి విశ్రామం పొంది వైవిద్యభరితమైన సువిశాల సంగీత బాణీలతో హోరెత్తిన వినూత్న ప్రయత్నమిది. తన జీవితంలో మూడు తరాల వారికి సంగీత విద్య నేర్పించిన ఘనతను సమకూర్చుకున్న సుదీర్ఘ ప్రయాణమిది.

పూవు పుట్టగనే పరిమళించునన్నట్లు ఆస్ట్రేలియా పెర్మనెంట్ వీసాకి దరఖాస్తు పెట్టినపుడే “సింగింగ్ కెమిస్ట్” కి ఆస్ట్రేలియా సాదర స్వాగతం పలుకుతుందని వీసా అధికారి అన్న మాటలు ఈ రోజు కూడా చెవిలో గింగురుమంటున్నాయని ఈ వ్యాసానికి కేంద్ర బిందువైన డా. (శ్రీమతి) రమారావు గారంటున్నారు. 1983 ఫిబ్రవరి 17వ తేదీ గురువారం ఆస్ట్రేలియా దేశంలో అడుగిడి రెండవ రోజునే తన గళంతో పలువురుని అలరించి ఇప్పటికి సంగీత సామ్రాజ్యంలో ఒక వట వృక్షంలా ఎదిగి ఈ సంవత్సరం క్వీన్స్ బర్త్ డే రోజు ‘ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియా మెడల్’ (OAM) తో సత్కరించబడ్డారు.

సంస్థా పరంగా సంగీతం సాధనతో పాటు సేవ చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించి ‘కృష్ణ రవళి’ పేరుతో ఒక సంగీత కళాశాలను 1984 లో స్థాపించారు. చిన్నప్పుడు తల్లి ప్రోత్సాహంతో నేర్చుకున్న విద్య గనుక సంస్థ తల్లి శ్రీమతి కృష్ణవేణి పేరుతో స్థాపించడం జరిగిందని రమారావు గారు చెప్పారు. ‘కృష్ణ రవళి’లో ఉత్తర, దక్షిణ భారత దేశానికి చెందిన వారే కాకుండా అన్ని సంస్కృతులకు చెందిన విద్యార్ధులు ముఖ్యంగా కొంత మంది బుద్ధి మాంద్యం గల పిల్లలు కూడా సంగీతం నేర్చుకొని తమలో ఉన్న అత్మస్తైర్యానికి, నమ్మకానికి మెరుగులు దిద్దుకుంటున్నారు.

విద్యాభ్యాసం:
నెల్లూరులో B.Sc చదివి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో M.Sc పట్టా పుచ్చుకొని మద్రాస్ (ఇప్పుడు చెన్నైగా పిలవబడుతుంది) నగరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. అక్కడ ఉన్నపుడే ప్రముఖ సంగీత విద్వాంసులు సంగీత కళానిధి డా.ఎస్. రామనాథన్ గారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియా ప్రయాణం:
పెళ్ళైన ఏడాదికి భర్త జగన్నాధరావు (జగ్గు అని అందరికీ సుపరిచితులు) ప్రవాసం వెళ్తే బాగుంటుందన్న కోరికపై ఆస్ట్రేలియాకు పెర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేయడం జరిగింది. అప్పుడే వీసా అధికారి మౌఖిక పరీక్ష తదుపరి అన్న మాటలు “Australia welcomes a ‘Singing Chemist’”. వృత్తి పరంగా రసాయన శాస్త్రంలో నిపుణురాలు మరియు ప్రవృత్తి పరంగా సంగీత విద్వాంసురాలు. ఈ రెంటినీ కలిపి క్రొత్త పదాన్ని వాడడం జరిగింది.

వచ్చిన క్రొత్తలో మోనాష్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేసి Dulux/PPG paints లో నిర్విరామంగా పాతికేళ్ళు పని చేసారు. ఉద్యోగం చేస్తూనే ప్రతీ రోజు సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్ధులకు 2-3 గంటల సమయం కేటాయిస్తూ ప్రతీ వారంతం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగేది.

ప్రముఖులతో…
2001 వరకూ సంగీత ప్రక్రియలో ఎక్కువమంది నిష్ణాతులు లేకపోవడంతో అన్ని భారతీయ సంఘాలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు సంగీత సహకారం అందివ్వడానికి శ్రీమతి రమారావు గారిని పిలవడం జరిగేది. నాలుగు దక్షిణాది భాషలే కాకుండా హిందీ భాషలో కూడా వీరు పాటలు పాడతారు. ఈ ప్రయాణంలో కొంతమంది ముఖ్యమైన సంగీత దర్శకులు, గాయకులతో పాడే అవకాశం దొరికింది. వారిలో ముఖ్యులు TM సౌందర్ రాజన్. 1995లో శ్రీ సౌందర్ రాజన్ ఆస్ట్రేలియా వచ్చినపుడు వారితో ఆస్ట్రేలియాలోని అన్ని ముఖ్య నగరాలు వెళ్ళి పాడటం జరిగింది. యాదృచ్చికంగా 2015లో వారి తనయుడు TM బాల రాజ్ వచ్చినపుడు కూడా వారితో కలిసి పాడే అవకాశం వచ్చిందని రమా గారు చెప్పారు.

2003లో శ్రీమతి SP శైలజ గారు ఆస్ట్రేలియా వచ్చినపుడు జరిగిన సంస్కృతిక కార్యక్రమానికి అధ్యక్షత వహించి శాస్త్రీయ, సినిమా సంగీతాల వైవిధ్యాలు, ఇరువైపులా అవసరమైన నైపుణ్యాలపై సమగ్ర విశ్లేషణ వివరించడం జరిగింది. శైలజ గారు ఆస్ట్రేలియాలో సంగీత అభివృద్ధికి ‘కృష్ణ రవళి’ చేస్తున్న కృషిని ఎంతగానో కొనియాడారు.

‘మెల్బోర్న్ నగరం ఇప్పుడు భారతీయ కళలకు కేంద్రనిలయంగా ఏర్పడుతుందని నా సహ కళాకారులు మరియు విద్యార్ధులతో ఈ ప్రయాణంలో భాగస్థురాలిగా ఉండడం ఎంతో ముదావహంగా ఉందని రమారావు గారు చెప్పారు.

పదవులు..బాధ్యతలు
శ్రీమతి రమారావు గారు Surface Coatings Association of Australia, విక్టోరియా విభాగానికి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. పిల్లలలో శాస్త్ర పరిజ్ఞానం పెంపొందించాలన్న CSIRO వారి STEM కార్యక్రమంలో కూడా వారు క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మెంటల్ హెల్త్ విభాగానికి ముల్టీ కల్చరల్ అంబాసిడర్ గా ఉన్నారు.

శ్రీమతి రమారావు గారు స్వతహాగా సాయిబాబా భక్తురాలు. కొన్ని స్వచ్చంద సేవా సంస్థలతో పని చేసి విరాళాలు సేకరించి మంచి కార్యక్రమాలు చాలా నిర్వహించారు. ‘ప్రార్ధించే పెదవులుకన్నా పని చేసే చేతులు మిన్న’ అన్న చందాన సామాజిక సేవ చేయడంలో కృతకృత్యులుతున్నారు.

రెండు విభిన్నమైన విషయాలలో నిష్ణాతురాలు కనుక వీటి ద్వారా సమాజాభివృద్దికి తోడ్పడే పనులు మున్ముందు ఎక్కువ చేపట్టాలని రమారావు గారు అనుకుంటున్నారు.

అంకితం…
ఈ అవార్డును జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, ప్రోత్సహించిన హితులు, సన్నిహితులు, స్నేహితులు మరియు ఎన్నో విధాలుగా సహాయాన్నందించిన శ్రేయోభిలాషులకు అంకితం చేస్తున్నట్లు రమా గారు చెప్పారు.

‘తెలుగుమల్లి’ మరియు ‘భువన విజయం’ తెలుగు భాషకు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ‘తెలుగుమల్లి’ కూడా శ్రీమతి రమా గారు తమ సామాజిక సేవలో తరించి మరెన్నో అవార్డులు అందుకొని భావితరాలకు స్పూర్తిదాయకం కాగలరని ఆశిస్తుంది.

Send a Comment

Your email address will not be published.