అంతా 'సాహితీమయం'

‘అంతా రామమయం జగమంతా రామమయం’ అన్నట్లు ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాలలో ఇప్పుడు ‘అంతా సాహితీమయం’. తెలుగు భాషలో ఉన్న సాహితీ ప్రక్రియల్లో అన్ని రకాల ప్రక్రియలు ఒక కొలబద్ధంగా జరుగుతున్నాయి. తెలుగు భాషాభిమానులు ఎంతోమంది కవితలు, కథలు, కధనాలు, నానీలు, హైకూలు, పాటలు వ్రాయడం ఎంతో ముదావహం. ఆస్ట్రేలియా పద్య నాటకాలకు పుట్టినిల్లని ఇదివరకే పేరుగాంచింది. గత అయిదారేళ్ళుగా శ్రీకృష్ణ రాయబారము, దక్ష యజ్ఞం, పార్వతీ కళ్యాణం, భువన విజయం వంటి నాటకాలు ఆస్ట్రేలియా భువన విజయం రంగస్థలంపై ప్రదర్శించి ఈ పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శించిన ఘనత పొందింది. వచ్చే ఉగాదికి ‘మహాకవి కాళిదాసు’ నాటకం ప్రదర్శించడానికి సన్నద్ధమౌతోంది.

అవధానాలు:
అవధాని “శారదామూర్తి” తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారు ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుండి వారు అవధాన ప్రక్రియ మొదలుపెట్టిన తదుపరి ఇప్పటి వరకూ 17 అవధానాలు జరగడం ఈ రెండు దేశాలలో తెలుగు భాష సేవ తారా స్థాయికి చేరిందనడంలో సందేహం లేదు. అవధాన ప్రుచ్చకులుగా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల తెలుగువారే కాకుండా భారత, సౌత్ ఆఫ్రికా, సింగపూర్, ఇంగ్లండు, జర్మనీ, ఉత్తరమెరికా దేశాల తెలుగువారు కూడా పాల్గొనడం ఎంతో ఆనందదాయకం.

భాగవత పద్యాలు:
భాగవత పద్యాలు పిల్లలందరూ నేర్చుకోవాలని ఉత్తరమెరికా సంస్థ iBAM వారు గత మూడేళ్ళుగా అక్కడి పిల్లలకు పద్యాలు నేర్పించి ప్రతీ ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ పోటీలను ఇతర దేశాలలో నివసిస్తున్న పిల్లలకు నేర్పించి వారిని కూడా ఈ పోటీలలో భాగస్వాములను చేయాలన్న తలంపుతో గత ఏడాది మరో ఇరవై దేశాలకు ఈ ప్రక్రియను విస్తరించారు. ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఈ కార్యక్రమం ‘తెలుగుమల్లి’ అధ్వర్యంలో జరిగింది. ఇందులో 45 మంది పిల్లలు పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. అలాగే న్యూ జిలాండ్ నుండి 23 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది.

ఛందోబద్ధమైన పద్య రచన:
గత ఏడాదిన్నర కాలంగా కరోనా పుణ్యమాయని ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలోని కొంతమంది ఔత్సాహికులు ఛందోబద్ధమైన పద్య రచనను నేర్చుకొని కొంతమంది శతకాలు కూడా వ్రాయడం జరిగింది. ఈ పద్యరచన ఆస్ట్రేలియా అవధాని శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి మరియు కావ్య కళా ప్రపూర్ణ డా. చింతలపాటి మురళీ కృష్ణ గారి నేతృత్వంలో నిరాఘాటంగా సాగుతుంది. ఆటవెలది, తేటగీతి, కందం, సీసం ఛందస్సులే కాకుండా ఇప్పుడు వృత్తాలు కూడా చాలామంది వ్రాయడం శ్లాఘనీయం.

పంచకావ్యాల ప్రవచనం:
ఈ పద్యరచనలో భాగంగా తెలుగు పంచకావ్య ప్రవచనాలు డా. చింతలపాటి గారు గత 6 నెలలుగా ప్రతీ వారం రెండు గంటలు సమయం కేటాయించి అందరికీ వివరించడం జరిగింది. కావ్య విశేషాలు వివరించడమే కాకుండా వారు పద్య రచనలోని మెళుకువలు, ఈ కావ్యకవుల అంతరంగంలోని భావాలు ఎంతో వివరంగా చెప్పి కావ్య శిల్పం అర్ధం చేసుకోవడానికి దోహదపడ్డారు.

సిరిదివ్వెలు:
డా. చింతలపాటి గారు వ్రాసిన సిరిదివ్వెల కావ్య ప్రవచనం ప్రస్తుతం ప్రతీ వారం రెండు గంటలు కార్యక్రమం జరుగుతుంది. ఈ కావ్యం కృష్ణా జిల్లాలోని ఘంటసాల గ్రామంలోని ప్రసిద్ధ జలదీశ్వర స్వామి వారిపై 650 పద్యాలతో కూడుకున్న ఖండ కావ్యము. ఇందులో సుమారు 50 రకాల ఛందస్సులుతో కూడుకున్న పద్యాలు, స్తోత్రాలు కూడా ఉన్నాయి.

పైన చెప్పిన విడియోలన్నీ ఈ క్రింది లింకులో చూడవచ్చు.

జూమ్ వేదికగా…
ఇవే కాకుండా జూమ్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ రెండవ సాహితీ సదస్సు 2021 నవంబరు 20వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ చిట్టెన్ రాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆత్మీయ అతిథులుగా ప్రముఖ రచయిత, కవి, దర్శకుడు, తత్వవేత్త శ్రీ తనికెళ్ల భరణి గారు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాదు గారు, ప్రముఖ వ్యక్తిగత వికాస నిపుణులు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు మరియు తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు వచ్చి ఇటువంటి సాహితీ సదస్సుల ఆవశ్యకతను వివరించారు.

వసంతోత్సవం:
ఆస్ట్రేలియాలో వసంతం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వస్తుంది కానుక ఈ కాలంలో వసంతోత్సవం జరుపుకుంటే బాగుంటుందని 2021 నవంబరులో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో అన్ని వయసుల వారు వివిధ ప్రాంతాల నుండి పాల్గొని తమ స్వీయ కవితలు చదివి వినిపించారు. ఇదొక నూతన శకానికి దారి తీస్తుందని ఆశిద్దాము.

Send a Comment

Your email address will not be published.