అంబరాన్ని చుంబించిన తెలుగుదనం

దసరా, దీపావళి, బతుకమ్మ అన్నీ మన పండగలే. “మనది” అనే భావం కలగాలంటే గుండె లోతుల్లో అణగారి వున్న భావాలకు ప్రేరణ కలగాలి. మనం చూసే దృశ్యం గత స్మృతులను స్పురణకు తేవాలి. మనలో అంతర్లీనమైయున్న ఆలోచనలకు ఒక రూపం చూడగలగాలి. చారిత్రాత్మకమైన ఘట్టాలతో ముడిపడి ఉండాలి. మన సాంప్రదాయ విలువలకు పట్టం కట్టాలి. మాతృభూమి మమకారం పొంగిపొరలాలి. భాషా సంస్కృతులు వెల్లివిరయాలి. రాగం, తానం, పల్లవి రసమయం కావాలి. అన్న, తమ్ముడు, అక్క, బావా, అత్త, మామ బంధాలు బలపడాలి. సంయుక్తంగా పనిచేయాలి. తనివితీరా ఆనందించాలి.

గత నెలలో మెల్బోర్న్ తెలుగు సంఘం వారు నిర్వహించిన “జనరంజని” కార్యక్రమంతో మొదలుకొని ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లోని దాదాపు అన్ని నగరాల్లో మన తెలుగువారు ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మన భాష, సంస్కృతీ సంప్రదాయాల పట్ల మమకారం చాటి చెప్పారు. వచ్చే రెండు వారాల్లో మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. వాటిలో ముఖ్యంగా ప్రముఖ గాయకులు, సినీ దర్శకులు, రచయిత శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గారు మరియు అంతర్జాతీయ స్థాయిలో మిమిక్రీ కళలో ప్రాచుర్యం పొందిన శ్రీ మిమిక్రీ శ్రీనివాస్ గారు సిడ్నీ, బ్రిస్బేన్ మరియు మెల్బోర్న్ నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలు తెలుగుమల్లిలో సవివరంగా ప్రచురించబడ్డాయి.

ప్రాంతీయ విబేధాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకున్న తమ కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించడం ఎంతో శ్లాఘనీయం. వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పద్దతులులో పండగలను జరుపుకునే విధానం వేరైనా అందరి లక్ష్యం ఒకటే. మన వారసత్వ సంపదను ముందు తరాలవారికి అందివ్వడం. స్థానిక సంస్థల సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించి వారికి మన పండగల విశేషాలను చూపించడం. సంస్థాపరమైన సర్దుబాట్లు చేసుకుంటూ మన ఉనికిని పటిష్టం చేసుకోవడం.

ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో మన తెలుగువారి ప్రస్థానం 50 ఏళ్ళు దాటింది. అయితే కొన్ని తెలుగు సంఘాలు పాతికేళ్ళ ప్రాయానికి దగ్గర పడి రజతోత్సవాలు జరుపుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. వీటిలో వచ్చే సంవత్సరం మెల్బోర్న్ తెలుగు సంఘం, తరువాత సంవత్సరం సిడ్నీ తెలుగు అసోసియేషన్ వరుసలో వున్నాయి. కొన్ని సంఘాలు దశమ వార్షికోత్సవాలు జరుపుకోవడానికి దగ్గరలో వున్నాయి. న్యూ జిలాండ్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవం జరుపుకోవడానికి సన్నద్ధం అవుతోంది.

తెలుగుమల్లికి అన్ని తెలుగు సంఘాలు ఆదరిస్తూ సముచిత పాత్రను పోషించడానికి తగు అవకాశం ఇస్తున్నందుకు అన్ని సంఘాల కార్యవర్గాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

Send a Comment

Your email address will not be published.