అక్షర పక్షం

తెలుగు అక్షరం వెలుగు దివ్వెలా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో ఎంత చక్కగా నవ్వుతోంది.  పెళ్లి పందిరిలో పరదాల చాటున పరవశంతో ముసి ముసి నవ్వుల ముద్ద మందారంలా ధవళ కాంతుల నడుమ మేని బంగారు ఛాయతో పదహారణాల పడుచులా ఒళ్ళంతా సింగారించుకొని నవ యవ్వన నృత్య కళా కారిణిగా  తాండవం చేస్తుంది.   ఉగాది పర్వదినాలు సందర్భంగా పలు నగరాల్లో ప్రవచనాల పర్వం, తెలుగు బడులలో మన భాషను నేర్చుకుంటున్న పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అక్షర పక్షం అందరూ చేరడం ఎంతో ఆనందకర విషయం.  తెలుగు సాంప్రదాయానికి పెద్ద పీట వేసి ప్రత్యేక పూజలతో పాటు పంచాంగ శ్రవణం ప్రక్రియను జరుపుకోవడం మనలోని భాషాభిమానానికి, మన సంస్క్రుతికిచ్చే గౌరవానికి నిదర్శనం.

గత నెల 29వ తేదీన అడిలైడ్ నగరంలో మొదలై ఈ నెల 26వ తేదీన బ్రిస్బేన్ నగరంలో జరగబోయే  ఉగాది ఉత్సవాలు ఎంతో ఆడంబరంగా జరుపుకోవడం విశేషం.

పలు నగరాల్లో ఉగాది సందర్భంగా కవి సమ్మేళనాలు, వసంత నవ రాత్రులు సందర్భంగా అధ్య్తత్మిక ప్రవచనాలు కూడా జరుపుకున్నారు.  శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు పెర్త్, మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాల్లో  నలదమయంతి చరితము,  అష్టా దశ పీఠ వైభవాలు, మనవ దేహ నిర్మాణంలో శ్రీ చక్ర సమన్వయము, లలిత సహస్ర నామ వైభవము, శ్రీరామ రక్షా, గిరిజా కళ్యాణం మొదలైన అంశాలపై కూలంకషంగా ప్రవచనాలు చెప్పారు.  జెట్ ఆస్ట్రేలియా అధ్వర్యంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి.

ఇదే కాకుండా శ్రీ మల్లాది బ్రదర్స్ కార్యక్రమం ఆక్లాండ్, మెల్బోర్న్ మరియు పెర్త్ నగరాల్లో అద్భుతమైన సంగీత గానలహరిలో ఎంతో మంది తెలుగువాళ్ళు పరవశించి తేలియాడారంటే అతిశయోక్తి కాదు.

కాన్బెర్రా తెలుగు సంఘం చరిత్రలో మొట్టమొదటి సారిగా “తెలుగు వెలుగు” అన్న పేరుతొ ఉగాది సంచికను ఆవిష్కరించడం తెలుగు భాషపై వారికున్న మమకారానికి ప్రతీక. కాన్బెర్రాలోని చాలామంది కవులు, రచయితలు వారి కలానికి పదునుపెట్టి కాలంతో పోరాటం సాగించి వ్రాసిన కవితలు, కధల సంకలనం ఈ “తెలుగు వెలుగు”.

మన క్రీస్తు సోదరులు ఈస్టర్ పర్వ దినాల్ని కూడా ఇదే సమయంలో భక్తి ప్రపత్తులతో  జరుపుకోవడం మరింత విశేషం.  గుడ్ ఫ్రైడే సందర్భంగా మన తెలుగు క్రీస్తు సోదరులు పలు ప్రాంతాల్లో చర్చిలకు కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు జరుపుకొని పుణ్య కాలంలో పునీతులయ్యారు.

Send a Comment

Your email address will not be published.