అద్దె అతిధులు మనకొద్దు

ఆస్ట్రేలియాలో దాదాపు 60 ఏళ్ల తెలుగువారి చరిత్రని అందరమూ మాట్లాడుకుంటున్నాము.  ఇదొక మైలురాయన్నది నిర్వివాదాంశం.  ఎందుకంటే ప్రపంచంలో బానిస పరిపాలనలో ఉండి స్వాతంత్ర్యం సంపాదించి 60 ఏళ్ళు నిండని దేశాలు చాలా ఉన్నాయి.  19వ శతాబ్దం వరకు 60 ఏళ్ళు అన్నది మానవజాతి కాలప్రమాణంలో ఇంచుమించు ఒక తరం అనేది ప్రామాణికంగా ఉండింది. అంటే ఆస్ట్రేలియా వచ్చిన మన తెలుగువారి మొదటి తరం ముగింపు దశకి చేరుకుందనే చెప్పాలి.

ఈ ఆరు దశాబ్దాలలో సాంకేతికపరంగా వచ్చిన మార్పుల వలన మన తెలుగువారి సంఖ్య అనధికారిక అంచనాల ప్రకారం ఆస్ట్రేలియాలో సుమారు 70-80 వేల మంది నివసిస్తున్నారు.  విద్యా, వ్యాపార, సాంకేతిక, రాజకీయ రంగాలలో ఎంతోమంది నిష్ణాతులు సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థలతో మమేకమై అటు భారతదేశంలోనూ, ఇటు ఆస్ట్రేలియాలోనూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆస్ట్రేలియా ఆర్ధిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు.

మొదటి తరానికి చెందినవారు ఇప్పుడిప్పుడే వివిధ రాష్ట్రాల పార్లమెంట్ లలో అడుగు పెట్టాలని ఉవ్విళ్ళూరుతూ జాతీయ పార్టీల తరఫు అభ్యర్ధులుగా పోటీ చేయడం జరుగుతుంది.  ఈ ప్రక్రియలో త్వరలోనే మన తెలుగువారు విజయాన్ని సాధించి ముందడుగు వేయగలరని ఆశిద్దాం.  తెలుగువారిలో ఎంతోమంది ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని గెలుచుకున్నవారు ఉన్నారు.  వీరిలో,  విద్యారంగంలో తన పరిశోధనలతో ఎన్నో అవార్డులు పొంది మన తెలుగు వారికి గర్వకారణంగా నిలచిన శ్రీ చెన్నుపాటి జగదీష్ గారు ఒకరు.  అస్ట్రేలియలోని గ్రామీణ ప్రాంతం అయిన కల్ కైరన్ (విక్టోరియా రాష్ట్రంలోని వడుంగ నగరానికి సుమారు 50 కి.మీ.) లో గత 46 ఏళ్ళుగా వైద్య వృత్తిలో పని చేస్తూ తమ అపారమైన అనుభవ సంపదతో వృత్తి పరంగా సేవలందిస్తున్న 75 ఏళ్ళ డా.జనార్ధన రెడ్డి గారు ఒకరు.  తొలితరానికి కాంతి దివ్వెలా తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన శ్రీ దూర్వాసుల మూర్తి గారు అందరికీ సుపరిచుతులే.  ఇలా సంఘసేవలోనూ, భాషా సంస్కృతుల అభివృద్ధిలోనూ, వృత్తిపరంగా ఎన్నో రంగాలలో నిష్ణాతులైన మన తెలుగువారు వందల్లో లేకపోయినా మన సమాజంలో పదుల్లో ఉన్నారు.  వీరిని గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనపై ఉంది.

పండగ సందర్భాలలో భారతదేశం నుండి ఎవరో ఒక సినిమా వ్యక్తినో, ఒక రాజకీయ ప్రముఖుడినో లేక ఒక గాయనీ/గాయకుడునో ఆహ్వానించి వేల కొలది డాలర్లు ఖర్చుబెట్టే సంస్కృతికి అలవాటు పడిపోయాం.  ఎందుకంటే ఎవరో ఒక విశిష్ట వ్యక్తీ లేకపోతే కార్యక్రమాలకు జనం రావడం లేదని ఒక అపోహ.  కాలచక్రంలో గత కార్యవర్గం ఎవరినో తీసుకువచ్చారు కాబట్టి మేము కూడా ఇంకొకరిని తీసుకురావాలి అన్న పోటీ తత్త్వం నుండి బయటపడాలి.  ఇటువంటి అపోహలను తొలిగించాలి. భారతదేశం నుండి వచ్చిన వారి నుండి మన జీవితంలో కానీ ఇక్కడి తెలుగు సమాజానికి కానీ ఏదైనా విలువ జోడించడం జరుగుతుందా? వచ్చేవారు వారి స్థోమత బట్టి కొందరు ఆస్ట్రేలియా వెళ్ళాము అని వారి సివిలో వ్రాసుకోవడం, దానిని ఉపయోగించి మరో దేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతుంది తప్ప మనకి ఒరిగేదేమీ లేదు.  కొన్ని సందర్భాలలో వచ్చిన అతిధులు వివాదాస్పదమైన వారైతే ఇక్కడ మనలో కొంత మనఃస్పర్ధలు కలగడం కూడా జరుగుతుంది.  డబ్బులు ఖర్చు చేసి వారిక్రింద సేవలు చేసి కొన్ని పర్యాటక ప్రదేశాలు తిప్పి చివరికి మనకి మిగిలేది వర్గ బేధాలు.

మనం మొదటి దశలో ఉన్నప్పుడు మాతృ భూమిపైనున్న మమకారం, భాషా సంస్కృతులపై పట్టు ఉండి నిబద్ధతగలవారు  నిష్ణాతులైన వ్యక్తులను  తీసుకురావడం జరిగింది.  గత పదేళ్లుగా వచ్చినవారిలో ఎంతమంది మన భాషా సంస్కృతులలో నిష్ణాతులని చెప్పగలం?  వచ్చినవారందరూ తగిన అర్హత గలవారని, నిబద్ధత గలవారని నిర్ధారించి చెప్పడానికి ఒక ప్రామాణికమంటూ ఏదీ లేదు.

60 ఏళ్ల చరిత్ర కలిగి ఒక గౌరవప్రదమైన సమాజంగా ఎదిగి పుష్కలమైన వనరులుండి మనమే ఎందుకు విశిష్ట వ్యక్తులుగా ఎదగకూడదు?  మనకే అ గౌరవం ఎందుకు దక్కకూడదు?  మనలోనే ఉన్న విశిష్ట వ్యక్తులను గుర్తించగలగడం, మన మధ్యనే ఉన్నవారిని విశిష్ట వ్యక్తులుగా ఎదగనివ్వడానికి ప్రోత్సహించడం జరగాలి.  అతిధులను అరువు తెచ్చుకునే దౌర్భాగ్యానికి తిలోదకాలివ్వాలి.  ఈ అంటువ్యాధిని త్రోసిపుచ్చాలి.

Send a Comment

Your email address will not be published.