అమ్మ భాష అమృతం అన్నారు పెద్దలు. అమ్మ భాష మాట్లాడాలని, వినాలని, పాడాలని – ప్రతీ నిమిషం అమ్మని గుర్తు చేసే చిరు జ్ఞాపకాలను నెమరువేయింపజేసేది అమ్మ భాష. ఎంతో మంది మాతృ ఋణం తీర్చుకోవాలన్న తపనతో అమ్మ భాషకు తమ జీవితాలను అంకితం చేసారు. అమ్మ భాష అమర భాషగా నిలిచిపోవాలని తపించారు. అటువంటి అమ్మ భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. తేనెలొలుకు అమ్మ భాషలో ముద్దుముద్దుగా మృదు మధురంగా మాట్లాడుకుంటే అమ్మ ఎంత సంతోషిస్తుందో చెప్పనక్కరలేదు. అమ్మ భాషే పరమావధిగా తెలుగుమల్లి గత నాలుగేళ్ళుగా చేస్తున్న సాహితీ ప్రయాణానికి గుర్తింపుగా డీకిన్ కమ్యునిటీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ గుర్తింపు వచ్చినందుకు తోడ్పడిన పాఠకలోకానికి, మా శ్రేయోభిలాషులకు, మాకు ఆర్ధికంగా సహాయ పడిన ప్రకటన కర్తలకు కృతజ్ఞతలు.
నాలుగేళ్ళ ప్రయాణంలో అమ్మ భాష అమర భాషగా నిలదొక్కుకోవాలని తెలుగుమల్లి పరితపించి ఎంతో ప్రయత్నం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా గత సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగిన గణాంక (Census) వివరాలకు అందరినీ “తెలుగు”, వారి మాతృ భాషగా తెలుపవలసిందిగా సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ఉద్యమ రూపంలో ప్రచారాన్ని కొనసాగించింది. దీనికి ఇక్కడి తెలుగువారు మన భాషపైనున్న మమకారంతో ఎంతో చక్కగా ప్రతిస్పందించారు.
మన భాష వాడుకకు ప్రోత్సహించడమే కాకుండా రచయితలను ప్రోత్సహించి వారు వ్రాసిన కవితలు, కధలు, పద్యాలు, కధానికలు మొదలైనవి ప్రచురించడం తెలుగుమల్లి ప్రత్యేకత. మన భాష, సంస్కృతి మూలంగా జరుగుతున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ జనరంజకమైన రంగస్థల నాటకాలను ప్రదర్శించడంలోనూ కీలక పాత్ర వహించింది. ఈ దిశగా “శ్రీ కృష్ణ రాయబారము” మరియు “శ్రీ పార్వతీ కళ్యాణం” పద్య నాటకాలను గత రెండేళ్లలో ప్రదర్శించి ఆస్ట్రేలియా దేశంలో మొదటిసారిగా ఒక పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించిన ఘనతను సాధించింది.
తెలగుతల్లి సేవలో సదా కృషిచేయడానికి అవకాశం ఇచ్చి తెలుగుమల్లిలో ప్రచురిస్తున్న భాషా సంబందమైన వ్యాసాలను ఆస్వాదిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.