అమ్మ భాష "జ్ఞాన ధార"

Brahmanandam_1“భాష చచ్చిపోతుంది అనేకంటే మనమే చంపేస్తున్నాము అంటేనే బాగుంటుంది. అజరామరమైన అమ్మ భాష మృత భాషగా మారిపోతుందని అందరూ అంటున్నారు కానీ దానికి మనమే కారణం అన్న మూలాన్ని గ్రహించడం లేదు అంటారు” సినీ హాస్యనటుడు శ్రీ బ్రహ్మానందం గారు. మంచి చెడు అనేవి ఈ మధ్య రాలేదని, యుగయుగాలనుండి కావడికుండలు వలె రెండూ సహజీవనం చేస్తూ వస్తున్నాయి. కొన్ని కాలాలలో సాహిత్యం ఎక్కువ పాలు వుండడం వలన అది స్వర్ణయుగంగా పరిగణింప బడిందని వారి అభిప్రాయం. సినీరంగంలో 1950 – 80 సంవత్సరాల మధ్య స్వర్ణ యుగంగా కీర్తింపబడినా, అప్పుడు కూడా కొన్ని అపశృతులు లేకపోలేదని అన్నారు. ప్రతీ భాషా కాలాన్ని బట్టి ఒడుదుడుకులకు లోనై తన ఉనికిని నిలబెట్టుకొని ఒక నదీ ప్రవాహంలా ముందుకు సాగిపోతుంటుంది. అయితే దారి పొడవునా వాగులు, వంకలే కాకుండా విస్తారమైన పచ్చిక బయళ్ళు, పల్లపు పరీవాహక ప్రాంతాలు కూడా ఉంటాయన్నది నిర్వివాదాంశం అని అన్నారు.

మన కర్తవ్యం

13 – 14 శతాబ్దాలలో సంభాషణలు పద్యాలతోనే ఉండేవి అని అంటారు.

ఉదాహరణకు

కమ్మని గ్రంథం బొక్కటి

యిమ్ముగ నే నృపతికైన కృతి ఇచ్చిన కై

కొమ్మని యీ యరె అర్థం

బిమ్మహి దున్నంగ నేల ఇట్టి మహాత్ముల్

శ్రీనాధుడు పోతన పొలంలో దున్నుతూ ఉండగా భాగవతం రాజుకి అంకిత మిమ్మని నచ్చచెప్తూ చెప్పిన ప్రసిద్ధ చాటువు.

పోతన గారి సమాధానం:

బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్

గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్

హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ

ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.

భావం: గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో జీవించువా రైనప్పటికి తప్పులేదు. (source: www.telugubhagavatam.org)

అంతటి మహత్తరమైన మన భాష కాలానుగుణంగా రూపాంతరం చెందడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కట్టు, బొట్టు, తిండి అన్నీ వేరుగానే ఉండేవి. ప్రపంచీకరణలో భాగంగా మానవ మనుగడ సాంకేతికంగా పురోభివృద్ధి చెంది ఆధునికీకరణ దిశగా పయనిస్తున్న ప్రయాణంలో మార్పు చాలా సహజం. మంచి మార్పుని మనం ఆహ్వానించాలి. అయితే మూలాలని మరచిపోవాలని కాదు. అలా అని ఆ భాష మాట్లాడాలంటే అదే కాలానికి చెందిన వేషాలు వెయ్యాలనీ కాదు. కాలానుగుణంగా బోధనా పద్ధతులు కూడా మారాలి అంటారు పద్మశ్రీ బ్రహ్మానందం గారు.

సాంకేతిక విప్లవం

ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్న వాతావరణం వేరు. వారు వాడే పరికరాలు వేరు. పలకా, బలపం ఇప్పుడు చరిత్ర కాల గర్భంలో కలిసిపోయాయి. ఈ మాటలు చెబితే అవేంటి అని ప్రశ్నిస్తున్నారు. అందుకని వారికి అర్ధమయ్యే విధంగా మన విద్యా విధానంలో మార్పులు రావాలి. ఇంతకుమునుపు చదువుకోవడానికి బడికి వెళ్ళేవాళ్ళం. బోధనా పద్ధతుల విషయంలో మరింత పరిశోధన జరగాలి. ముందుగా భావి తరాలు తెలుగు నేర్చుకోవాలంటే మనం ఏం చెయ్యాలన్నది అధ్యయనం చెయ్యాలి. వారి కనుగుణంగా పాఠ్యంశాలు తయారుచెయ్యాలి. సాంకేతికపరమైన మార్పులు ఇప్పుడు ఎంతో అవసరం. మొబైల్, నోట్ బుక్ లు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఈ తరంలో మన పాఠ్యంశాలు వాటికీ అనుగుణంగా వుండాలి. ప్రపంచీకరణ దిశగా పయనిస్తున్న అన్ని దేశాల్లోనూ బహుభాషా ప్రయోక్తల అవసరం వుంది. ఇక్కడి ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా బహుళ సంస్కృతికి పట్టంగడుతున్నాయి. దానిని మనం సద్వినియోగాపరచుకోవాలి.

అంతర్జాలం మూలాధారంగా తగిన అంశాలను తయారుచేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఎక్కువగా వుంది. అయితే పలురకాల అంశాలు ఇప్పటికే అందుబాటులో వున్నాయి. కానీ అవి ఎంతమందికి చేరుతున్నాయి అన్నది ప్రశ్నార్ధకం. ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయి అన్నది పరిశీలించాల్సిన విషయం.

భాషకి జీవం పోయాలంటే జీవధారను గుర్తించాలి. జీవ ధార జ్ఞాన ధారగా పరిణితి చెందాలి. అమ్మ భాష జ్ఞాన ధారగా పరిగణింపబడాలి.

Send a Comment

Your email address will not be published.