ఏడుపదుల ఏడేళ్ల సమైక్య తెలుగుజాతి

క్రీ.పూ. నాలుగు – ఏడవ శతాబ్దాల మధ్యకాలంలో ప్రాచీన సాళ్వ సామ్రాజ్య నేపధ్యంలో తెలుగుజాతిని అన్యాయంగా, అవాస్తవికంగా ఓదేశత్రిమ్మరి తెగగా పరిగణించేవారు. అలనాటి ఉత్తరభారత దేశంలోని యమునా నదీతట ప్రాంతాల్లో నివసించిన వారినే ఆంధ్రులు అనేవారు. ఆసమయంలోవారు అడవుల్లో నాగ, యక్షులనే జాతి పేరుగల ఆటవికులతో కలిసి మెలిసి జీవిస్తూ వుండేవారు. వారు మాట్లాడిన వాడుక భాషనే ఆంధ్రభాషగా గుర్తించ బడింది.

అయితే ఆ ప్రాచీన ఉత్తర భారతావనిలోని యమునానదీతీరం వెంటే విస్తరించిన సాళ్వ సామ్రాజ్యంనుంచి అలనాటి ఆంధ్రులు బ్రతుకు తెరువును వెతుక్కుంటూ వింధ్యాపర్వత శ్రేణువులని దాటి నేటి చత్తీస్ ఘడ్ రాష్ట్రంగుండా పయనిస్తూ వెళ్లి ఒరిస్సాలోని ‘తెలోంగ్’ అనే నదీ తీరంలోకి చేరుకొని అక్కడే చాలాకాలం స్థిరపడి పోయారు .

ఆకారణంగానే కాబోలు ఆ కాలంలోని స్థానిక ఒరిస్సా ప్రజలు ‘తెలోంగ్’నదీతీరంలో నివసించిన ఆంధ్రులనే ‘తెలుంగు’వారిగా పిలిచివుండవచ్చునని చరిత్రకారులు ఖచ్చితంగా చెబుతున్నారు. ఆ పిలుపులోని కాలాంతర మార్పులే వారిని ‘తెలుగు’ వారిగా మార్చి వుండవచ్చునని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

అందుకు కారణమేమిటంటే నేటి కళింగదేశ ప్రాంతమయిన ఒరిస్సా రాష్ట్రరాజధాని భువనేశ్వరం నగరం తన ఆధీనంలోకిరాగానే విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాయలు హంపీ – కళింగ దేశాలని కలిపిన భువనవిజయ సూచకంగా శ్ర్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాల్లోని శివలింగాలని ప్రతీకగా తీసుకుని తనంతటతానే ‘త్రిలింగ’ దేశాధిపతిగా ప్రకటించుకున్నాడు. తద్వారానే విజయనగర సామ్రాజ్యం కాస్తా త్రిలింగ దేశంగా రూపాంతరం చెందింది. ఆ నేపధ్యంలోనే ప్రాంతీయ భాషా ఐక్యత నిమిత్తం త్రిలింగపద ధ్వని పరిడఃవించేలా శ్రీకృష్ణ దేవరాయలే ‘ఆంద్ర’ భాషను‘ తెలుగు’ భాషగా మార్చివుండవచ్చని కూడా చారిత్రిక ప్రపంచం అభిప్రాయ పడుతోంది. అందుకే కాబోలు ఆ అభిప్రాయాన్నిమరింత బలపరిచేలా ‘తెలుగదేలయన్నదేశంబు తెలుగేను తెలుగువల్లభుండ!’ అంటూ ప్రకటించుకున్నాడా సార్వభౌముడు.

అదే క్రమంలో అలనాటి ఆ తెలుగు ఆంధ్రులే ఒరిస్సానుంచి బంగాళాఖాతం తీరాలని ఆశ్రయిస్తూ దక్షిణాదికి వలస వెళ్ళిన ఆర్యులుగా ప్రశస్తి గావించబడ్డారు. వారు ఆవిధంగా ఏర్పరుచుకున్న స్థావర సముదాయమే నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ఆంధ్ర ప్రాంతంగా చెప్పబడు తోంది. అదే సమయంలో వారిలోని మరి కొందరు పాండిచ్చేరి, తమిళనాడులకు కూడా వెళ్లి స్థిరపడటం జరిగింది. అందుకే నాటి నుంచే కాకుండా యిప్పుడు కూడా తమిళనాడు, పాండిచ్చేరిలలో తెలుగువాళ్ళని ‘వడుగు’ లేదా ‘వడగార్’ అని పిలువటం జరుగుతోంది, తమిళంలో ‘వడుగు’ అంటే ‘ఉత్తరాది’ అనీ ‘వడుగార్’ అంటే ‘ఉత్తర దేశస్తుడ’నీ అర్థం !

అదలావుండగా మరికొందరు ఆంధ్రులు అదే తెలోంగ్ నదీతీరంనుండి నేటి చత్తీస్ ఘడ్ రాష్ట్రం, భద్రాచలం ఆటవిక మార్గాల ద్వారా గోదావరి నదిని చేరి అక్కడ రెండు భాగాలుగా విడిపోయారు. అలా విడిపోయిన వారిలోని అధికభాగం వలసకారులు గోదావరి దక్షిణదిశలోని నేటి తెలంగాణా జిల్లాలలోకి వెళ్ళగా మిగిలిన వారు గోదావరి ఉత్తర భాగంలోని ఆదిలాబాద్ ఆటవిక మార్గాలద్వారా మహారాష్ట్ర, ,కర్ణాటక రాష్ట్రాలకి వెళ్ళి పోయారని చరిత్రకారులు భావిస్తున్నారు. అలా మహారాష్ట్రలో ప్రవేశించిన జనం వెళ్లి తూర్పు కనుమల్లో ఆశ్రయం సంపాదించుకున్నారనీ, ఆ కారణంగానే మహారాష్ట్రకి వలసవెళ్ళిన ఆంధ్రుల పరంగా ముంబాయికి దగ్గరలో వున్న లోయకి ‘ఆంధ్రా వ్యాలీ’ అనే పేరువచ్చిందని కూడా తెలుస్తోంది. . అది గాక ఆ లోయలోనే ప్రవహిస్తోన్ననదిని ‘ఆంధ్రీనది’ అని కూడా పిలువటం జరుగుతోంది.. అదే విధంగా కర్నాటకలోకి ప్రవేశించిన వారు మాత్రం గుల్బర్గా, రాయచూరు, బళ్ళారిలలో స్థిరపడిపోయారని తెలుస్తోంది. అందుకే వారి పరంగా కర్నాటకలోని ‘తుంగభద్రానది’కూడా కన్నడంలో ‘ఆంధ్రీ లేదా హంద్రీ నది ’ అని పిలువబడుతోంది.

కాని ఫై మార్పులవల్ల దేశజనావళి తెగలపరంగా మహారాష్ట్ర తూర్పు కనుమలలో స్థిరపడిపోయిన ఆంధ్రులని మాత్రం ద్రవిడులుగా పరిగణించటం జరుగుతోంది. కాని చారిత్రక ఆధారాల ద్వారా నేటి కోస్తా ఆంధ్ర ప్రాంతం మాత్రం నాటి ఆర్య సంతతికి చెందినదిగానే పరిగణించబడుతోంది. అందుకే కోస్తా ఆంధ్రని దక్షిణాదికి చెందిన ప్రాంతంగా ఖచ్చితంగా చెప్పబడటం లేదు. ఫైగా చారిత్రిక పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ కోస్తాంధ్ర , రాయల సీమ, తెలంగాణా ప్రజలు కలిసి జీవించారనటానికి ఆధారాలు అసలే లేవు. కేవలం విజయనగర సామ్రాట్ శ్రీ కృష్ణ దేవరాయల పాలనా కాలం క్రీ.శ . 1509 – 1529 లో మాత్రమే ఈమూడు ప్రాంతాలజనం ఓ యిరవయి సంవత్సరాలు కలిసి జీవించారు.

యిక సమైక్య జీవన విషయానికి వస్తే శ్రీ కృష్ణ దేవరాయల కాలంలోని యిరవయి ఏళ్ల తర్వాత మళ్ళీ క్రీ.శ.1956 వరకు మూడు ప్రాంతాల ప్రజలు కలిసి జీవించటం అంటూ జరుగ లేదు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొన్ని జిల్లాలు ఒరిస్సాలోనూ , నాటి మద్రాసు రాష్ట్రంలోనూ వుండగా రాయల సీమకి చెందిన కొన్ని జిల్లాలు మైసూరు రాష్ట్రంలో వుండేవి. అప్పుడు తెలంగాణా జిల్లాలన్నీ కూడా ‘హైదరాబాద్ దేశం’ లో నైజాం నవాబు పాలనలో వుండేవి. కాని 1953 లో నైజాం నవాబు లొంగుబాటు అనంతరం కూడా అంతర్గత మార్పులనేవేవీ లేకుండా ‘హైదరాబాద్ రాజ్యం’ అలాగే ‘హైదరాబాద్’ రాష్ట్రం పేరిట కొనసాగింది. ఆ తర్వాతనే 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటినుంచే గత విజయ నగర సామ్రాజ్య కాలం తర్వాత మళ్లీ తెలుగు జాతి సమైక్య జీవనం తిరిగి ప్రారంభమయ్యింది..

ఆరకంగా భారత జాతీయ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలవారు కలిసి నివసించటం శ్రీ కృష్ణదేవరాయల కాలంలోని యిరవయి ఏళ్లని కలిపి ఈ ‘2013’ వరకు ఏడు పదుల ఏడేళ్ళవ సంవత్సరం (డెబ్బయి ఏడేళ్లు) అని చెప్పుకోవాల్సి వుంటుంది. అయితే ఈనాటివరకు భారతీయ చరిత్రలో కనీసం ఒక శతాబ్దకాలమన్నా తెలుగు జాతి కలిసి వుండేట్టుగాలేదు. చూడబోతే ఈ ఏడుపదుల ఏడేళ్లకే నిండు నూరేళ్ళు నిండేట్టుగా కనిపిస్తోంది. యిది ఎంతో శోచనీయ, శోషదాయక విషయంగా భావించాల్సి వుంటుంది

కానీ యిక ముందు తెలుగువారి జీవితాలు ఎలా కొనసాగనున్నాయోనన్న విషయమే ఊహకందకుండా అగమ్యగోచరంగా వుంది..ఆ కారణంగా కాలనిర్ణయం ఏమిటో వేచి చూస్తూ తెలుగు తల్లిని పూజించటం తప్ప మరో గత్యంతరం లేదు. ..

………….మా తెలుగు తల్లికీ మల్లెపూదండా ! మా కన్నతల్లికీ మంగళారతులూ ! …జై తెలుగు తల్లీ ! ……….

SP Chari

Send a Comment

Your email address will not be published.