కళాత్మకమైన సినిమాలు రావాలి

పాత జ్ఞాపకాల్లోకి తొంగిచూసి అనంతమైన అనుభూతిని కలిగించే ఒక సంఘటన గానీ, ఒక దృశ్యం గానీ మన మనస్సుల్లో జీవితాంతం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. జీవితంలో కొంత కాలం తనతోబాటు ప్రయాణం చేసిన తోటి సహచరులు, అనుచరులు, నటులు మనతో కలకాలం ఉండలేక మళ్ళీ అనుకోని పరిస్థితుల్లో తిరిగి కలిసినా వారి గురించి విన్నా లేక వారి జ్ఞాపకాల తీపి గుర్తులు నెమరువేసుకున్నా మనసులో చెప్పుకోలేని ఆవేదన, అలజడి మొదలై మనస్సు మళ్ళీ ఏదో కోల్పోయిన భావన కలుగక మానదు. ఈ మధ్య కాలంలో వచ్చిన “మహానటి” సినిమా చూసిన ప్రతీవారి పరిస్థితి ఇదే.

1950 – 80 మధ్య కాలంలో సినీవినీలాకాశంలో ఒక తారగా మెరిసిన సితార. సినీ స్వర్ణయుగంలో సువర్ణాక్షరాలతో తన జీవితాన్ని విడమరచిన పుస్తకంలా వ్రాసిన దేవత. తెలుగువారి గుండెల్లో నిత్యనూతనంగా మెదలాడే అద్భుతమైన చిత్రాలు దేవదాసు, మాయాబజార్ వంటి సినిమాల్లో వైవిధ్యమున్న పాత్రలు ధరించి తన నటనా కౌశలాన్ని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయే విధంగా నటించిన నటవైదేహి. ఎన్నో కళాత్మకమైన చిత్రాల్లో సునిశితమైన పాత్రలు ధరించి ఆ పాత్రల్లో మరే ఇతర నటులను ఊహించలేని విధంగా తెలుగువారి గుండెల్లో ముద్ర వేసుకున్న సుమంగళి. తన నటనతో అందనంత ఎత్తు ఎదిగి చివరి రోజుల్లో శత్రువు కూడా పడరాని కష్టాలను అనుభవించి ఒక దుర్భర జీవితాన్ని గడిపిందంటే నమ్మలేని నిజం. జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలను చవిచూసినా చివరికి మనందరి గుండెల్లో ‘మహానటి” గానే మిగిలిపోయింది.

“మహానటి” తెరపైకెక్కించడానికి వయసులో చిన్నవాడైనా నాగ్ అశ్విన్ ఎంతో పరిశోధన చేసి ఆ తరం వారికి మళ్ళీ మధురవాణి మధుర జ్ఞాపకాలలోకి తీసుకెళ్తే ఈ తరం వారికి ఇటువంటి నటి ఉండేదా అన్న ఆశ్చర్యనందాలకు లోను చేసింది. ప్రతీ తెలుగువారు వయసుతో నిమిత్తం లేకుండా ఈ సినిమా ఒక్కసారైనా చూసి తరించారంటే అతిశయోక్తి కాదు.

అయితే సినిమా రంగంలో ఇటువంటి సినిమాలు తీయాలన్న ఆలోచనకు ఎందుకు తిలోదకాలిస్తున్నారు? 1980 దశకం తరువాత ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం లాంటి సర్వకాలీనమైన ఆణిముత్యాలు ఎన్ని వచ్చాయంటే ఆలోచించవలసి వస్తుంది. ఇలా చెప్పుకోదగ్గ చిత్రాలు కోసం మాట్లాడాలంటే మళ్ళీ సినిమా రంగంలోని స్వర్ణయుగానికి మనసు దారితీస్తుంది. కధ, సాహిత్యం, సంగీతం, సన్నివేశాల చిత్రీకరణ బలంగా వున్న చిత్రాలు దాదాపు కనుమరుగైపోయాయి.

దర్శకులు, నిర్మాతలు వాణిజ్యపరంగా నిలద్రోక్కుకోవాలి. కానీ సినిమాకి విలువలు జోడించి మన సత్సంప్రదాయాలు ఇనుమడింపజేయాలి. సినిమా పేరు తెలుగులో ఉండడమే గొప్పగా భావించే రోజులొచ్చాయి. ఎంతటి దౌర్భాగ్యం? మార్పు అనేది సర్వసాధారణం. సమూలమైన మార్పుని అంగీకరించని వారు జీవితంలో ఎదగలేరన్నది నిర్వివాదాంశం. అలాగని మూలాలు మరచిపోయి ఇతర సంస్కృతులను వంటిపైన పులుముకొని “మన” అన్నది మరచిపోవడం ఎంతమాత్రం సమంజసం కాదు.

ఇది సినిమా రంగానికే కాదు. తెలుగు సమాజం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు వర్తిస్తుంది. సినిమాల్లో చేస్తున్నారు గదా అని మనం వారి వెనుక పరిగెత్తనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో 95 శాతం వినోదం కోసమైనా ఒకసారి చూడవలసిన అవసరంలేదు.

కధలు మంచివి దొరకడం లేదు అని కొందరంటున్నారు. కానీ 50 ఏళ్ల క్రితంకంటే ఇప్పుడు రచయితలు ఎక్కువగా వున్నారు. మంచి కధలు చాలా ఉన్నాయి కానీ ఎవరూ మంచి మనసుతో చూడడం లేదు. “మహానటి” లాంటి సినిమాలు తీయడం చాలా కష్టం అని అందరికీ తెలుసు, ఎందుకంటే సావిత్రి గారి జీవితం అందరికీ తెలిసిందే. కానీ తెరపైన క్రొత్తగా చూపించడానికి దర్శకుడు కధని వ్రాసుకొని వినూత్న ప్రయోగం చేసాడు. అటు వాణిజ్యపరంగా, ఇటు ప్రామాణికమైన చిత్రంగా తీర్చిదిద్ది ఎంతోమంది యువ దర్శకులకు స్పూర్తిదాయకమయ్యాడు. చాలామంది దర్శకులు నాగ్ అశ్విన్ కన్నా ప్రతిభావంతులున్నారు, కానీ వారి ప్రతిభకి సాన పెట్టడం లేదు. అందులో ఎందుకో వేనుకంజవేస్తున్నారు. వారి ఆలోచనా దృక్పధంలో మార్పు వస్తే మన చిత్రసీమకు మంచి రోజులు మళ్ళీ వస్తాయని అందరూ ఆశిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.