కొంగుబంగారం

ఆస్ట్రేలియాలో దాదాపు 60 ఏళ్ల తెలుగువారి చరిత్రని అందరమూ మాట్లాడుకుంటున్నాము.  ఇదొక మైలురాయన్నది నిర్వివాదాంశం.  ఎందుకంటే ప్రపంచంలో బానిస పరిపాలనలో ఉండి స్వాతంత్ర్యం సంపాదించి 60 ఏళ్ళు నిండని దేశాలు చాలా ఉన్నాయి.  19వ శతాబ్దం వరకు 60 ఏళ్ళు అన్నది మానవజాతి కాలప్రమాణంలో ఇంచుమించు ఒక తరం అనేది ప్రామాణికం.  అంటే ఆస్ట్రేలియా వచ్చిన మన తెలుగువారి మొదటి తరం ముగింపు దశకి చేరుకుందనే చెప్పాలి.

ఈ ఆరు దశాబ్దాలలో సాంకేతికపరంగా వచ్చిన మార్పుల వలన మన తెలుగువారి సంఖ్య అనధికారిక అంచనాల ప్రకారం ఆస్ట్రేలియాలో సుమారు 70-80 వేల మంది నివసిస్తున్నారు.  విద్యా, వ్యాపార, సాంకేతిక, రాజకీయ రంగాలలో ఎంతోమంది నిష్ణాతులు సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థలతో మమేకమై అటు భారతదేశంలోనూ, ఇటు ఆస్ట్రేలియాలోనూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆస్ట్రేలియా ఆర్ధిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు.

మొదటి తరానికి చెందినవారు ఇప్పుడిప్పుడే వివిధ రాష్ట్రాల పార్లమెంట్ లలో అడుగు పెట్టాలని ఉవ్విళ్ళూరుతూ జాతీయ పార్టీల తరఫు అభ్యర్ధులుగా పోటీ చేయడం జరుగుతుంది.  ఈ ప్రక్రియలో త్వరలోనే మన తెలుగువారు విజయాన్ని సాధించి ముందడుగు వేయగలరని ఆశిద్దాం.  తెలుగువారిలో ఎంతోమంది ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని గెలుచుకున్నవారు ఉన్నారు.  వీరిలో,  విద్యారంగంలో తన పరిశోధనలతో ఎన్నో అవార్డులు పొంది మన తెలుగు వారికి గర్వకారణంగా నిలచిన శ్రీ చెన్నుపాటి జగదీష్ గారు ఒకరు.  అస్ట్రేలియలోని గ్రామీణ ప్రాంతం అయిన కల్ కైరన్ (విక్టోరియా రాష్ట్రంలోని వడుంగ నగరానికి సుమారు 50 కి.మీ.) లో గత 46 ఏళ్ళుగా వైద్య వృత్తిలో పని చేస్తూ తమ అపారమైన అనుభవ సంపదతో వృత్తి పరంగా సేవలందిస్తున్న 75 ఏళ్ళ డా.జనార్ధన రెడ్డి గారు ఒకరు.  తొలితరానికి కాంతి దివ్వెలా తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన శ్రీ దూర్వాసుల మూర్తి గారు అందరికీ సుపరిచుతులే.  “భాగవత సాహిత్య తత్త్వ విశేషాలు” అనే అంశంపై, పోతన మహాభాగవతంపై  “తెలుగు సాహిత్య లహరీ” ఉపన్యాస పరంపర 15 నెలల పాటు సిడ్నీలో శ్రీ తూములూరి శాస్త్రి గారి అధ్వర్యంలో జరిగింది.  తెలుగువారి చరిత్రలో ఇదొక మహా పర్వం అనే చెప్పాలి.   ఇలా సంఘసేవలోనూ, భాషా సంస్కృతుల అభివృద్ధిలోనూ, వృత్తిపరంగా ఎన్నో రంగాలలో నిష్ణాతులైన మన తెలుగువారు వందల్లో లేకపోయినా మన సమాజంలో పదుల్లో ఉన్నారు.  వీరిని గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనపై ఉంది.

ఇప్పుడు ఛందస్సు, వ్యాకరణం అంటే అవేమిటి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు.  ఒక కధ గానీ, కవిత గానీ వ్రాసేవారి సంగతి అటుంచి చదివే వారు కూడా లేని పరిస్థితి వచ్చింది.  మరి UNESCO వాళ్ళు మన భాషను మృత భాషల్లో చేర్చారంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదు.  ప్రపంచంలో ఇప్పుడు సుమారు 18 కోట్ల మంది (ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల పౌరులకు 6 రెట్లు) తెలుగు భాషను అర్ధం చేసుకునేవారుండగా ఈ దుస్థితి ఎందుకొచ్చింది అన్న ప్రశ్న మనకు మనమే వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

తెలుగు చదవడానికే తడబడుతున్న రోజుల్లో ఆశువుగా కవిత్వం చెప్పడం ఒక వరం అనే చెప్పాలి.  మనలో సంస్కృతాంధ్రములలో ఛందోబద్ధమైన పద్యాలు వ్రాసి ఆశు కవిత్వం చెప్పగలిగిన బహుభాషా పండితులున్నారు.  వారు మన మధ్య ఉండడం మన అదృష్టంగా భావించాలి.  ఈ మధ్య అక్కడక్కడా అవధానాలు జరగడం మనం వింటున్నాం, చూస్తున్నాం.  అవధానమంటే సరైన అవగాహనలేకపొతే ఈ అవధాన ప్రక్రియలో పాల్గొనడం అంత సులువైన పని కాదు.

‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు’ అన్న సామెత మనందరికీ వర్తిస్తుంది.  తెలుగు భాషపై నిరంతరం కృషి చేసి ప్రగతి పధంలో ముందుకు నడిచే వారికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.  వారిని సదా ప్రోత్సహించి మన భాషను మనమే రక్షించుకోవలసిన బాధ్యతగా గుర్తించి మరింతమంది భాషావేత్తలను తయారు చేయడంలో భాగస్థులం కావాలి.

మనం మొదటి దశలో ఉన్నప్పుడు మాతృ భూమిపైనున్న మమకారం, భాషా సంస్కృతులపై పట్టు ఉండి నిబద్ధతగలవారు నిష్ణాతులైన వ్యక్తులను భారతదేశం నుండి తీసుకురావడం జరిగింది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు పెంపొందించే అవకాశం కోసం తప్ప ఇప్పుడు ఆ అవసరం లేనే లేదు.

60 ఏళ్ల చరిత్ర కలిగి ఒక గౌరవప్రదమైన సమాజంగా ఎదిగి పుష్కలమైన వనరులుండి మనమే ఎందుకు విశిష్ట వ్యక్తులుగా ఎదగకూడదు? మనకే అ గౌరవం ఎందుకు దక్కకూడదు? మనలోనే ఉన్న విశిష్ట వ్యక్తులను గుర్తించగలగడం, మన మధ్యనే ఉన్నవారిని విశిష్ట వ్యక్తులుగా ఎదగనివ్వడానికి ప్రోత్సహించడం జరగాలి. అన్ని తెలుగు సంఘాలు, భాషాభిమానులు ఈ విషయాన్ని కూలంకుషంగా పరిశీలిస్తారన్నది ఆశాభావం.

మల్లికేశ్వర రావు కొంచాడ

Send a Comment

Your email address will not be published.