క్రికెట్ - ఉగాది

తెలుగువారి పండుగల్లో ఉగాది ప్రత్యేక పండగని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఉగాది వేడుకలు ముఖ్యంగా మన పల్లెల్లో అత్యధిక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. షడ్రుచులు మేళవించిన ఉగాది పచ్చడి ఒక ఎత్తైతే పంచాంగ శ్రవణం ప్రక్రియ మరో ఎత్తు. ఎందుకంటే ఈ పంచాంగ శ్రవణంలో తన గురించి కంటే తన పరివారం, ఇతర బంధు మిత్రుల బాగోగులు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి సంతోషపడుతుంటారు. పల్లె జీవనంలో పండగ అనేది సామాజికంగా ఒక మల్లె లాంటిది. ఈ పండగల్లోనే కుటుంబ పరివారం అంతా కలవడం, బంధాలను మరింత పెనవేసుకొని ముందుకెళ్ళడం, తోటివాళ్లకు శక్తికొలది సహాయపడడం, ముందు తరాల వాళ్ళకు మన సంస్కృతీ సంప్రదాయాలను తెలియపరచడం ఇంకా ఎన్నో కోణాల్లో సత్సాంప్రదాయపు విలువలను మననం చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఉన్నతమైన పండుగను ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లోని తెలుగువారు ఎంతో భక్తీ శ్రద్ధలతో శోభాయమానంగా జరుపుకోవడానికి సన్నద్దులౌతున్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, సిడ్నీ మరియు బ్రిస్బేన్ నగరాలు మరియు న్యూ జిలాండ్ లోని ఆక్లాండ్ నగరం “మన్మధ” ఉగాదికి సిద్ధమౌతున్నాయి. భాజా భజంత్రీలు, ఆట పాటలు ఎన్ని ఉన్నా ఉగాది పండగ మూలాలను మరచిపోకుండా ఇక్కడ దొరకిన వస్తువులతో ఉగాది పచ్చడి అందరికీ పంచిపెట్టడం ఆనవాయితీ. ఈ సనాతన ఆచారాన్ని కొనసాగించడానికి కృషి చేస్తున్న తెలుగువారందరికీ హృదయపూర్వక వందనాలు.

ఆస్ట్రేలియాలో షుమారు 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన తెలుగువారి ప్రస్థానం రోజు రోజుకీ ప్రవర్ధమానం చెందుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా మన ఉనికిని కాపాడుకుంటూ తోటివారికి సహాయపడుతూ ముందుకు సాగిపోవడం ఎంతో శ్లాఘనీయం. బహుళ సంస్కృతికి పట్టంగట్టే ఆస్ట్రేలియా ప్రభుత్వ రాజ్యాంగ పరిధిలో సమకాలీన స్థితి గతులకు సమాంతరంగా ప్రయాణం సాగిస్తూ మన పండుగలను జరుపుకుంటూ తెలుగుదనానికి వన్నె తెస్తూ తెలుగు జాతి బావుటాని ఎగురవేయడం గర్వించదగ్గ విషయం.

ఉగాది పండగ సమయంలోనే క్రికెట్ పండగ కూడా రావడం ఈ మన్మధ నామ సంవత్సర విశేషం.  ఉగాది పచ్చడెమో గానీ క్రికెట్ సంబరం మాత్రం అందరూ నెల రోజులకు పైనే జరుపుకోనున్నారు.

అంతా క్రికెట్ మయం:
14 దేశాలు పాల్గొనే ప్రపంచ క్రికెట్ కప్ ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలు జంటగా కలిసి నిర్వహించడం ఇది రెండోసారి. 1975 లో తొలిసారిగా ఇంగ్లాండ్ లో నిర్వహించబడిన ఈ పోటీలు ప్రతీ నాలుగు సంవత్సరాలకొకసారి జరుగుతూ ఇప్పటి వరకు పది సార్లు వివిధ దేశాల్లో నిర్వహించబడ్డాయి. ఇంగ్లాండ్ లో నాలుగుసార్లు (1975, 1979, 1983, 1999(ఇంగ్లాండ్, వేల్స్,స్కాట్ ల్యాండ్, నెదర్ లాండ్)), భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ కలిసి మూడు సార్లు (1987, 1996, 2011), ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ ఒకసారి (1992), సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మరియు కెన్యా ఒకసారి (2003) వెస్ట్ ఇండీస్ ఒకసారి (2007) నిర్వహణ బాధ్యతను చేపట్టాయి.

60 ఓవర్లు:
మొదటి ప్రపంచ క్రికెట్ కప్ పోటీలో 8 జట్టులు మాత్రమే పాల్గొన్నాయి. అప్పుడు ప్రతీ జట్టు 60 ఓవర్లు ఆడవలసి ఉండేది. మొదటి మూడు పోటీలు ఇంగ్లాండ్ లోనే జరిగాయి. 1983లో జరిగిన పోటీలో భారతదేశం వెస్ట్ ఇండీస్ పై ఘన విజయం సాధించింది. మొదటి ప్రపంచ క్రికెట్ కప్ పోటీలో మన క్రికెట్ దిగ్గజం 60 ఓవర్లు ఆడి కేవలం 36 పరుగులు చేశారన్నది చాలా మంది జీర్ణించుకోలేక పోయారు. 1987 నుండి 60 ఓవర్లు నుండి 50 ఓవర్లకు తగ్గించడం జరిగింది.

సౌత్ ఆఫ్రికా:
సౌత్ ఆఫ్రికా జట్టు టెస్టు క్రికెట్ ఆడే జట్టుల్లో ఒకటైనా, 1992 వరకూ వర్ణ వివక్షను పాటిస్తుండటంతో ఆ జట్టుని ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొనడానికి అనర్హులుగా నిర్ధారించడం జరిగింది.

కిరీటం ఎవరికో:
ఈ సారి 14 దేశాలు పాల్గొనే ప్రపంచ క్రికెట్ కప్ ఎవరిని వరిస్తుందన్నది అందరి మదిలో మెదులుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న!!! నిన్న జరిగిన భారత – పాకిస్తాన్ పోరులో భారతదేశం భారీ పరుగుల తేడాతో గెలిచినా ఈ దూకుడు చివరి వరకూ వుంటుందా? భారత – పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ పోటీ ప్రపంచ కప్ కంటే పెద్దది. ప్రపంచ కప్ గెలవకపోయినా ఫరవాలేదు కానీ పాకిస్తాన్ చేతిలో ఓడిపోకూడదనే ప్రతీ భారతీయుడు కోరుకుంటాడు. దీనికి అనుకూలంగా భారతదేశపు ప్రతీ క్రికెటర్ మానసికంగా సిద్ధమౌతాడు. అయితే ప్రతీ ప్రత్యర్ధిని అదే విధంగా భావించి మిగిలిన ఆటల్లో గెలవడానికి ప్రయత్నిస్తే కప్ మనదే. పసికూన ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం వెస్ట్ ఇండీస్ ని గజ గజ వణికించింది. ఇదొక గుణ పాఠం. ఎవరినీ తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అందునా ముఖ్యంగా నిత్యమూ ఆడని వాళ్లతో మరీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే గత నాలుగేళ్లలో వాళ్ళెంత సాధన చేశారన్నది అర్ధం కాని ప్రశ్న.

Send a Comment

Your email address will not be published.