క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఇంగ్లాండ్ లోని బెర్కషైర్ లో 70 ఏళ్ల క్రితం 6 ఏళ్ల వయసు గల డేవిడ్ హేలాక్ సాంటాకు తనకు కావలసిన బహుమతుల కోసం ఒక ఉత్తరం వ్రాసి ఒక చిమ్నీలో పడేసారు. ఈ మధ్యే అక్కడ పనిచేస్తున్న కట్టుపని వాళ్ళకు ఆ వుత్తరం కంటబడింది. అందులో ఒక డ్రం, ఒక చాక్ బాక్స్, కాలి చెప్పులు, ఒక సిల్క్ టై, పెన్సిల్ బాక్స్, సిపాయీల బొమ్మలు ఇంకా ఏవైనా అదనపు ఆడుకునే బొమ్మలు కావాలని వ్రాసాడు. 76 ఏళ్ల డేవిడ్ హేలాక్ ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నాడని తెలుసుకొని కట్టుపనివాళ్ళు ఆ ఉత్తరంతో పాటు అందులోని వస్తువులన్నీ కొని క్రిస్మస్ బహుమతిగా ఆయనకు బహూకరించడం జరిగింది. “నా వుత్తరం 70 ఏళ్ల తరువాత సాంటా అందుకొని ఈ బహుమతులు నాకు పంపించాడు. చాలా సంతోషం. అప్పుడు ఈమెయిలు వ్రాసి వుంటే వెంటనే బహుమతులు వచ్చే ఉండేవేమో ” అని వ్యాఖ్యానించాడు.

ఈమెయిలు సంగతి అటుంచి పైనుదహరించిన వార్తలో గమనించాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఇప్పుడు క్రిస్మస్ బహుమతులుగా కాలి చెప్పులు, పెన్సిల్ బాక్స్ ఎవరైనా ఇస్తే తీసుకుంటారా? 50 ఏళ్ల క్రితం కాళ్ళకు చెప్పులుంటే అదొక హోదా! కళ్ళకు గాగుల్స్ వుంటే అదొక గర్వం! ఇంట్లో ఫ్యాన్ వుంటే అదో ఆనందం! పాటలు వినడానికి రేడియో వుంటే అదో అనుభూతి! త్రొక్కడానికి సైకులు వుంటే అదొక ఆడంబరం!

ఇప్పుడవన్నీ అతి సామాన్యమైన వస్తువులు. ఇచ్చే వారే లేరు. ఇచ్చినా పుచ్చుకునేవారు కూడా లేరు. ఐపాడ్, ఐఫోన్, సామ్సంగ్, లాప్ టాప్, ట్రావెల్ వోచర్లు, మందు సీసాలు, గోల్డ్ క్లాసు సినిమా టిక్కెట్లు – ఇలా కాలక్రమేణా ఇచ్చే బహుమతులు మారిపోయాయి, అవసరాలు శాసిస్తున్నాయి.

సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాం. ఆ వస్తువులపై ఆధారపడుతున్నాం. అవి లేకపోతే బ్రతకలేని పరిస్థితికి వచ్చాం. చేతిలో వాలెట్ లేకపోతే ఫరవాలేదు కానీ ఫోన్ లేకపోతే మెదడు పని చెయ్యదు. అడుగు ముందుకు పడదు. మనిషిలోని కోరికలను, వ్యామోహాన్ని వ్యాపారంగా మలచుకొని సొమ్ము చేసుకునేవాళ్ళు కొందరైతే బలహీనతలను అవకాశంగా తీసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగ పరచే వారు మరికొందరు.

కలిగిన వాళ్ళు ఖరీదైన గిఫ్టులు ఇవ్వటంలో తప్పు లేదు. అయితే సమాంతరంగా దాన గుణాన్ని పెంపొందించే మహత్తరమైన కార్యక్రమాలు భావి తరాల వారికి చూపించి వారు అందులో పాల్గొనగలిగేటట్లు చేయగలిగితే చాలా బాగుంటుంది. దిశా నిర్దేశాలు తిరగదోడినట్లవుతుంది. ఆకలి చావులు, దుర్భర దారిద్ర్యం కొంతమేర అరికట్టగలిగే వాళ్ళమౌతాం.  మన ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు వారికి వచ్చే సాంవత్సరిక ఆదాయంలో 10 శాతం తోటి సహచరులకు ఇవ్వడం అనేది ఆనవాయితీ.  ఇది ఎంతో అభిలష ణీయమైన  విషయం.

2015 సంవత్సరంలో పారిస్ లో జరిగిన టెర్రరిస్ట్ ల దుర్ఘటన, చెన్నైలో జరిగిన పెను తుఫాను మొదలైన సంఘటనలను అధిగమించి మానవాళి ముందుకు సాగిపోయింది. 2016 వ సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని తెలుగుమల్లి కోరుకుంటూ అందరికీ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది.

Send a Comment

Your email address will not be published.