తెలుగుమల్లి పాఠకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2013 వ సంవత్సరంలో ఇటు ఆస్ట్రేలియా మరియు భారత దేశాల్లో జరిగిన సంఘటనలను ఒకసారి నెమరువేసుకొని 2014 వ సంవత్సరానికి స్వాగతిద్దాం.
చాలామంది నోట ఒకే మాట. ఏమిటీ 2013 వ సంవత్సరం ఇంత తొందరగా ముగిసిందే! అని. అంటే ప్రతీ వారూ వారి వారి పనుల్లో తీరిక లేకుండా వున్నారన్నది నిర్వివాదాంశం. అలా వుండటం చాలా మంచిదే మరియు అవసరం కూడాను. ఎందుకంటే ఎవరి పనుల్లో వారుండి సమాజపు పురోభివృద్ధి వైపు పయనిస్తూ వుంటారు.
ఈ సంవత్సరం ఆస్ట్రేలియా తెలుగువారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ ఒక పుట. గత 50 సంవత్సరాలుగా తెలుగు వారు ఇక్కడ నివసిస్తున్నా ఎన్నో చిన్న పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా సిడ్నీలో ఏప్రిల్ నెలలో జరిగిన రెండవ “ప్రపంచ తెలుగు మహోత్సవం” తెలుగువారందరూ చిరస్థాయిగా గుర్తుంచుకోవలసిన ఘట్టం. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఒక మహోత్సవాన్ని నిర్వహించడం ఒక అనిర్వచనీయ అనుభూతి. ఈ ఉత్సవంలో ముఖ్యంగా మెల్బోర్న్ వాస్తవ్యులు షుమారు 100 మంది ప్రత్యేకంగా వెళ్లి జాతర కార్యక్రమాన్ని కనుల పండువుగా ప్రదర్శించి అంతర్జాతీయ గుర్తింపుని పొందడం ఎంతో ముదావహం. ఈ మహోత్సవ నిర్వాహకులు ముఖ్యంగా ముందు నిలబడి ఈ ఉత్సవానికి నాయకత్వం వహించిన శ్రీమతి అరుణ చంద్రాల గారు ఎంతో అభినందనీయులు.
అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం పెను తుఫానులతో వరదలు రావడం మరియు రాష్ట్ర విభజన కార్యక్రమం అనుకున్నదానికంటే అతి వేగంతో జరగడం చాలామంది ఈ విషయాలు జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఈ విభజన ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. భారతదేశ సార్వత్రిక ఎన్నికలు మరో 4 నెలల్లో జరగనున్నాయి. బి.జె.పి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజ్వరిల్లుతుందా? రాష్ట్ర ఎన్నికలకూ సార్వత్రిక ఎన్నికలకూ సంబంధం లేదని అపూహకు లోనై కాంగ్రెస్ ముందుకెలుతుందా? వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది.
దక్షిణాఫ్రికా జాతి పితగా పిలవబడే శ్రీ నెల్సన్ మండేలా ఈ నెల తమ అంతిమ శ్వాస విడువడం ఈ ప్రపంచానికి ఎంతో తీరని లోటు. దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య ఊద్యమములొ పాల్గొని జాతి వివక్షకు గురైన తమ దేశ పౌరులను శ్వేత జాతి బంధాలనుండి విముక్తులను చేసి ప్రపంచ శాంతి కోసం తపన పడిన ఒక పోరాట యోధుడు శ్రీ నెల్సన్ మండేలా. వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుగుమల్లి కోరుకుంటుంది.
ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాల్లో దాదాపు అన్ని తెలుగు సంఘాలు విరివిగా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తెలుగు వారికి ప్రతీ రాష్ట్రంలోనూ ఒక ప్రత్యేక గుర్తింపు తేవడం ఎంతో ప్రశంసనీయం. “ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అన్న రాయప్రోలు వారి సూక్తి ననుసరించి ప్రతీ కార్యక్రమంలో తెలుగుదనాన్ని ఎంతో చక్కగా ప్రదర్శిస్తున్న అన్ని తెలుగు సంఘాలకు తెలుగుమల్లి శత సహస్ర వందనాలర్పిస్తోంది. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ తగు రీతిలో ప్రచారం అందించడంలో కానీ తెలుగుమల్లి ఎప్పుడూ మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని మాట ఇస్తోంది. అలాగే ఈ రెండు దేశాల్లోని ప్రతీ ప్రధాన నగరాల్లో తెలుగు బడిని మొదలుపెట్టి భావి తరాలకు మన భాషా సంస్కృతులు అందివ్వడంలో అందరూ సఫలీక్రుతులవుతున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనీ తెలుగువారందరూ ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి సహకరించాలని తెలుగుమల్లి అభ్యర్దిస్తోంది.
మీరు ఈ వేసవి సెలవుల్లో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం శుభప్రదంగా ఆహ్లాదకరంగా జరగాలనీ తెలుగుమల్లి కోరుకుంటోంది. 2014 వ సంవత్సరానికి మంచి తీర్మానాలని చేసుకొని అభివృద్ధి పథంలో అందరూ తమ ప్రయాణాలను కొనసాగించి ఆయురారోగ్య ఐస్వర్యాలతో తులతూగి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్ట గలరని తెలుగుమల్లి ఆశిస్తోంది.