డయాస్పోరా సాహిత్యంలో ఆస్ట్రేలియా ముందడుగు

కరోనా మహమ్మారి నుండి చాలామంది ఇబ్బందులు పడడం, ఎంతోమంది వారి ఆత్మీయులను కోల్పోవడం, మరెంతోమంది ఆర్ధికంగా, మానసికంగా అవస్థలు పడడం చూసాము, చూస్తున్నాము. అయితే ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాలలో మన తెలుగువారు సాహితీ పరంగా ఎంతో ముందడుగు వేసారు. చాలామంది ఇంటినుంచే పనిచేయటం ద్వారా కొంత సమయం చిక్కడంతో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నారు.

ఆస్ట్రేలియాలో ఛందోబద్ధమైన పద్య రచన చేసేవాళ్ళను వేళ్ళ మీద లెక్కించవచ్చు. అయితే ఆస్ట్రేలియా అవధాని శారదామూర్తి శ్రీ కళ్యాణ్ తటవర్తి గారు ఇక్కడ అందుబాటులో ఉండి తనకు వచ్చిన విద్యను పదుగురుతో పంచుకోవాలన్న తపనతో గత సంవత్సర కాలంగా జూమ్ వేదికగా పద్య రచన నేర్పించడం మొదలుపెట్టారు. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు ముగ్గురుతో మొదలై ఇప్పుడు సుమారు 20 మంది పద్య రచనను నేర్చుకుంటున్నారు. వీరిలో కొందరు భారతదేశం, దుబాయ్, సౌత్ ఆఫ్రికా నుండి కూడా ఉన్నారు. ఇప్పటికి వీరందరూ కలిసి రెండు శతకాలు వ్రాసారు. ఒక కథాంశాన్ని తీసుకొని పద్య కావ్యంగా వ్రాసారు. మరో మూడు శతకాలు వ్రాయడానికి సిద్ధమౌతున్నారు.

వీరందరూ కలిసి తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధానాలను కూడా చేస్తున్నారు. ఇక్కడి పృచ్చకుల ప్రతిభాపాటవాలను మెచ్చుకుంటూ త్రిభాషావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు కూడా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల తెలుగువారితో రెండు అవధానాలు చేయడం ఎంతో శ్లాఘనీయం. ఇప్పుడు ఆస్ట్రేలియా అంటే అవధానానికి మారు పేరని ప్రపంచం నలుమూలలా మారుమ్రోగుతుంది.

‘పద్యాలెవరు చదువుతారండీ’ అనేవాళ్ళు కూడా లేకపోలేదు. సంగీతం సాహిత్యం రెండూ చేదోడు వాదోడుగా కలిసి ప్రయాణం చేస్తాయి. తెలుగు చిత్రసీమలో మొదటి రోజుల్లో అంటే 1950-70 దశకాలలో చాలా మంచి సాహిత్య పరమైన పాటలు చందోబద్దంగా వ్రాసినవే. ఇలా వ్రాస్తే ఆ పాటలకు శృతి కట్టడం సులభతరమౌతుందని సంగీత విద్వాంసులు చెబుతారు. ‘కందం వ్రాయనివాడు కవికాడని’ నానుడి. చిన్న పద్యమైనా దానికున్న లక్షణాలు వేరే ఏ పద్యానికీ లేవు. అవధానంలో నిషిద్ధాక్షరికి సాధారణంగా ఈ పద్యాన్నే వాడుతారు. ఇప్పుడు పద్యాలు నేర్చుకుంటున్నవారు అలవోకగా కందం వ్రాయగలుగుతున్నారు.

తెలుగు భాష డయాస్పోరా సాహిత్యం చూసుకుంటే ఇప్పుడు అమెరికా తరువాత ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉందనేది నిర్వివాదాంశం. తెలుగు సాహిత్యంలో ఉన్న చాలా ప్రక్రియలు ఇక్కడ చాలామంది సాధన చేస్తున్నారు. కవితలు, కథలు, కథనాలు, నాటికలు, పద్యాలు, నానీలు, హైకూలు – ఒకటేమిటి – అన్నింటికంటే ముఖ్యంగా పౌరాణిక రంగస్థల నాటకాలు ఇక్కడి ప్రేక్షకుల నాడికి అనుగుణంగా వ్రాసుకొని రంగస్థలంపై ప్రదర్శించడం ఎంతో ముదావహం. దృశ్య, శ్రవణ మార్గాలతో సాంకేతికను అనుసంధానించి తెలుగు భాషను పిల్లలకు నేర్పించడంలో కూడా కృతకృత్యులౌతున్నారు.

ఇప్పుడు భాగవత ఆణిముత్యాలు (iBAM) వారు నిర్వహిస్తున్న పోతన భాగవతం పద్య పఠన పోటీలలో ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ నుండి సుమారు 70 మంది పిల్లలు పాల్గొని భాగవత పద్యాలు నేర్చుకుంటున్నారు. అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమౌతున్నారు.

ప్రపంచంలో భారతదేశం వెలుపల తెలుగు భాషను సామాజిక భాషగా గుర్తించిన ఒకే ఒక్క దేశమైన ఆస్ట్రేలియాలో తెలుగు భాష పరిపరి విధాలుగా పరిఢవిల్లుతుంది. అందుకు ప్రతీవారు తమవంతుగా పనిచేసి భాష సేవలో సేదదీర్చుకుంటున్నారు. అందరికీ వందనాలు.

1 Comment

  1. వంగూరి చిట్టెన్ రాజు

    క్లుప్తంగా అయినా సమగ్రంగానే అన్ని విషయాలూ ప్రస్తావించారు, మిత్రమా. అభినందనలు.

Send a Comment

Your email address will not be published.