తల్లి భాషను పరిరక్షించుకోవాలి

ఈనెల 21వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని ….
—————————————-
భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి భాష అనే తెలుగు పదం ఏర్పడితే లింగ్వా అనే లాటిన్ పదం నుంచి లాంగ్వాజ్ అనే ఆంగ్ల పదం ఏర్పడింది. ఒకరు మరొకరితో మాట్లాడటానికి ఒక భాష ముఖ్యం. అలా భాషలు పుడితే వాటికి లిపి అనేక సంవత్సరాల తర్వాత పుట్టింది. పుట్టిన రెండేళ్లకు శిశువు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది. అదీ ఆ శిశువుకు మాతృభాష అవుతుంది. అయితే పెరిగి పెద్దయ్యే కొద్దీ మనకు మరికొన్ని భాషలు కూడా అవసరం అవుతాయి. తల్లి భాష తర్వాతే వాటికి స్థానం కల్పించాలి. భాషకు సంబంధించి రెండు కోణాలు ఉంటాయి. అవి  మాట్లాడేందుకు ఉపయోగపడే భాష ఒకటవుతే మరొకటి సాహిత్యానికి ఉపయోగపడే తీరు. సాహిత్యంలో అర్ధం, దాన్ని ప్రకటించే శబ్దం శివపార్వతుల లాంటివి. అదలా ఉంచితే, ప్రపంచంలో అనేక వేల భాషలు ఉంటె వాటిలో కొన్ని భాషలు మరుగునపడే ప్రమాదముందని ఐక్య రాజ్య సమితి విద్య, శాస్త్ర సాంస్కృతిక సంస్థ ఒక అధ్యయనం చేసి మరుగున పడే భాషల జాబితాను తయారు చేసింది. మన దేశంలో దాదాపు రెండు వందల భాషలు ప్రమాదపు అంచున ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొంది. అటువంటి వాటిని పరిరక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని యునెస్కో గట్టిగా వక్కానించింది.

మన దేశంలో 1650కి పైగా భాషలు ఉన్నా కొన్నింటికి లిపి లేదు. కేవలం మాట్లాడటం వరకే బతుకుతున్న భాషలు ఉన్నాయి. లిపి లేని కారణంగా చాల భాషలకు సాహిత్య అదృష్టం లేకుండా పోయింది. దాదాపు అరవై ఏళ్ళ క్రితం అంటే 1954 లో సాహిత్య అకాడమి మొత్తం 22 భారతీయ భాషలను గుర్తించింది. రాజ్యాంగంలో లేని ఇంగ్లీష్ వంటి మరి కొన్ని భాషలను కూడా ఇందులో చేర్చింది. మన తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఇందులో తెలుగు కాకుండా తమిళం, కన్నడం, మలయాళం తదితరాలు ఉన్నాయి.

మన తల్లి తెలుగు భాష విషయానికి వద్దాం. కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న మన భాషలో అనేక దశలు ఉన్నాయి. కాలాన్ని బట్టి మారుతున్నాయి. గ్రాంధికం కన్నా వ్యావహారికంపై దృష్టి పెడితే భాష తెలుగు పది కాలాల పాటు బతుకుతుందని అందుకోసం ఉద్యమంలా నడుం బిగించిన వారు అనేకులున్నారు. వారిలో ఇప్పుడు జరుగుతున్న  భాష ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కీర్తి శేషులు గిడుగు రామమూర్తి పంతులు గారు. ఇందుకు తనను పూర్తిగా అంకితం చేసుకున్న ఆయన 1906 నుంచి 1940 వరకు జరిపిన భాషా ఉద్యమానికి వ్యావహారిక భాషా ఉద్యమంగా పేరు పొందింది. సామాన్య ప్రజలలోంచి వచ్చే భాషను దోపిడీ చేసి తమ ఇష్టమొచ్చిన రీతిలో విద్యనూ, సాహిత్యాన్ని వారికి అందకుండా చేసిన స్వార్ధపు ఆలోచనల మీద ఆయన చేసిన పోరాటం అది. ఆయన తరువాత కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి తదితరులు గిడుగువారి తిరుగుబాటు బావుటాను కొనసాగించారు. వీరిలాంటి అనేకుల వాళ్ళ భాష సామాన్యులకు సైతం చేరువవుతున్నా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా అనిపించుకున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు వార్తలు సమర్పించే భాషలో పర భాషా పదాలను వాడటం విచారకరం. ముఖ్యంగా కొన్ని తెలుగు టీవీ న్యూస్ చానల్స్ లో తెలుగు మాటలకన్నా ఇంగ్లీష్ మాటలను యథేచ్చగా వాడటం చెవిన పడుతుంటే బాధ కలుగుతుంది.

మరోవైపు పిల్లలకు మమ్మీ, డాడీ విద్యా సంస్థలు  పిల్లలను ఆంగ్లో ఇండియన్ పిల్లల్లాగా మార్చేయడం ఆలోచించవలసిన అంశం. ఎల్ కె జీ నుంచే మొదలు పిల్లలపై  ఇంగ్లీష్ భాష రుద్దడం, అలాంటి విద్యా సంస్థల్లోనే తమ పిల్లలను చేర్చడానికి కన్న తల్లితండ్రులు చేర్చడానికి పోటీ పడటం కూడా తెలుగు భాషకు చీడ పట్టినట్టు అనుకోవచ్చు. ఇక మాతృభాషను పరిరక్షించవలసిన పాలకులు కూడా ఎంత వరకు కృషి చేస్తున్నారో చూస్తే బాధ కలుగుతుంది. కొత్తగా భాషా సాంస్కృతిక శాఖను నెలకొల్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఇది భాషా అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లు అయ్యింది. అయితే తెలుగుకు అన్ని రంగాలలోనూ ప్రాధాన్యం దక్కడం కోసం కంప్యూటర్ సాఫ్ట్ వేర్, నిర్వహణ వ్యవస్థలను తెలుగులో తయారు చెయ్యడం అవసరం.

ఎనిమిది కోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష అయిన తెలుగు స్థాయి తగ్గిపోకుండా ఉండాలంటే పిల్లలకు చిన్నప్పటినుంచే తెలుగు నుడికారాన్ని దాని గొప్పతనం తెలియచెప్పడం పెద్దల కనీస కర్తవ్యం. అలాగే వేమన, సుమతి, కుమార, భాస్కర వంటి శతకాలు నేర్పడం అవసరం.  అక్కడిదాకా ఎందుకు, పల్లెల్లో మాట్లాడే పదాలను నగరాల్లో ఉన్న వారికి చెప్తే ఏమిటి ఆ తెలుగు అని చిన్న చూపు చూడటం విచారకరం. నాగరికత పేరుతో యువతరంలో అధిక శాతం మంది మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉద్యోగాల కోసం చదివే చదువులు చదవవద్దని చెప్పడం లేదు. కానీ మాతృభాషను పట్టించుకోకపోవడం సరి కాదుకదా..? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆంద్ర దేశంలో ఉన్న వారికన్నా విదేశాలలో ఉన్న వాళ్ళే తెలుగు సరిగ్గా మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది.

ఇది ఇలా ఉండగా, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగులో కాకుండా తమిళం లోనో ఇంగ్లీష్ లోనో మాట్లాడుకోవడం ఒక అలవాటై పోయింది. ఇటువంటి వికారాలు వదులుకోవాలి. మౌలికంగా మనం తెలుగు వారం అనే విషయాన్ని మరవకుండా మన భాషను బతికించు కోవడానికి ఎవరికి వారం తమవంతు కృషి చెయ్యడం ముఖ్యం.

Send a Comment

Your email address will not be published.