తెగులు తగిలిన తెలుగు

“ శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార
తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మందార
సుధా పయోధి సిత తామర సామర వాహినీ
శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ”
…అలనాటి పోతనామాత్యుని అచ్చ తెనుగు పద్యం జాడలని వెదికి పాడవలసిన అవసరం నేటి తరానికి వుందని నేను భావించటం లేదు

కాని …
ఈ మధ్యయుగంలో తెలుగు భాష ప్రాదాన్యం రోజు రోజుకూ దిగజారి పోతోంది తెలుగు సాహిత్యం నీడే కాదు జాడ కూడా కనపడకుండా పోతోంది. గ్రామీణులు కూడా మాట్లాడుకోని వింత భాషలో సినిమా పాటలు వినిపిస్తున్నాయి. పట్టణాల్లోనే కాదు అన్ని ప్రాంతాల్లోనూ అసలు తెలుగు భాషలో మాట్లాడే వారే తక్కువై పోతున్నారు. ఇంగ్లీషు, హిందీ పదాల వాడకం సర్వ సాధారణం అయిపోయింది. అందుకు తోడుగా ఈతరం కవుల పాటలద్వారా, మాటల ద్వారా అతిత్వరలోనే తెలుగు భాష పూర్తిగా అంతరించి పోనుంది.

ఎవరూ అడ్డుకోలేరులే! అనే ధీమాతో విపరీత ధోరణులననుసరిస్తూ అర్ధంలేని ధ్వనిపదాల్ని వాడుతూ యిప్పటి కవులనబడే వారు వ్రాసిన పాటల్ని వింటూనే ఈ కాలం యువత ఉర్రూతలూగి పోతోంది.

ఒకనాటి తెలుగువారి అంతరంగంలో నిదురపోతోన్న …

“తేట తేట తెనుగులా…తెల్లవారి వెలుగులా… తేరులా …సెలయేరులా” …
“పాడుతా తీయగా చల్లగా …పసి పాపల నిదురపో తల్లిగా…బంగారు తల్లిగా” …
“ఏ దివిలో విరిసిన పారిజాతమో…. ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో “…
“నా హృదయంలో నిదురించే చెలీ ! కలలలోనే కవ్వించే సఖీ ”…..
“మనసున మనసై – బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ”…
ఆ తెలుగు పాటలేమయ్యాయని గతతరం వారంతా వాపోతున్నారు.

ఒకప్పడు …
“లేలె లే నా రాజా … లే లే నా రాజా… లేవనంటావా … నన్ను లేపమంటావా….
“తీస్కో కోకాకోలా వేస్కో రమ్ము సారా … చూస్తే మజా.. గుటకేస్తే నిషా… కలిపి కొట్టు మొనగాడా…”
“ఆకలేస్తే అన్నం పెడతా….అలిసోస్తే ఆయిల్ పడతా …మూడొస్తే ముద్దు పెడతాచిన్నోడా!….”
కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలీ…ఆడితే ఆడాలిరా.. రఫ్ ఆడాలీ….చరిత్రలో నీకో పేజుండాలీ…
…అనే సినిమా పాటలని వింటూనే తెలుగు జనం విస్తు బోయారు.

ఆతర్వాత…

“ఓరోరి యోగి నన్ను కోరికేయరో …. ఓరోరి యోగి నన్ను నమిలేయరో………
ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ……………………………………………
“సరిగమపదనిస్సా అరే కరో కరో జల్సా ………………………..

“మస్కా మేరి జాన్ తుమ్హారా మస్కా …భాగ్దాద్ గజదొంగై వస్తా ………
“కన్ఫుజన్ కన్ఫుజన్ తీనేజే కన్ఫుజన్……మాటల్లో చేతల్లో టోటల్ కన్ఫుజన్………..
“హి టిప్ టాప్ దొర కదిలిండో….ఎవడికి వీడు దొరకడు లెండో………
“ఒక్క సారి ఐ లవ్యుఅనవే సచ్చిపోతా….ఈ లయ్ ఫుతో నాకేం పని లేదని రెచ్చిపోతా…..
తదనంతరం కొన్నాళ్ళ క్రిందట యిలా వినిపించిన వాటిని వింటూనే జనం ఆదిరిపోయారు

వాటి వెనువెంటే యిపుడిపుడే…

షక లక బేబి షక లక బేబి లుక్కులివ్వ తోచ లేదా
షక లక బేబి షక లక బేబి లవ్వు చేయ తోచ లేదా

జింగిలాలో ఏం గింగిరాలో బొంగరాలో ఈ భాంగ్రాలో
లెఫ్ట్ రైట్ లేదురో పడుచు బాటలో ఎర్ర లైటు వద్దురో కుర్ర జోరులో

హయ్యారే హయ్యా మొగిలి పువ్వులాంటి మొగుడెవ్వరే
ఓ సయ్యారే సయ్యా బ్యాండు మేళతాళాల మనువెప్పుడే
పైవాటికి తోడుగా యిప్పుడు వినిపిస్తోన్న ఈ గందరగోళపు ధ్వనుల పాటలతో నేటి చిన్నారులకు స్వచ్ఛమైన తెలుగుభాష ఎలా వొంట బడుతుంది ?

యిలా…తెలుగు సాహిత్యం అలా దారి తప్పుతోంటే మనమంతా చూస్తూ, వింటూ కూర్చుంటున్నాం.

యిలాంటి పాటలతో తెలుగు భవిష్యత్తు ఏం కానుందో మీరే ఊహించండి. సగం తెలుగు సగం ఇంగ్లీషు హిందీ భాషా పదాల కూర్పుతో ఈ మధ్య కాలంలో నేటి తరం సినీ కవులు వ్రాస్తున్న సినిమా పాటల్లోని ఈ సాహిత్యాన్నిఎలా జీర్ణించు కోవాలి ?

ఈ ధోరణి యిలాగే కొనసాగితే కొన్నాళ్ళ తర్వాత తెలుగుభాషలో సంభాషణ ప్రకరణం కాస్తా పూర్తిగా ముగిసి పోతుంది.

అందుకని తేనెలొలుకు తెలుగు భాషని దాదాపుఅవసాన దశకుచేరుస్తోన్న నేటి తెలుగుతరాన్నిఅడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వ్యక్తి పైనా వుంది. ఆ తెలుగు వెలుగుని ఆరిఫోనీకండి.

నేటి తల్లి తండ్రులు తమ సంతతికి తెలుగుభాషని మాతృభాషగా ధారపోయాలి.
భవిష్యత్తులో కూడా తెలుగు వైభవం యదావిధిగా కొనసాగాలి.

అందరూ అందుకు మనస్ఫూర్తిగా సహకరించాలి!

తెలుగు సోదర సోదరీ మణులారా! తెలుగు దివ్వెని తరతరాలు వెలుగుతూ వుండేలా చూడండి.!

SP Chari

Send a Comment

Your email address will not be published.