‘తెలుగుమల్లి’ పరిమళాలకు సాహితీ పురస్కారం

— మండలి వెంకట కృష్ణారావు సాహితీ పురస్కారం
IMG-20180805-WA0086-11
ఐదేళ్ళ సుదీర్ఘ ప్రయాణం. ఐదు వసంతాల సాహితీ సువనం. ప్రవాసంలో తెలుగుమల్లి సాహితీ పరిమళాల భాండాగారం. అమ్మ భాషే పరమావధిగా అంచలంచెలుగా ఎదిగిన అమృత కలశం. ఆస్ట్రేలియా దేశంలో అమ్మ భాషను అమరభాషగా చేయాలన్న దీక్షా సంకల్పం. పరభాషా సంస్కృతిలో మన భాషకోసం అరవిరిసిన మందారం. భావితరాలకు వారధిగా ఒక బాంధవ్యం.

ఐదేళ్ళు అలుపెరుగని ప్రయాణంలో ఎన్నో భాషాపరమైన వ్యాసాలు. ముఖ్యంగా ‘మన’ తెలుగువారు ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో జరుపుకున్న కార్యక్రమాలు, ఎంతోమంది మన తెలుగు సంఘాలలో ఉన్నత శిఖరాలనధిరోహించి స్పూర్తిదాతలుగా నిలచిన వ్యక్తుల జీవిత విశేషాలు, తెలుగు సాహిత్యంలో స్థానిక భాషాభిమానులు వ్రాసిన కవితలు, కధలు, పద్యాలూ – ఇలా ఎన్నెన్నో విశేషాలతో తెలుగుమల్లి ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ తెలుగు వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసింది.

ఈ కృషిని గుర్తిస్తూ 2018 సంవత్సరానికి శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి అంతర్జాతీయ తెలుగు కేంద్రం వారు ప్రతీ ఏటా ఇచ్చే శ్రీ మండలి వెంకట కృష్ణారావు ‘అంతర్జాతీయ సంస్కృతీ’ పురస్కారం తెలుగుమల్లికి ప్రదానం చేసారు.

ఆగష్టు 5వ తేదీన విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘అంతర్జాతీయ సంస్కృతీ’ పురస్కారం ప్రముఖ గాయని గాన సరస్వతి, పద్మ భూషణ్ శ్రీమతి పి.సుశీల గారి చేతుల మీదుగా ప్రదానం చేయడమైనది. ఈ కార్యక్రామానికి తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు గౌరవనీయులు శ్రీ కె.వి.రమణాచారి గారు, ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధి శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ పీతాని సత్యనారాయణ గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు విచ్చేసారు. తెలుగు విశ్వవిద్యాలయం సంచాలకులు ఆచార్య శ్రీ సత్తి రెడ్డి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. విశ్రాంత సంచాలకులు శ్రీ మునిరత్నం నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన శ్రీ రమణాచారి గారు తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు మనిషి ఎదుగుదలకు విశేషంగా దోహదం చేస్తాయని ఆ సంస్కారాన్ని అందిపుచ్చుకున్న శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు తనయుడు శ్రీ బుద్ధ ప్రసాద్ గారిని తెలుగు సంస్కృతిని జీర్నిన్చుకునేలా తీర్చిదిద్దారని కొనియాడారు. తండ్రిలో దైవాన్ని చూసుకుంటున్న శ్రీ బుద్ధ ప్రసాద్ గారు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి సలుపుతున్న “తెలుగుమల్లి” కి ప్రధానం చేయడం ముదావహం అని అన్నారు. ఆస్ట్రేలియాలో తెలుగు భాష ప్రాచుర్యం చేయడమే కాకుండా సుమారు 4000 పెద్దబాలశిక్ష పుస్తకాలు పంపిణీ చేయడం, తెలుగు రాష్టాలలోనే ఆదరణకు కరువై రంగస్థల నాటకాలు క్షీణ దశలో ఉన్న కాలంలో శ్రీ కృష్ణ రాయబారము, శ్రీ పార్వతీ కళ్యాణం వంటి పౌరాణిక నాటకాలు దిగ్విజయంగా ప్రదర్శించిన తీరును కొనియాడారు. నేటి యువతరం “తెలుగును మరవద్దు – తెలుగును విడవద్దు” అని పిలుపునిచ్చారు.

ఆత్మీయ అతిధిగా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ఉప శాసన సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ పురస్కారం ఏర్పాటు చేసిన నేపద్యం వివరిస్తూ ప్రపంచంలో ఏ మూలనున్నా తెలుగువారు తమ మాతృ భాశాభివృద్ధికి తోడ్పడాలని మనకున్న స్థానాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిధులుగా గాన కోకిల శ్రీమతి పి.సుశీల మరియు నటి సావిత్రి కుమార్తె శ్రీమతి చాముండేశ్వరి గారు పాల్గొన్నారు. శ్రీమతి పి. సుశీల గారు రెండు శ్లోకాలను ఆలపించి సదస్యులను ఉల్లాసపరిచారు.

మంత్రివర్యులు శ్రీ పీతాని సత్యనారాయణ గారు మాట్లాడుతూ పలువురు ప్రవాసాంధ్రులు తెలుగునేలకు మించి తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంగతి ప్రభుత్వపరంగా గుర్తించామని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం శ్రీ మండలి వెంకట కృష్ణారావు పురస్కారం ఖండాంతరాలలో తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పి కమ్యునిటీ భాషగా గుర్తించడానికి అవిరామ కృషి సలుపుతున్న “తెలుగుమల్లి”కి ఇవ్వడం చాలా సంతోషం కలిగించిందని చెప్పారు.

పురస్కార గ్రహీత “తెలుగుమల్లి” సంపాదకులు మరియు సంచాలకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు మాట్లాడుతూ బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టంగట్టే ప్రాశ్చాత్య దేశాలలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో వుందని తెలుగు భాష కమ్యునిటీ భాషగా గుర్తించడానికి గత నాలుగేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయనీ చెప్పారు. ఆస్ట్రేలియాలో కేంద్ర ప్రభుత్వ రేడియో తెలుగు కార్యక్రమాలు త్వరలో ప్రారంభినించనుందనీ, ప్రతీ ముఖ్య నగరంలో తెలుగు సంఘాలు తెలుగు బడులను నిర్వహిస్తూ తెలుగు భాషను భావి తరాలకు అందివ్వాలన్న దీక్షతో పని చేస్తున్నాయని తెలిపారు. ఈ అంతర్జాతీయ పురస్కారం ఈ వేదికపై అందుకోవడం ఎంతో ఆనందంగా వుందని దీనిద్వారా తెలుగు భాషాభివృద్ధికి మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ‘దివిసీమ గాంధీ’ గా పేరొందిన మహనీయులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి స్మారకార్ధం స్థాపించిన పురస్కారం భాషాభిమానులైన ఎంతోమంది సన్నిహితుల మధ్య అందుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీ మండల బుద్ధ ప్రసాద్ గారికి మరియు శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.