భరణి - తెలుగు లోగిళ్ళలో సాహితీ వృక్షం

“తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డే నా అంతిమ లక్ష్యం” అని ఘంటాపధంగా చెప్పి తెలుగువాడిగా పుట్టినందుకు కాళిదాసు పేరెత్తినందుకు మరో జన్మంటూ వుంటే తెలుగుతల్లి బిడ్డగా పుట్టి “తనికెళ్ళ భరణి – కవి” అని తన ఇంటి ముందు బోర్డు పెట్టుకోవాలనే తపనలో తరించిపోతున్న కవి, మహా నటుడు తెలుగు వారి బంగారు భరణి వచ్చే నెల ఆస్ట్రేలియాలోని సిడ్నీ (ఆగష్టు 29-30) , మెల్బోర్న్ (ఆగష్టు 31), పెర్త్ (సెప్టెంబర్ 6) నగరాల్లో పర్యటించనున్నారు. తన జీవితమే ఒక పాఠంగా, ఈ ప్రపంచం తనను కాదన్నా ఎదురీగి తెలుగు కళామతల్లికి ముద్దు బిడ్డడైన కవి, నటుడు, దర్శకుడు, దార్శనికుడు, తత్వవేత్త శ్రీ తనికెళ్ళ భరణి.

మూడు గంటలలో చేయవలసిన పని అరగంటలో ఎలా కుదించలేమో జీవితం కూడా అంతే అంటారు శ్రీ భరణి గారు. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేయాలి. ఈ క్షణం మనది. రేపు మనది కాకపోవచ్చు. అందుకే రేపటి కొరకు ఎదురు చూసేకంటే ఈ రోజునే ఈ గంటనే ఈ క్షణాన్నే ఆస్వాదించి ఆనందించమంటారు.

బి.కామ్ థర్డ్ క్లాసులో ఉత్తీర్ణులై ఉద్యోగ వేటలో విఫలమై ఒక మందుల షాపులో అద్దాలు తుడుచుకునే ఉద్యోగంతో జీవితంలోని తొలి మెట్టుని అధిరోహించి “ఈ జీవితం ఇంతేనా? ముందుకెళ్ళే దిక్కు లేదా?” అన్న మీమాంసలో ఉన్నప్పుడు శ్రీ రాళ్ళపల్లి గారితో పరిచయం ఏర్పడి ఒక నాటకంలో అవకాశం వస్తే హైదరాబాదులోని రవీంద్ర భారతిలో తొలిసారిగా తన పాత్రకు ప్రేక్షక దేవుళ్ళు నిలబడి కరతాళ ధ్వనులు చేసినపుడు ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఉద్వేగంతో “ఈ దారే నా దారి” అని తనను తాను సంబాళించుకొని తదేక దృష్టితో నాటక రంగంపై దృష్టి మళ్ళించారు శ్రీ తనికెళ్ళ. తన 23 వ ఏట “గో గ్రహణం” నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు రావడం, అలా 18 ఏళ్ల నాటక రంగ సుదీర్ఘ ప్రయాణం తరువాత గురువుగారు శ్రీ రాళ్ళపల్లి సలహాతో వెండి తెరపైకి రావడం జరిగిందని శ్రీ భరణి గారు చెప్పారు.

1984లో “కంచు కవచం” సినిమాకి సంభాషణల రచయితగా ప్రారంభించి “లేడీస్ టైలర్”, “శ్రీ కనక మహా లక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్”, “వారసుడొచ్చాడు”, “చెట్టుకింద ప్లీడర్”, “స్వర కల్పన” మొదలైన సినిమాల సంభాషణలు వారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. “శివ” సినిమాలో “నానాజీ” పాత్ర తనకి ఎంతో మంచి పేరు తెచ్చిందనడంలో సందేహం లేదు. వైవిధ్యమున్న పాత్రలతో, విశిష్ట నటనా శైలితో ఎన్నో పాత్రలు వేసి ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న నటుడు శ్రీ భరణి.

సాహితీ రంగంలో విశిష్టమైన సేవలందించారనడానికి తాను రచించిన నాటకాలు “కొక్కొరో కో”, “జంబూ ద్వీపం”, కవితల సంకలనం “పరికిణీ”, “నక్షత్ర దర్సనం”. గత సంవత్సరం విడుదలైన “శభాష్ రా శంకరా” అయన రచనల్లో ఒక ఉత్కృష్టమైన శివ తత్వం. చిన్నప్పుడు చదువుకోలేక పోయానే అన్న బాధ ఇప్పుడు ఒక గ్రంధాలయానికి సరిపడినన్ని పుస్తకాలను వ్రాయడానికి తోడ్పడింది. శ్రీ భరణి గారు గ్రంధ పఠనం ఎక్కువగా చేస్తుంటారు. తనకున్న ముఖ్యమైన మూడు కోరికల్లో వారి ఇంట్లో ఒక గ్రంధాలయాన్ని ఏర్పరచుకోవడం. తన కోర్కెను తీర్చుకుంటూ ఒక గ్రంధ రచయితగా రూపుదిద్దుకున్న శ్రీ భరణి గారు తెలుగు లోగిళ్ళలో ఒక సాహితీ వృక్షం.

షుమారు 750 సినిమాల్లో వివిధ పాత్రలు ధరించిన శ్రీ భరణి గారు రెండేళ్ళ క్రితం “మిధునం” చిత్రానికి దరకత్వం వహించారు. ఈ చిత్రం ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపడం జరిగింది. వారి అంతిమ లక్ష్యానికి చేరువులో వున్నరనడానికి ఇదొక నిదర్శనం.

Send a Comment

Your email address will not be published.