తెలుగు వారిగానే ఉందాం

దశాబ్దాలుగా తెలుగు వారు ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో స్థిరపడి క్రొత్తగా వచ్చిన తెలుగు వారికి , స్థానిక స్వచ్చంద సేవా సంస్థలకు ఉదార స్వభావంతో సహాయ సహకారాలందిస్తూ అన్ని నగరాల్లోనూ తెలుగు వారి విజయ పతాకాన్ని ఎగురవేస్తూ వున్నారు. అనివార్య కారణాల వాళ్ళ మంచికో చెడుకో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలిపోవడం జరిగింది. అక్కడున్న పరిస్థితుల ప్రభావం అటువంటిది. కొన్ని వేల మైళ్ళ దూరం వచ్చిన మనం షుమారు 30 సంవత్సరాల నుండి కలిసుండి ఒకరికొకరం చేదోడు వాదోడుగా జీవిస్తూ ఎంతో ఆత్మీయంగా ముందుకు సాగి ఇతర బహుళ సంస్కృతీ సంస్థలకు ఆదర్శ ప్రాయంగా నిలిచాం. కొన్ని ప్రభుత్వాలనుండి బహుమతులందుకొన్నాం. “తెలుగు” వారనగానే స్థానికులందరికీ ఒక సదభిప్రాయాన్ని కలిగించాం. ఇదంతా కొన్ని సంవత్సరాల శ్రమ ఫలితం. మనలో ఎంతో మంది త్యాగధనులు (కుటుంబాలు) తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకు రాగలిగారు.

మనలో ఏ జిల్లా నుండి వచ్చారని కానీ ఏ ప్రాంతం నుండి వచ్చారని కానీ ఎప్పుడూ అడగలేదు. అందర్నీ అందరూ ఆహ్వానించారు, ఆదరించారు, అభిమానించారు. ఆలింగనం చేసుకున్నారు. అవసరాలకి ఆదుకున్నారు. అందరూ ఒక కుటుంబం లాగానే మెలిగాం అందరికీ ఇష్టమైన సంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించుకున్నాం.  ఎంతో హాయిగా ఆనందించాం. నవ్వుకున్నాం. మనకు మనమే శభాష్ అనుకున్నాం. భుజాలు చరుచుకున్నాం.

ఇక్కడ ఉన్న కొద్ది మందిలో ఆంధ్ర ప్రదేశ్ లో విడిపోయారు కదాని ఇక్కడ కూడా విడిపోదాం అన్న ఆలోచన రావడం మానవ సహజం. అయితే ఇక్కడ పరిస్థితులు వేరు, వున్న సంఖ్య వేరు. వున్న వాళ్లలోనే స్వచ్చందంగా పని చేసే వాళ్ళు వేళ్ళపై లెక్కించ వచ్చు. ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడానికి కనీసం 3 నెలలు అహర్నిశలూ శ్రమిస్తే నగరాన్ని బట్టి వచ్చే వాళ్ళ సంఖ్య 500 – 600 మధ్య వుంటుంది. కార్యక్రమ నిర్వహణ ఖర్చులు కూడా తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు. చివరికి కష్టపడి పని చేసిన వారికి చీవాట్లు తప్ప ఇంకేమీ మిగలక ముందుకొచ్చే వాళ్ళు కూడా రావడం లేదు.  సభ్యులు కూడా ఏ సంఘ కార్యక్రమానికి వెళ్ళాలి, వెళ్తే పర్యవసానం ఏమిటన్న ఆలోచనకు గురై అస్పష్టతకు లోనౌతరన్నది నిర్వివాదాంసం.

రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంట్లు కూడా సంఘ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర పరంగా విడిపోతే వచ్చే గ్రాంట్లు కూడా వస్తాయన్న నమ్మకం లేదు. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఎటువంటి స్థితి ఏర్పడిందో మీరంతా గమనిస్తూనే వున్నారు. ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వంద మంది వస్తే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది.

మనం ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగువారిగానే వచ్చాం. “మనం” అన్న పదంలోనే మన భాష ఒక నిగూఢమైన పాశంలా వుంది. భాషా పరంగా మనందరం దగ్గరయ్యాం. భాషా పరంగానే కలిసుందాం. తెలుగు వారిగానే వుందాం.

Send a Comment

Your email address will not be published.