తెలుగోళ్ళ సందడి

దసరా దీపావళి బక్రీద్ పండగల సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో మన తెలుగు వారు ఎంతో శోభాయమానంగా పండగ వాతావరణాన్ని సృష్టించి స్థానికులు సైతం అవాక్కయ్యే విధంగా బతుకమ్మ పండగలతో పాటు మన ముస్లిం సోదరులు బక్రీద్ పండగను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ముదావహం. ఈ పండగల సందర్భంగా కొన్ని తెలుగు సంఘాలు తెలుగు బడులు ప్రారంభించడం మరియు వినూత్న పద్ధతిలో పిల్లలకు ప్రోత్సహన్నిచ్చి పాటల పోటీలను నిర్వహించి వివిధ రకాలుగా అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు భవిష్యత్ కళాకారులూ సభలు నిర్వహించే వాచాస్పతులు కాగలరన్న ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు దేశాల్లో తెలుగుదనం ఎల్లలు దాటి పరవళ్ళు త్రోక్కుతుందంటే మన భాష, సంస్క్రుతులపైనున్న ప్రేమాభిమానాలు అపారం.

ఈ పండగ పర్వదినాలు పరవశంతో కొనసాగుతూ దీపావళి కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమౌతున్నారు. మెల్బోర్న్ తెలుగు సంఘం నిర్వహించిన జనరంజని కార్యక్రమం ఎంతో కనులపండువుగా గత నెల 22వ తేదీన జరిగింది. కాన్బెర్రా తెలుగు సంఘం దసరా నవరాత్రులు సందర్భంగా “రాగం తానం పల్లవి” కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వీన్స్ లాండ్ తెలుగు సంఘం ఈ నెల 19వ తేదీన దసరా దీపావళి పండగలను జరుపుకోనున్నారు. న్యూ జిలాండ్ తెలుగు సంఘం ఈ నెల 27వ తేదీన అంగరంగ వైభవంగా దీపావళి పండగను జరపాలని తలపెట్టారు. సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం వచ్చే నెల 2 వ తేదీన దీపావళి సంబరాలు జరుపుకోనున్నారు. . ఇలా ప్రతీ రాష్ట్రంలో తెలుగుదనం వరదలై పారుతోందంటే మన మాతృ భాష మృత భాషగా మారుతుందనే వాదనకు తావు లేదనే చెప్పాలి. ఇటువంటి వార్త ఎంతో హర్షణీయమైన విషయం.

ప్రపంచం నలుమూలలా మునుపెన్నడూ లేనంతగా తెలుగు వారు లేనిదే తెల్లవారని ప్రదేశం లేదంటే నమ్మశక్యం కాదు. షుమారు 18 కోట్ల మంది మాట్లాడుతున్న భాష మరి కొన్నేళ్లలో కనుమరుగౌతుందనే బాధ అందరిలోనూ కలుగుతుంది. భారతీయ సంస్కృతిలో భాషకు ఎప్పుడూ పెద్ద పీట వుంటుంది. భాష సంస్కృతులు విడదీయలేని అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఈ భాష లేనప్పుడు కొన్ని వేల సంవత్సరాల మన సంస్కృతికి కాలం చెల్లినట్లే కదా!. ఇదే అందరి బాధ. అందుకే తెలుగువారందరూ వారి వారి పరిధుల్లో మన భాషను పరిరక్షించే బాధ్యతను గుర్తెరిగి ఒక గురుతర బాధ్యతగా ప్రపంచ దేశాలన్నిటిలోనూ సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ భాషోద్యమం చేపడుతున్నారు. ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లోని షుమారు లక్షకి పైగా తెలుగువారు తరచుగా ఈ కార్యక్రమాలని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. అంతే కాకుండా ఈ కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ఇందులో పాల్గొనే వారి సంఖ్య కూడా ఎక్కువైంది. దీనివల్ల తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య పెరగడం అలా తెలుగు వ్రాసే వారి సంఖ్య కూడా పెరుగే అవకాశాలు వున్నాయి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని తెలుగు వారి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేయాలని తెలుగుమల్లి ముకుళిత హస్తాలతో మనవి చేస్తోంది.

Send a Comment

Your email address will not be published.