దీపావళి శుభాకాంక్షలు

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

ప్రవాసంలో దీపావళికి బాణాసంచాలు లేకపోయినా మన తెలుగువారు అంతకంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో ప్రతీ నగరంలోనూ భారతీయ సంతతి వారితో పాటు తెలుగువారు కూడా ప్రతీ వారాంతం పండగ వాతావరణంతో గత నెల రోజులు దసరా దీపావళి పండగలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ రెండు దేశాల్లోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి పండగను ప్రతీ నగరంలోని ముఖ్య కేంద్రాలు, కూడళ్ళు మరియు భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించి రాష్ట్ర పండుగగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. పార్లమెంట్ భవనాలు వెలుగు దివ్వెలతో అలంకరించడం కళ్లారా చూసాం. బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టంగట్టే ఈ రెండు దేశాలు దీపావళిని ప్రభుత్వపరంగా జరుపడం మన భారతీయ సంప్రదాయంపై వున్న గౌరవానికి చిహ్నం.

ఈ వేడుకల్లో ఎంతో మంది స్థానికులు పాలుపంచుకొని దీపావళి సంబరానికి వన్నె తేవడం విశేషం. ఈ దీపావళి అనేక పేర్లుతో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. మరిన్ని వివరాలు “దివ్యకాంతుల దీపావళి” లో చదువుకోవచ్చు.

వలస వచ్చిన వారిలో చాలామంది పట్టణ వాసులే కనుక తెలుగు పల్లెల్లో దీపావళి ప్రాముఖ్యత ఎక్కువమందికి తెలియకపోవచ్చు.

చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

Send a Comment

Your email address will not be published.