ముందుగా స్పాన్సర్లకు, పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి తెలిగిళ్ళ లోగిళ్ళలో దివ్య కాంతులు వెదజల్లి శాంతి సౌభ్రాత్రత్వము సోభిల్లాలని తెలుగుమల్లి కోరుకుంటుంది. పండగ పర్వ దినాల పవనాలు ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో ఇంకా కొనసాగుతూ వున్నాయి. అక్టోబర్ 27వ తేదీన న్యూ జిలాండ్ తెలుగు సంఘం ఆక్లాండ్ నగరంలో అత్యంత వైభవంగా దీపావళి వేడుకలు జరుపుకొనగా ఈ నెల రెండవ తేదీన సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం అడిలైడ్ నగరంలో తమదైన శైలిలో దసరా దీపావళి సంబరాలు జరుపుకోనుంది. ఇదివరకే చెప్పినట్లు ప్రతీ పండగ సంబరాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పాలుపంచుకొని ఒక మాటో, పాటో, పల్లవో అందుకొని ఒక కొమ్ము కాయడం ఎంతో ముదావహం. ఈ కార్యక్రమాలు ఇలాగె కొనసాగాలని మన ముందు తరం వారికి స్పూర్తినందించాలని మన సంస్కృతీ సంప్రదాయాలు జగమంతా దేదీప్యమానంగా దీపావళి దివ్వెలలా వెలుగునివ్వాలని కోరుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యం
ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా పంటలు, ప్రాణ నష్టం జరగడం ఎంతో శోచనీయమైన విషయం. పంట నష్టం వేల కోట్ల లో ఉంటుందని అనధికార అంచనా. శ్రీ కాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరుల్లో కొబ్బరి, వరి, పసుపు వంటి పంటలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరి, మిర్చి, పత్తి, పొగాకు, తెలంగాణలో కూరగాయలు, పూలు, పత్తి వంటి పంటలు తీవ్రం గా నష్ట పోయాయి. కనీసం పంట నష్ట పోయి పీకల్లోతు కష్టాలు, కన్నీళ్ళతో ఉన్న ప్రజలకి ఓదార్పు ఇవ్వక పోగా, అధికార పక్షం పై ప్రతి పక్షం, ప్రతి పక్షాల పై అధికార పక్షాలు దుమ్మెత్తి పోసుకోవడం, మీ అసమర్ధత అంతే మీ అసమర్ధత వల్లే రాష్ట్రం ఇలా తయారైందని తిట్టి పోసుకోవడం సరి పోయింది. అయితే రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజకీయ నాయకులందరూ ప్రజల అష్ట కష్టాలు మరిచిపోయి ఈ బురద రాజకీయాలు వెదజల్లుకోవటం మరింత బాధాకరమైన విషయం.
NSW లో బుష్ ఫైర్స్
వేసవి కాలం ఇప్పుడిప్పుడే మొదలవడంతో న్యూ సౌత్ వేల్స్ లో బుష్ ఫైర్స్ రావడం ఈ ప్రాంతంలో కూడా అపార నష్టం జరగడం మీ అందరూ గమనించే వుంటారు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన వారికి ఆదుకోవడానికి మన తెలుగు వారు చాలా మంది వారికున్న పరిధులలో సహాయ సహకారాల్నందిస్తూ ఫండ్ రైసింగ్ కేంపైన్లను నిర్వహిస్తున్నారు. వారికి తగు ప్రోత్సహన్నిచ్చి మన వంతుగా సహకారాన్ని అందిద్దాం.
శుభమస్తు
మరో రెండు నెలల కాలంలో మరొక సంవత్సరం చరిత్ర పుటల్లో కలిసిపోనుంది. ప్రస్తుతం పిల్లలు, తలిదండ్రులు పరీక్షలతో తీరిక లేకుండా వున్నారు. పిల్లలందరికీ తమ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలరని, పరీక్షల తరువాత భారత దేశం కానీ ఇతర ప్రాంతాలు కానీ వెళ్ళే యోచన ఉన్నట్లయితే వారి ప్రయాణం సుఖప్రదంగా జరగాలనీ తెలుగుమల్లి ఆశిస్తోంది. ఈ సెలవుల్లో మీరంతా చూసిన క్రొత్త ప్రదేశాలు, మీ అనుభూతులు మన తెలుగువారితో పంచుకోదలిస్తే చిత్రాలతో సహా తెలుగులో కానీ ఆంగ్లంలో కానీ మీకనుకూల సమయంలో వ్యాస రూపంలో అందజేస్తే తెలుగుమల్లి అంతర్జాలంలో తప్పకుండా ప్రచురిస్తుంది. అంతవరకూ సెలవ్…