దుర్ముఖి ఉగాదికి స్వాగతం

స్వాగతమమ్మ దుర్ముఖి ఉగాది స్వాగతం
అమ్మ భాషకు అందలమంటున్న ప్రవాసీయులం
కన్న భూమికి దూరమైనా అమ్మ భాషను చదువుదాం
అమ్మ భాష అమర భాష కావాలన్నదే సంకల్పబలం

ఉగాది పండగతో తెలుగువారికి ప్రత్యెక అనుబంధం వుంది.  ఇది ఆధ్యాత్మికంగా కాకుండా సామాజికంగా, సాంప్రదాయంగా  అనే చెప్పుకోవచ్చు.  ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకించి ఒక దేవుడిని పూజించరు.  ఎవరికి వారు తమ ఇష్ట దైవాలను పూజించుకొని అందరూ పంచాంగ శ్రవణ ప్రక్రియలో పాల్గొనడం అనేది ఒక ఆనవాయితీ.  ఇందులో కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం  సామాజిక పరంగా అందరి మధ్యా సుహృద్భావం, సదవగాహన కల్పిస్తుంది.  “పంచాంగ శ్రవణం” లో పంచ అంగాలు (తిధి, వారం, నక్షత్రం,  యోగం, కర్మ) గురించి తెలపడం జరుగుతుంది.  అయితే పంచాంగం కంటే శ్రవణం ఎక్కువ మోతాదులో ఉంటుంది.  కవి పుంగవులు భాషపై వారి వారి పరిజ్ఞానాన్ని బట్టి ప్రకృతి, ప్రేమ, పల్లె, దేశం, స్నేహం ఇలా ఎన్నో అంశాలపై కవితలు, శాయిరీలు, కధలు, కధానికలు వినిపిస్తుంటారు.  అందుకే పంచాంగం కంటే శ్రవణం పాలు ఎక్కువ.

ప్రవాసంలో నివసిస్తున్న తెలుగువారు ఈ సాంప్రదాయానికి పట్టంగట్టి తమకున్న వనరులనుపయోగించుకొని పిల్లలతో పద్యాలు పాడించడం, నాటకాలు వేయడం, సాహితీ రంగంలో నిష్ణాతులైన అతిధుల్ని భారత దేశం నుండి రప్పించి సన్మానాలు జరిపి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించడం చేస్తూ వున్నారు.  ఈ సంవత్సరం ఆస్ట్రేలియా ఖండంలో మెల్బోర్న్ నగరంలో తెలుగుమల్లి మరియు భువన విజయం ఏప్రిల్ 9 వ తేదీన నిర్వహించనున్న ఉగాది వేడుకలతో మొదలై బ్రిస్బేన్ తెలుగు సంఘం ఉగాది మే నెల 14వ తేదీ వరకు జరుగుతున్నాయి.  భువన విజయ సభ్యులు ఏసియా పసిఫిక్ లో ఇంతవరకూ ఎక్కడా ప్రదర్శన కాని “శ్రీ కృష్ణ రాయబారం” నాటక రూపంలో రంగస్థలంపై ప్రదర్శించ నున్నారు.  ఏప్రిల్ 30వ తేదీన అడిలైడ్ తెలుగు సంఘం, మే 1వ తేదీన మెల్బోర్న్ తెలుగు సంఘం, మే 7వ తేదీన సిడ్నీ తెలుగు సంఘం, మే 8వ తేదీన కాన్బెర్రా తెలుగు సంఘం మరియు  మే 14వ  తేదీన బ్రిస్బేన్ తెలుగు సంఘం ఉగాది ఉత్సవాలు జరుపుకోనున్నారు.  ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారతదేశం నుండి ప్రఖ్యాత సినీ గేయ రచయిత శ్రీ అనంత శ్రీరాం గారితో పాటుగా స్వర గాయకులు శ్రీ ధనుంజయ్, లిప్సిక మరియు జబర్దస్త్ టీం కూడా వస్తున్నారు.

అనూహ్య దుర్ఘటన:
గత ఆదివారం పెర్త్ నగరంలో జరిగిన దుర్ఘటన మన తెలుగువారినే కాకుండా ఏవత్ ఆస్ట్రేలియా దేశంలోని భారతీయులతో సహా స్థానికులను కూడా దిగ్భ్రమలోకి ముంచింది. ఇదొక అనూహ్యమైన సంఘటన. ఇప్పుడిప్పుడే జీవితంలో మొదటి అడుగులు వేస్తూ ఊహల ఉయ్యాలలో రంగుల హరివిల్లు దిద్దుకుంటూ వున్న సమయంలో రెండు నిండు జీవితాలు లిప్త కాలంలో గాలిలో కలిసి పోవడం, మరో మూడు జీవితాలు జీవన్మరణంతో పోరాడుతుండటం అందరినీ దిగ్భ్రాంతికి లోను చేసింది.

ఐదుగురు విద్యార్ధులు యాంచేప్ నుండి పెర్త్ నగరం తిరిగి వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో శేషగిరి మేడవరపు మరియు అరవింద్ సామల మృతి చెందారు. నిషిద (అరవింద్ సతీమణి), నిశాంత్ దార, ప్రియదర్శిని (నిశాంత్ సతీమణి) తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరు ముగ్గురూ పెర్త్ రాయల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

పెర్త్ తెలుగు సంఘం (పెర్త్ తెలుగువారు) స్తానిక భారతీయ హై కమిషన్ మరియు కాన్బెర్రా హై కమిషన్ తో కలిసి పార్థివ దేహాలు భారత దేశం తిరిగి పంపే ఏర్పాట్లు చేసారు. అయితే దీనికోసం అయ్యే ఖర్చుల నిమిత్తం ఆస్ట్రేలియాలోని మన తెలుగువారే కాకుండా భారతీయులతో సహా స్థానికులు షుమారు $33,000  ఆర్ధిక సహాయం అందించినందుకు వాటా అధ్యక్షులు శ్రీ శ్యాం అంబటి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.