నవతర యువతరం

నేటి ఆధునిక సమాజంలో జీవిస్తున్న మనుషులలో సభ్యసమాజ ధృష్టిపరంగా నైతిక విలువలు, భాషా సంస్కృతులు రోజు రోజుకూ దిగజారి పోతున్నాయి. రాజకీయపరంగా కూడా గ్రామ, రాష్ట్ర, దేశీయ పాలనా వ్యవస్థలు ప్రతి నిత్యమూ ఎక్కడో ఓ చోట దాదాపుగా స్థంభించి పోతున్నాయి. మరోవైపు ప్రజలెన్నుకున్ననాయకులే వివిధరకాల అరాచకాల్ని సృష్టిస్తూ వారి జీవితాల్ని ప్రతి నిత్యమూ అతలా కుతలం చేస్తున్నారు. బ్రతుకుతెరువుకోసం ఉద్యోగపరంగా వీధిలోకి వెళ్ళిన వ్యక్తి ఇంటికి చేరుకోవటానికి ‘దినదిన గండం నూరేళ్ళ ఆయుస్సు’లా పరిణమించింది. అలాగే భుక్తి నిమిత్తం వృత్తిపరంగా ప్రతి రోజూ పడరాని పాట్లు పడుతూ నానా అవస్థల్ని ఎదుర్కుంటున్న సామాన్యుడి జీవితం దుర్భర నరక యాతనలకి గురవుతోంది. అదే ధోరణిలో సాధారణ ప్రజావ్యవస్థల్ని నిర్వహించటానికి కూడా అధికారులు ప్రతిరోజూ తల క్రిందులుగా తపస్సు చేయాల్సి వస్తోంది.

అదే విధంగా యిదే సమయంలో మాతృ పితృ బంధాలకూ సోదర సోదరీ బాంధవ్యాలకూ, బంధువుల అనురాగాలకూ, మైత్రేయ ఆదరణ ఆప్యాయతలకూ అవరోధాలు ఏర్పడటం కూడా ఓ అత్యంత సహజమైన విషయంగా రూపు దిద్దు కుంటోంది. వారి ఆ అనుబంధాల మధ్య ఎన్నో కొత్త కొత్త ఆనకట్టలు నిర్మితం అవుతున్నాయి. వాటి నిర్మాణాల్ని అరికట్టాల్సిన బాధ్యత కేవలం నేటి నవతరంతో బాటుగా రానున్నముందు తరాల వారి పైనే వుంది. లేకపోతే రానున్న కాలాల్లో వొంటరి తనాన్నిఅతి దుర్భరంగా భరించాల్సి వుంటుంది. ఆ విషయం గురించ ఊహిస్తేనే తల తిరిగి పోతోంది. అలాంటప్పుడు యివన్నీతెలిసి కూడా మనం ఆ అంధకార ప్రపంచంలోకి ఎందుకు అడుగు పెట్టాలి?

పైన తెలిపిన విషయాలు అందరికీ తెలిసిన నగ్నసత్యాలు! అయితే నిప్పులాంటి ఆ నిజాల్ని భరిస్తూ, అందుకోసం ప్రతిక్షణం చింతిస్తూ ఆ చేజారి పోతున్న విలువల్ని సంరక్షించుకోవాలన్న ఆరాటం మాత్రం నేడు చాలా కొద్ది మందిలోనే కనిపిస్తోంది. ఆకారణంగా అలాంటి నైతిక పతనానికి కారణ భూతాలవుతున్న మనలోని మానసిక లోపాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకెంతైనా వుంది. అందు కోసం మనం అంతా వెంటనే సిద్ధం కావాల్సిన తరుణం యిప్పుడు ఏర్పడింది.

పైన వివరించబడిన సామాజిక సన్నిహిత దోషాలు మననుంచి తొలగి పోవాలంటే మనం మన మనోబలాన్ని చాలావరకు పెంచు కోవాల్సి వుంటుంది. అది కాకుండా నేటి యువతరం తమ మానసిక పరిపక్వతను అతి త్వరగా మరింతగా పెంపొందించు కోవాలి. అందుకై వారు ఈకాలంలో యింకా జీవిస్తోన్న గతతరం పెద్దల సలహా సహకారాల్నితప్పక స్వీకరించాల్సివుంటుంది. అంతే కాకుండా అవసరమైన పక్షంలో అనుభవజ్ఞులైన మానసిక విశ్లేషకుల సహకారాన్ని కూడా అందుకోవాల్సి వుంటుంది. అదే సమయంలో ఎంతో కొంత ముందు చూపుతో ప్రకృతి పరంగా సంభవించే నష్టాలకి కూడా ఏమాత్రం తావు యివ్వకుండా వుండేట్లుగా సరైన ఏర్పాట్లు చేసుకోవాలి.

అయితే కొన్నిసమయాల్లో మనుషుల్లోని అవివేకం కూడా ఎన్నో దుష్పరిణామాల్నిసృష్టించగలదు. అది కాకుండా జనం లోని అనుమాన గుణం, ఆవేశం, స్వార్థం, భయం, ఆందోళనలు కూడా అనేక అరిష్టాలకి దారి తీయ గలవు. అవన్నింటినీ కూడా మనం ప్రత్యామ్నాయ పద్దతులనుప యోగించటం ద్వారానూ, విశేష అద్యయనంతోనూ సమయస్పూర్తిగా చాకచక్యంతో దూరం చేసుకోవాల్సి వుంటుంది. కాని ఈ రోజుల్లో మనుషుల్లోని విషయ పరిజ్ఞాన లోపమే ఓ పెద్ద అవలక్షణంగా రూపు దిద్దుకుంటోంది. అయితే వారిలో రోజు రోజుకూ యినుమడిస్తోన్నవారి అహంకార స్వభావమే ఆ లోపాన్ని కాస్తా కప్పి పుచ్చుతోంది. ఆ దోషమే వారిలోని అవివేకాన్నిపెంపొందిస్తూ అనేక దుష్పరిణామాలకి దారి తీస్తోంది. ఈ దోషాన్నిఅరికట్టేందుకు అందరూ సహకరించాలి!

అయితే ఈ సమయంలోనే అందరూ గుర్తించాల్సిన వాస్తవ గుణం మరొకటుంది. అదే జ్ఞానంతో వృద్ధి చెందే విజ్ఞానం ! కొందరి అజ్ఞానం వారి సొత్తు. కాని విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదు. అది అందరికి చెందింది. విజ్ఞానం పెంపుదలని ఏ శక్తీ అడ్డుకోలేదు. అందుకు కేవలం విద్యా క్రమశిక్షణలే బాగా ఉపకరిస్తాయి. ఆ బాటలోనే గురు బోధనం, పుస్తక పఠనం ఎక్కువగా సహకరిస్తాయి. చివరకు ఈ రెండు శక్తులు మాత్రమే మనుషుల్లోని అవివేకాన్ని పారద్రోలగలుగుతాయి.

యిక సంస్కృతీ పరంగా మార్పులు, చేర్పులు విషయం వారి వారి ప్రాంతాల నడవడితో ముడివడి వుంది. జిల్లాల వారీగా గమనిస్తే అక్కడి మనుషుల మాటల్లోనూ, చేష్టల్లోనూ, ప్రవర్తనల్లోనూ వున్న భిన్నత్వం మనకు అతి సులభంగా గోచరిస్తుంది. అదే విధంగా తెలుగు భాష ఉచ్చారణలో కూడా మనం ప్రాంతాలవారీగా ఎంతో తేడాని గమనించ గలుగుతున్నాం.

అందువల్ల జత చేర్చిన వారి భాషాధోరణులని, వ్యక్తిత్వ నడవడికలని కలిమిడి రూపంలో ఏకతాటి మీద నడిపించటం ఎంత మాత్రమూ సులభ తరం కాదు. అదేవిధంగా మనవారి ప్రవర్తనల్లోనూ, వారి భాషా వినియోగంలోనూ అంచెలంచెలుగా ఎన్నో తేడాలు చోటు చేసుకుంటున్నాయి. వారంతా కూడా ముఖ్యంగా భాషా వినియోగం ద్వారా ఎన్నో దుష్పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తోంది. వారి ఆ ధోరణిలో పరివర్తనని తీసుకురావటం కానీ సఖ్యతని చేకూర్చి ఐకమత్యాన్నికూడగట్టటం కానీ ఎంత మాత్రమూ కుదరదని సమాజం ఎప్పుడో గుర్తించింది. ఒక వేళ సంఘ సంస్కర్త లందుకు పూనుకున్నాకూడా వారు విజయాన్ని సాధించేందుకు ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది.

అవలా వుండగా ఈనాటి ఆధునిక పద్దతులూ సాంకేతిక సౌకర్యాలూ మన నవతరాన్ని గమ్యరహితంగా పరుగులు తీయిస్తున్నాయి. యిక చిన్నారుల విషయానికి వస్తే వారికి మన తెలుగు సంస్కృతి దాదాపుగా దూరమయి పోతోంది. వారి మాటలు, చేతలు, పద్ధతులు అన్నీ కూడా విదేశీ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. పసి పిల్లల నోట తెలుగు భాష కాస్తా దాదాపుగా చావుదలని చేరుకుంటోంది. వారి భాషను సవరించి తెలుగును సక్రమంగా మాట్లాడటం నేర్పేందుకు నేటి తలిదండ్రులకు సమయం దొరకటం లేదు. అందువల్ల అన్నితరగతుల వారూ ఎంతో కొంత శ్రద్ధని చూపగలిగితేనే మన తెలుగు జీవించ గలుగుతుంది. కాని ఈ విషయంలో విదేశాల్లో వుంటున్నతెలుగువారిని మనం తప్పక అభినందించాల్సివుంటుంది. తెలుగుభాషోన్నతికి వారు అందిస్తున్న సేవలు అమోఘం! వారి పిల్లలు మనకంటే మంచి తెలుగులో మాట్లాడగలుగటం ఎంతో అభినందనీయం.

యిక మన బాంధవ్య సాన్నిహిత్యాల గురించి ఆలోచిస్తే మనకు అవగతం అయ్యే విషయం ఒక్కటే ! అదే మనిషిలోని స్వార్థం! ఆ దుర్గుణమే కొందరిని వారి తలి దండ్రులకూ , బంధు మిత్రులకూ దూరం చేస్తోంది. ఆ స్వార్థాన్ని కాపాడుకోవటానికి వినియోగించిన పద్ధతులవల్ల పడిన శ్రమా, ఎదుర్కున్న యిబ్బందులూ అన్నీ అనుభవించి కూడా మనిషి యింకా అదే దుర్గుణానికింకా బానిసయి పోతూనే వున్నాడు.

అందువల్ల చివరకు ఏకాకి బ్రతుకే అతన్ని వరిస్తోంది. ఈ పచ్చినిజాన్ని అర్థం చేసుకుని తనలోని స్వార్థానికి అంతం పలికి తన వాళ్ళని చేరుకోగలిగితేనే అతని జీవతం సుఖమయంగా సాగుతుంది.

చివరగా మానవత్వపు విలువల గురించి ఆలోచిస్తే అవి రోజు రోజుకూ కను మరుగయిపోతున్నాయి. అవి ఈకాలపు జీవన గతులలో మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా పతనం చెందుతున్నాయి. వావి వరుసలని మరచి శారీరక సంభందాలకు ఎగబాకుతోన్న దౌర్భాగ్యం కూడా మన సమాజాన్నిపీడిస్తోంది. ఆ అపశ్రుతి మననుండి తొలగి పోతేనే మన ముందు తరాలు సుఖంగా కలిసి మెలిసి జీవించ గలుగుతాయి. అందుకోసం ప్రతి వ్యక్తీ కూడా శ్రమించాల్సి వుంటుంది. ముఖ్యంగా నేటి యువతరాన్ని అదుపులో పెట్టాల్సిన బాధ్యత మనందరికీ వుంది.

పైన వివరించిన లోపాల్ని సర్దుకుంటూ ఈ తరంలోని బాధ్యత గల వ్యక్తులు యింకా జీవిస్తోన్న గత తరం వారి సహకారంతో ముందుకు సాగితేనే నేటి మన యువ తరంతో బాటుగా రాబోయే తరాలు కూడా సుఖంగా జీవించ గలుగుతాయి. అందుకు ప్రతి వ్యక్తీ మార్గదర్శకుడిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది…. శుభం !
SP Chari

1 Comment

  1. మనుషుల్ని, వారి మనసులని….. ప్రస్తుత ప్రాపంచిక విషయాలను ఆకళింపు చేసుకొని ఈ తరానికి మీరిచ్చిన సందేశం ఎంతో ప్రశంసనీయమై …ఎదురుపడి ఓ మిత్రుడు మాట్లాడుతున్నట్లుంది మీ వ్యాసం.
    చారి గారికి ధన్యవాదాలతో … రుద్ర, కాన్బెర్ర

Send a Comment

Your email address will not be published.