రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి ఒక వసంతం దాటింది. చరిత్రలో ఈ సంవత్సరం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఒక్క సంవత్సరంలో రెండు రాష్ట్రాలు ఎంతో పురోగతిని సాధించాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజధాని నిర్మాణానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అనేక దేశాల సహాయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. తెలంగాణా రాష్ట్రం తనకున్న వనరుల్ని పటిష్టపరచుకుంటూ మరిన్ని ఆర్ధిక వనరుల్ని సమకూర్చుకుంటూ పరిశ్రమ కేంద్రాలను స్థాపించడానికి ఎంతో కృషి సల్పింది. ఎవరి దారిన వారు తమ రాష్ట్ర పురోభివృద్ధికి ముందడుగులు వేస్తూ దూసుకుపోతున్నారు.
రాష్ట్ర విభజన పర్యవసానము ఇక్కడి తెలుగువారి మీద కూడా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో దాదాపు అన్ని ముఖ్య నగరాల్లో తెలంగాణా సంఘాలు స్థాపించడం జరిగింది. ఇది ప్రాంతీయ అభిమానం కావచ్చు, చారిత్రాత్మక సంఘటనలు ముడి పడి ఉండవచ్చు, ఇంకేదైనా కావచ్చు. భాషా పరంగా మనమంతా ఒక్కటే అన్నది నిర్వివాదాంశం. ప్రాంతీయ తత్వం ప్రక్కన పెడితే మనం చేసుకునే పండగలు రెండు రాష్ట్రాల సంస్కృతికి అద్దం పడతాయి. అర్ధం చేసుకునే మనస్సు ఉంటే ఒకే భావాన్ని, ఒకే అనుభూతినిస్తాయి. కొన్ని పండగలు చారిత్రాత్మక ఘట్టాలతో ముడి పడి ఉన్నా సింహ భాగం ఇరు రాష్ట్ర ప్రజలు కలిసి చేసుకునేవే. ఇందులో ఆశ్చర్య పడాల్సింది లేదు.
పండగ పర్వ దినాలు రానే వచ్చాయి. ఈ నెలలో మొదలయ్యే వినాయక చవితి నుండి మళ్ళీ దసరా, దీపావళి, బతుకమ్మ పండగల వరకూ ప్రతీ వారం ఏదో ఒక నగరంలో పండగ కార్యక్రమాలు జరుగుతూనే వుంటాయి. ఈ రెండు దేశాలు తెలుగుదనంతో శోభాయమానంగా వెలిగిపోబోతున్నాయి. ఈ రకమైన ఆలోచనే మనందరికీ మరోమారు మన ఊరికెళ్ళినంత ఆనందాన్నిస్తుంది. ఈ సరళమైన ఆలోచనకు ఎవరి త్రోవ వారు కాకుండా ఒకరి పండగలకు ఇతరులను కూడా ఆహ్వానిస్తే మనల్ని మనమే గౌరవించుకున్నట్లౌతుంది. మన భాషకు ఔన్నత్యం కలుగుతుంది. మన సంస్కృతికి మహర్దశ వస్తుంది. బహుళ సంస్కృతులకు పట్టంగట్టే ఈ దేశాల్లో మన సంస్కృతి సమ్మిళితమౌతుంది. మన, పర అన్న భేదం తరిగిపోతుంది. పూర్వ వైభవానికి ఒక అడుగు ముందుకు పడుతుంది.
గత సంవత్సర కాలంలో భావావేశాలకు లోనై ఎవరి దారిన వారు ప్రయాణం చేసారు. ఇందులో తప్పూ లేదు గొప్పా లేదు. ఇప్పుడు ఇరువైపులా దృక్పధం మారింది, ఆలోచనా సరళి మారింది. తెలుగువాళ్ళమేనన్న ధోరణి వచ్చింది. ఈ మార్పు చాలా శ్రేయస్కరమైంది. స్వాగతించదగ్గది. అభినందించదగ్గది.
పల్ల వులు చరణమ్ముల పాట కట్ల
కధలు కధనాలు నవలలు కవితలున్న
తెలుగు భాషది మనదంచు తెలియుమన్న
మీరు మేమనునెడమట మృగ్య మన్న
పలక రింపుల తోడనే పులకలన్న
పల్లె పదములకును సాట దెల్లసున్న
పోత నార్యు శ్రీనాధుల పొంగ దన్న
యేలు నేడుకొండలవాని జోలరన్న
వెన్న మీగడలనుతీపి కన్న మిన్న
భాష యన్నదె మనమధ్య పాశమన్న
పసిడి కంటెను విలువైన భాష రన్న
గుండె సప్పుళ్ళ కునికున్న గుట్టురన్న