పాతికేళ్ళు ముందుకెళితే...

గతంలో ఎన్నడూ లేనంతగా పండగ పర్వదినాలు వినాయక చవితితో మొదలయ్యాయి. చాలా సంతోషించదగ్గ విషయం. మన సంస్కృతిని కాపాడుకోవాలన్న దృక్పధం అభినందనీయం. చాలామంది యుక్త వయస్సుకు పైబడ్డవారు పెరిగిన వాతావరణం కారణంగానో, తలిదండ్రుల ప్రోత్సాహంతోనో, మన సంస్కృతిపై అభిరుచితోనో, ఆదిదేవునిపై భక్తితోనో ఈ పండగను తు.చ. తప్పకుండా ఇంట్లోనో గుడిలోనో సాంప్రదాయానుసారంగా నిర్వహించి నిమజ్జనం చేయడం జరుగుతోంది. “మనది” అన్న ఒక ఆలోచన ఎంతోమందిని ఒక దగ్గరికి చేర్చి ఒక హలులోనో, స్కూలు లోనో కార్యక్రమాలు నిర్వహించడం వయసునుబట్టి ఒక పదేళ్లో, పాతికేళ్లో తమ తీపి జ్ఞాపకాలు నెమరువేసుకొని – మా ఊళ్ళో అయితే చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం, మారేడు పత్రికి చెట్టేక్కితే పాము కనబడిందని, గరిక పూచలు తెమ్మంటే గడ్డి పూచలు తీసుకొచ్చానని – ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని తీపి గుర్తులు, వీటితో ఆనంద భాష్పాలు, మనసు ఉప్పొంగే భావాలు.

ఇవే జ్ఞాపకాల నీడలు ఒక పాతికేళ్ళు ముందుకెళితే…

ఇప్పటి మీ పిల్లలకి ఇటువంటి అనుభూతులు కలిగే అవకాశం వుంటుందా? ఇదొక పెద్ద ప్రశ్న!!!

ఈ ప్రశ్నలో ఇంకా ఎన్నో ఉప ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. ఇటువంటి అనుభూతులు అవసరమా? ఇంతకంటే మంచి అనుభూతులు వారికుంటాయిలే? మనం లేనప్పుడు వారి అనుభూతులతో మనకి పనేం ఉంటుంది? వారికి మంచి జరగాలని ఇక్కడికి తీసుకొచ్చాం, మన దేశం కంటే ఎన్నో రెట్లు బాగానే ఉంది కదా!

ఒక నాణేనికి ఎటువైపు చూస్తే మనకు సమాధానం దొరుకుతుందో అటువైపే మనం చూస్తాం. రెండోవైపు అవసరం లేదనుకుంటాం. ఇది మానవ సహజం.

అష్టా – చెమ్మ, కోతి కొమ్మచ్చి, గిల్లీ – దండా – ఇలా వ్రాసుకుంటూ పొతే చాలా ఆటలున్నాయి. ఇవన్నీ ప్రకృతి సహజంగా ఉండేవి. ప్రకృతితో మమేకమయ్యే ఆటలు, పాటలు పైసా ఖర్చులేకుండా ఇచ్చే ఆనందం వర్ణింప శఖ్యం కానిది. వేసవి సెలవులోస్తే ఇంటిపట్టున పిల్లలెవరూ వుండరు. తల్లిదండ్రులు వారిని వెతకలేక అవస్థ పడే వారు. ఇప్పుడు కంప్యూటర్, మొబైల్, టాబ్లెట్, x-బాక్స్ ఇలా అసహజమైన వాతావరణం, మెదడులో అలసట, ఓపికను తగ్గించే ఆటలు. వారి లోకంలో వారు. ఎవరితోనూ మాట్లాడరు. ఇంటికొచ్చే అతిధులకు ఆప్యాయంగా పలకరింపు లేదు. బయటికెళ్ళి ఏం చేయాలో తెలియదు. ఈ ప్రక్రియలో మార్పు రావాలి. మన పిల్లలు మనలాగానే గతాన్ని గుర్తు చేసుకొని నవ్వుకునే రోజులు రావాలంటే మన మూలాల్ని వెదకాలి. మన పిల్లలకి అవి చెప్పాలి, చేసి చూపించాలి. మనమే వారికి తాత, బామ్మ, మామ, అత్త, బావ, వదిన అన్నీను. మనమై వారిని తీసుకొచ్చాం గనుక అన్నీ మనమై మెలగాలి. వారిని మనం చేసే కార్యక్రమాల్లో – పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక చర్యలు అన్నిటిలోనూ పాలుపంచుకొని భాగస్వాములను చెయ్యాలి. వారు మళ్ళీ ఈ కార్యక్రమం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. వారిలో ఉత్సాహం కలగాలి. ప్రతీ చర్య ఒక అనుభూతిగా మిగలాలి.

కొంతమంది పిల్లలతో వినాయక చవితికి విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. సంక్రాంతికి ముగ్గులు వేయిస్తున్నారు. గాలిపటాలు ఎగుర వేయిస్తున్నారు. రంగవల్లులు దిద్దిస్తున్నారు. బతుకమ్మ పండుగకు నృత్యాలు చేయిస్తున్నారు. ఇవి ఎంతో అవసరం. ఇవే వాళ్ళకు మిగిలిపోయే అనుభూతులు. అవకాశం దొరికితే ప్రతీవారు తన ఊరు, చిన్నప్పుడు జరిగిన సంఘటన, తన గురువు, చదివిన బడి, గంట కొట్టిన గుడి, తానెక్కిన బండి, తనతో పరిగెట్టిన కోడి, తాను తిప్పిన దూడ, తాను తిరిగిన ఓడ, తానెత్తిన ఆవు పేడ గురించి చెప్పుకోవాలని ఉవ్విళ్ళూరుతుంటారు. ఎందుకంటే కొన్ని మధుర జ్ఞాపకాలు కాకపోయినా అవి మనలో భాగమైపోయాయి గనుక. ఇవే జ్ఞాపకాలు మన పిల్లలకీ ఇవ్వాలని వాళ్ళు కూడా తరువాత తరం వారితో పంచుకోవాలని మనకో ఆలోచన రావాలి. వాళ్ళు సంతోషంగా వుండాలని కోరుకుంటే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. మనం చేసే ప్రతీ పనీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలి, వారు దానితో స్పూర్తిని పొందాలి.
Signature200px

Send a Comment

Your email address will not be published.