ప్రపంచ సాహితీ సదస్సుల ఆవశ్యకత

ప్రపంచంలో ఏ మూలనున్నా తెలుగు భాష మాట్లాడేవారు శ్రావ్యమైన తెలుగు పాటగానీ గేయం గానీ పద్యం గానీ వినడానికి, కళ్ళారా ఒక మంచి తెలుగు నాటకం, చలనచిత్రం, ఒక వీధి బాగోతం, ఒక బుర్రకధ చూడాలని అనుకుంటారు. అందరికీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడానికి కాలము గానీ, తగిన వనరులు కానీ ఉండకపోవచ్చు. ఎవరైనా నిర్వహిస్తే అవకాశముంటే తప్పకుండా చూడాలని అనుకోవడం జరుగుతుంది. ఇది మన భాషే కాదు – ఏ మాతృ భాషకైనా వర్తిస్తుంది.

సాహితీ సదస్సుల నిర్వహణ ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఈ సదస్సులు సాహిత్యంపై మక్కువ పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువమంది సాహిత్యం అనగానే అది పూర్తిగా 12-16 శతాబ్దాల భాష వాడి అర్ధం కాకుండా పోతుందేమోనన్న అనుమానం. ఎందుకంటే వ్యవహారిక భాషగా తెలుగు అందరికీ అనువుగా వుంటే ఉండవచ్చు కానీ గ్రాంధిక భాషగా చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. తెలుగు సాహిత్యం రకరకాల వరవడులు త్రొక్కి గత వెయ్యేళ్ళుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తన ఉనికిని కాపాడుకుంటూ కాలప్రవాహంలో అనుకూల సమయంలో పరుగులిడి ప్రతికూల సమయంలో కాలాన్నే ఎదొర్కొని సంయమనంతో తన ఉనికిని కాపాడుకుంటూ సుస్థిరమైన స్థానాన్ని పదిలపరచుకుంది.

ప్రపంచ సాహితీ సదస్సులు నిర్వహంచబడిన ప్రాంతం, అక్కడి జీవన విధానం, ఆ ప్రాంతంలో నివసించే వారి యొక్క అభిరుచుల ప్రాతిపదికగా ఉండాలి. అక్కడివారు ఎక్కువమంది పాల్గొనడానికి అనువుగా వుంటే సదస్సు జయప్రదం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ నెల 3, 4 తేదీల్లో మెల్బోర్న్ నగరంలో జరిగిన సాహితీ సదస్సు ఈ కోవకు చెందినదే. ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో నివసించే తెలుగువారి చరిత్ర ఇతివృత్తంగా సుమారు 100కి పైగా ఇక్కడి తెలుగువారు పాల్గొనడమే కాకుండా 25 మంది వక్తలు తమ ప్రసంగాలను వినిపించారు. రెండు రోజుల కార్యక్రమాల్లో వక్తలు మన పురోగతిని అందరితో పంచుకున్నారు. మన సాహిత్యాన్ని మననం చేసారు. మన కధనాలను వినిపించారు. మన కవితల మకరందాన్ని మేదోమధనం చేసారు. అవధానాన్ని ఔపోసన పట్టారు. మన పండుగులకు రక్తి కట్టించారు. భావితరాలకు బాట చూపించారు.

ఆస్ట్రేలియాలో డాలరు పుట్టకముందు మన చరిత్రకు శ్రీకారం చుట్టిన చరిత్రకారుల మధ్య మన చరిత్రను వ్రాసిన గ్రంధాన్ని అవిష్కరించుకున్నాము. న్యూ జిలాండ్ కి పడవలో రెండు నెలలు ప్రయాణం చేసి వచ్చిన డా.సొంటి గారిని గుర్తు చేసుకున్నాము. ఆస్ట్రేలియాలో 1963 లో వచ్చి ఈ సదస్సులో ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్న శ్రీ దూర్వాసుల మూర్తిగారి గురించి తెలుసుకున్నాము. ఈ రెండు దేశాల్లో తెలుగువారి పురోభివృద్ధి జరుగుతున్న తీరును ప్రస్తుతించుకున్నాము. వీటితో పాటు ఆస్ట్రేలియా పసిఫిక్ ప్రాంతంలో మన తెలుగువారు భాషా పరంగా, సాహిత్య పరంగా, భావితరాలకు వారు అందిస్తున్న సంస్కృతీ సాంప్రదాయాల గురించి కూలంకుషంగా తెలుసుకున్నాము. వారినుండి మనం అనుసరించవలసిన పద్ధతులు, అవలంభించవలసిన పద్ధతులను నేర్చుకున్నాము.

అయితే సాహితీ సదస్సు పూర్తీ అయిన తదుపరి స్పూర్తి పొంది ఈ సాహితీ కార్యక్రమాలు వివిధ రకాలుగా నిర్వహించుకోవడం ద్వారా భాషా ప్రేమికులందరూ తమయొక్క భాషా ప్రవీణతను పెంపొందించుకోవడం కాకుండా క్రొత్తగా వలస వచ్చిన భాషాభిమానులకు ఒక సమున్నతమైన వేదికను అందించిన వారౌతారు. భావితరాల వారికీ స్పూర్తిదాయకంగా నిలచి పరదేశంలో మన భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వారౌతారు. కడలి రండి భాషా ప్రేమికులారా! కదలిరండి సాహితీ సంరక్షకులారా!

గమనిక:

వచ్చే సంవత్సరం విక్టోరియా రాష్ట్రంలో ఆంగ్లేతర భాషల అభివృద్ధికి 7.5 మిలియన్ డాలర్ల డబ్బును ఖర్చు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన.  ఈ సదవకాశం మనం సద్వినియోగపరచుకొని మన భాషను అభివృద్ధి పథంలో నడిపించడానికి నడుం కడదాం.

Signature RAO

Send a Comment

Your email address will not be published.