మన సాంప్రదాయ కళలు, కళారూపాలు ఎంతో గొప్పవని అవకాశం దొరికినప్పుడల్లా చెప్పుకుంటాం. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. ప్రవాసంలో ఉండి మన సంస్కృతీ సాంప్రదాయాలు మన జీవన విధానంలో భాగమని అనుకుంటూనే భావి తరాలవారికి సద్దేన్నపు మూటలా అందించాలన్న తపన ప్రతీ వారికి వుంటుంది. సాంప్రదాయమనేది దైనందిన జీవితంలో భాగమైతే సంస్కృతీ అనేది మన జీవన శైలిలో ప్రతిబింబిస్తుంది. ఉదయం లేచిందగ్గర నుండీ దైవారాధన, పంక్తి భోజనం, పుస్తక పటనం అన్నిటిలోనూ సాంప్రదాయాలు ఉట్టిపడుతుంటాయి. మనం ఏ సాంప్రదాయాలతో పెరిగామో పిల్లలు కూడా అలానే పెరిగాలని అనుకుంటాం. అయితే వీటిని ఆచరించడానికి, అమలు పరచడానికి అనుసరించే పద్దతులు వేర్వేరుగా వుంటాయి. మనకున్న కళలు సంగీతం, నాట్యం, జానపదాలు ఇలా ఎన్నో- సాంప్రదాయాలకు, సంస్కృతికీ ముడి పడి ఉంటాయనడం సమంజసం. ఈ కళలు అభినయించడానికి, ప్రదర్శించడానికి ఉన్న అవకాశాలను మనం ఎంతవరకూ ప్రయత్నిస్తున్నాం?
ప్రతీ పండగకీ ఒక సాంప్రదాయ బద్ధమైన కళని ప్రదర్శించి అందులోని భావాన్ని పంచుకోవడమే లక్ష్యం. హరి కధ, బుర్ర కధ, యక్ష గానం, ఒగ్గు కధ, పిచ్చుకుంటి కధ, కోలాటం, బుడబుక్కలాట, హరిదాసు, పౌరాణిక నాటకం, కూచిపూడి నాట్యం – ఇలా వ్రాసుకుంటూ పొతే చాలానే వున్నాయి. ప్రతీ కళలో ఒక పద్ధతి, ఒక సరళి, ఒక భావం, ఒక సాంప్రదాయం ఇమిడి ఉంటాయి.
తెలుగునాడులో వుంటే ప్రతీ పండగ చూసి నేర్చుకోవడం సర్వ సాధారణం. నేర్పించడానికి ప్రత్యేకించి ప్రయత్నం చేయనక్కర్లేదు. ప్రవాసంలో భిన్న సంస్కృతిలో నలిగిపోతున్న పిల్లలకు సంస్కృతీ పరమైన విషయాలు నేర్పించాలంటే బహు మార్గాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. భాషా సంస్కృతీ మన కళలతో ముడి పడి ఉన్నాయి గనుక వారు పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. వారి అభిరుచిని బట్టి సాంస్కృతిక కార్యక్రమాలను తీర్చి దిద్దాలి. సినిమా ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు పరభాషా సంస్కృతికి సాన పట్టడం అరికట్టాలి.
యువత తెలుగు భాష నేర్చుకోవాలని ఎంతో తపనతో తెలుగు బడులు నిర్వహిస్తున్నాం. నేర్చుకున్నవారికి తగు సదుపాయాలు కల్పించి వారికి ప్రత్యేక కార్యక్రమాలు (రేడియోలో, రంగస్థలంలో, కచేరీలలో) నిర్వహించాలి. భాషతో పాటు ఆచార వ్యవహారాలు, సాంప్రదాయ విలువలు వారు గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు పరదేశంలో కూడా మన సంస్కృతిని నిలబెట్టేవాళ్ళం అవుతాం.
ఈ మధ్య UNESCO వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఏడెనిమిదేళ్ళుగా పరిశోధనలు జరిపి మాతృ భాష బాగా నేర్చుకున్నవారు ఇతర భాషలు నేర్చుకోవడం లోనూ, సమాజంలో మంచి స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయం పరదేశంలో వున్నవాళ్ళకు ఎక్కువుగా వర్తించకపోవచ్చు కానీ ఇందులో నిజం లేకపోలేదు.
వచ్చే ఉగాది పండగకు వీలైనంతవరకూ పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి పండగ ఆవశ్యకతను తెలుపగలిగితే ఇప్పటివరకూ ఎంతోమంది మహానుభావులు చేసిన త్యాగం ఫలించినట్లే.