ప్రవాసంలో పెళ్ళిళ్ళ ప్రహసనం

పాతికేళ్ళ క్రితం ప్రవాసంలో నివాసం ఒక కల. అభివృద్ధి చెందిన దేశాల్లో మౌలిక సౌకర్యాలకు, సదుపాయాలకు కొదవలేదని, చక్కని వాతావరణం, పిల్లల చదువుల కోసం ఏమీ కష్టపడ నవసరం లేదు, AC కార్లలో చక్కగా తిరగొచ్చు, మంచి ఉద్యోగం ఉంటే చాలు స్వర్గం మన ఇంటి ముంగిట ఉన్నట్లే అని ఎన్నో కలలు కని పరదేశాలకు వచ్చి స్థిరపడ్డారు మన వారు. ఊహించిన విషయాలకు ఏమీ డోకా లేదు. ఊహించనివే చాలా ఉన్నాయని గమనించ లేకపోయారు.

భారతీయ సంస్కృతిలో మహోత్క్రుష్టమైన కుటుంబ వ్యవస్థను చూసి ప్రాశ్చాత్యులు ఎంతోమంది ముక్కున వ్రేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు. మన సంస్కృతి భాష, విద్యతో ముడిపడి ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. 19వ శతాబ్దం ప్రధమార్ధంలో మన సంస్కృతిపై అసూయతో మన విద్యా వ్యవస్థను విచ్చిన్నం చేస్తే కానీ భారతీయుల్లో మార్పు రాదన్న దురాలోచనతో ఆంగ్ల దొర మెకాలే ఆంగ్ల భాషకు దాసోహం అంటూ విద్యా బోధనలో బానిస పాఠ్యాంశాలను ప్రవేశపెట్టి భారతీయ సంస్కృతిపై చావు దెబ్బ కొట్టాడు. వ్యాపార నిమిత్తం భారతదేశం వచ్చిన వారు సంస్కృతి విచ్చిన్నకర శక్తులుగా మారి కిరాతకమైన దోపిడీదారులుగా మన సంపదను కొల్లగొట్టారన్నది నిర్వివాదాంశం. ప్రతీ భారతీయునికి ఈ విషయంపై రెండో అభిప్రాయం వుండదు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు విద్యా వ్యవస్థ, సంస్కృతీ సంప్రదాయాల పైన కూడా వారి ప్రభావం కనబడింది. అప్పటిలో సూర్యుడు అస్తమించని తెల్లదొరల సామ్రాజ్యం.

అయితే ఇప్పుడు రోజులు మారాయి. అవకాశాలు అందిపుచ్చుకోవాలని ప్రాశ్చాత్య దేశాలు వచ్చాము. అందులో తప్పులేదు. ఇక్కడున్న సంస్కృతిని గౌరవించాలి. అది మన ధర్మం. అలా అని మన సత్సాంప్రదాయాలను, విలువలను నీళ్ళకు వదిలేయనక్కర్లేదు. మన పిల్లలను మంచి, చెడులను గుర్తించే పరిజ్ఞానాన్ని అందివ్వాలి. వారి భావి జీవితానికి వారే న్యాయనిర్ణేతలుగా నిలవడానికి మనం తోడ్పడాలి. మీరే ఈ దేశం తీసుకొచ్చారు కాబట్టి మేమనుసరించే పద్ధతులను ప్రశ్నించే హక్కు మీకు లేదనే అవకాశం లేకపోలేదు. మా నరనాడుల్లో భారతీయతను కొనసాగించాలని మీ ఉద్దేశ్యం అయితే మీరు భారతదేశం లోనే కొనసాగాల్సింది అనే మాటలు అక్కడక్కడా వినబడుతున్నాయి. ఇది సహజం. వివాహం, కుటుంబ వ్యవస్థలపై అవగాహన గౌరవం కలిగేలా పిల్లలను తీర్చిదిద్దటం ఎంతో అవసరం. ఈ ప్రక్రియ ఒక ప్రవాహంలా సాగాలి. ఒకటి రెండు రోజుల్లో పుణికికి ఎక్కేది కాదు.

మన వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది. భారతదేశంలో వివాహం జరిగేముందు కనీసం మూడు తరాల కుటుంబాలను తరిచి తరిచి చూసే వాళ్ళు. పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకోవడం ఎంతో సబబుగా వుండేది. ఒకప్పుడు ప్రపంచంలో మనదేశంలో విడాకులు అనేది అరుదుగా వినిపించేది. ఎక్కడైనా వినిపిస్తే అది అసాధారణమని తలచేవారు. ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశంలో విడాకులు 40 శాతం కంటే పైనే వున్నాయి. అభివృద్ధి అంటే ఇదీ ఒక లక్షణమేనేమో.

గత 30-40 సంవత్సరాలుగా మన తెలుగువారు ఇక్కడికి వచ్చి స్థిరపడడం జరిగింది. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళయి పెళ్లీడుకి రావడమో పెళ్ళిళ్ళు చేసుకోవడమో జరుగుతుంది. సాధారణంగా భారతదేశంలో 20-25 సంవత్సరాల వయసు మధ్య పిల్లలకు తప్పకుండా పెళ్లి చేస్తే తలిదండ్రుల బాధ్యత తీరిందని సంతోషపడేవాళ్ళు. పిల్లలకు కూడా అది సరియైన వయస్సు. కాకపోతే ఇక్కడి పరిస్థితులనుబట్టి చాలామంది పిల్లలు 30 సంవత్సరాల వరకు పెళ్లి సంగతే మాట్లాడరు. పాపం తల్లిదండ్రులు 23-24 ఏళ్ల వయసు వచ్చిన దగ్గరనుండి సంబందాల కోసం వెతుకులాడడం మొదలెడతారు. మొదట తెలుగువారై మన కులం వారైతే మంచిదని యాత్ర మొదలౌతుంది. తెలిసినవారితోనూ అక్కడక్కడా ముచ్చట్లతో మొదలై అలా ప్రయాణం అంతర్జాలంలో ప్రవేశించి పెళ్లి ప్రహసనాలు పరవళ్ళు త్రోక్కుతుంది. ఒకటి రెండు సంవత్సరాలు గడిచిన తరువాత భారతీయ కుటుంబం అయితే బాగుండును అనుకుంటారు. ఒకటి రెండు సంబందాలు రంగు బాగాలేదనో, పొడవనో, పొట్టనో, కుటుంబ చరిత్ర అంత గొప్పగా లేదనో ఇలా ఇంకో రెండేళ్ళు వెళ్ళదీస్తే ఈపాటికి 30 దాటుతుంది. తరువాత ఒకటి రెండు సంవత్సరాలు ఓపిక తెచ్చుకొని సంబందాలు చూడడం జరుగుతుంది. అప్పటికి మరింక కొనసాగలేక అమ్మాయి అయితే అబ్బాయిని చేసుకుంటే చాలు, అబ్బాయి అయితే ఒక అమ్మాయిని చేసుకుంటే చాలన్న నిర్ణయానికి వస్తారు. ‘మేము ఇంకా చూసే ఓపిక లేదు నీకు నచ్చినవారిని చూసుకొని పెళ్ళికి పిలిస్తే వస్తామని’ ధైర్యం చేసుకొని చెప్తారు.

కొంతమంది తెలుగుమల్లి పాఠకుల అభిప్రాయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. మీ అనుభవాలు, అభిప్రాయాలు contact@telugumalli.com ద్వారా తెలుపవలసిందిగా మనవి.
Signature RAO

Send a Comment

Your email address will not be published.