ప్రాంతీయ ఐక్యతే తెలుగుజాతి సౌఖ్యత !

బలమైన భాషైక, సాంఘిక, సాంస్కృతిక అనుబంధాలే తెలుగు జాతికి బలిమి, కలిమి! భవిష్యత్తులో ప్రాంతీయ రాజకీయ అస్థిరతలు తెలుగు సామాజిక సుస్థిరతలకు చేటుగా పరిణమించకూడదు. ప్రాంతీయ ఐక్యత, సఖ్యతా భావాలే తెలుగుజాతి సౌఖ్యతకు మార్గదర్శకాలుగా నిలబడిపోవాలి ! 

తెలుగు జాతి ఈనాడు అనేక భౌగోళిక ప్రాంతాలలో వ్యాపించి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ పేరిట తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజలు ఒకే రాజకీయ కట్టడిలో కలిసి వుండటం అనేక కారణాలవలన నేడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కట్టడికి బయటవున్న మరికొన్నికోట్ల తెలుగు ప్రజలు యిక్కడి పరిణామాలను బాధాపూరితమైన ఆసక్తితో గమనిస్తున్నారు. 

తెలుగు ప్రజల మధ్య రగిలిన రాజకీయ చిచ్చు వలన వివిధ ప్రాంతాల తెలుగు సోదరుల మధ్య భావోద్రేకాలు రగులుతున్న వేళ … వాటికి సంబంధించిన చారిత్రిక కారణాలను, రాజకీయ నేపథ్యాలనూ చర్చించే సమయం కాదిది. ఇప్పటి ఘర్షణ మౌలికంగా ప్రజల మధ్య రగిలిన ఘర్షణ కాదు; ఎవరికీ అదుపు లేని ఒక రాజకీయ ప్రహేళిక అంతటా పరచుకున్నప్పుడు, సామాన్య ప్రజలంతా మూగ సాక్షులే అవుతారు! 

తెలుగునాట సామాజిక ఉద్యమాలు, సామాజిక నేతృత్వం బలంగా ఎదగక పోవడమే నేటి ఉద్విగ్న పరిస్థితికి ప్రధాన కారణం. ఇప్పుడున్న ఆవేశ కావేశాలు తొలగిన అనంతరం ప్రశాంత వాతావరణంలో నేటి పరిస్థితి గురించి సమీక్షించుకోవచ్చు. ఇప్పుడు మనందరి కర్తవ్యం … అందరం మౌలికంగా ఒకే కుదురుకి చెందినవాళ్ళమన్న భావాన్ని చెక్కు చెదరకుండా కాపాడడం! 

తెలుగు జాతి యొక్క అవిచ్ఛన్న పరంపరను బలోపేతం చేసేందుకు – తెలుగు జాతి ఐక్యత, అభ్యుదయాలపట్ల నిబద్ధత ఉన్న సామాజిక నేతలు, సాహితీవేత్తలు తమ కృషిని మరింత పట్టుదలతో కొనసాగించాలి. ప్రాదేశిక వైరుధ్యాల వాదాలను బలంగా నమ్ముతున్నవాళ్ళు, తదితరులూ కూడా యిప్పటి రాజకీయ ఆందోళనలు తెలుగు జాతి మౌలిక ఐక్యతకు దెబ్బ తగలని విధంగా వ్యవహరించాలి. 

‘తెలుగు జాతి’ అన్నది భౌగోళిక అస్తిత్వం కావాల్సిన అవసరం లేదు; చరిత్రలో అనేక రాజకీయ, పాలనా వ్యవస్థలలో జీవించినప్పటికీ, నాటి ప్రజానీకం తమలోని ఐక్యతా భావాన్ని చెక్కు చెదరనీయ లేదు; అదే స్ఫూర్తి ఎల్లప్పుడూ కొనసాగాలి. 

ఈ బాంధవ్యాన్ని బలపరిచే కొలదీ అది అందరికీ ఆత్మబలం సమకూరుస్తుంది. అది బలహీనపడినప్పుడు మనలో శూన్యతా భావాన్ని కలుగ చేస్తుంది; పరాయీకరణకు దారి తీస్తుంది. సహజ ప్రగతిని కుంటుపరుస్తుంది. కనుక పట్టుదలతో వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలలో ఉన్న ఐక్యతా భావాన్నిబలోపేతం చెయ్యడం మనందరి కర్తవ్యం !

SP Chari

Send a Comment

Your email address will not be published.