ఆస్ట్రేలియాలో అక్షర సుమాలు

తెలుగులో భాషోద్యమ సమాఖ్యను ప్రారంభించి, భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిలో అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు రాల్లభండి కవితా ప్రసాద్, తెలుగు భాషోద్యమ సంఘం నాయకుడు సామెల రమేష్ బాబు మొదటి నుంచీ ముందు వరసలోనే ఉన్నారు. అధికార భాష సంఘానికి అధ్యక్షుడు కాక ముందునుంచీ బుద్ధప్రసాద్ తెలుగు భాష పట్ల తెలుగు యువతలో అభిమానాన్ని పెంచడానికి సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నారు. చదువులు, ఉద్యోగాల్లో ఇంగ్లీష్ తప్పనప్పటికీ కనీసం ఇంట్లో తెలుగులోనే మాట్లాడడం మీద ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఒక్క కోస్తాంధ్ర ప్రాంతంలోనే కాకుండా, రాయలసీమలో కూడా ఆయన పర్యటిస్తూ ఇంట్లో అంతా తప్పనిసరిగా తెలుగు మాట్లాడడానికి ప్రోత్సహించారు. దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు.

ఇప్పుడు అధికార భాషా సంఘానికి అధ్యక్షుడు అయిన తరువాత ప్రభుత్వంలో దిగువ స్థాయిలో తెలుగును అమలు చేయడానికి బాగా శ్రమపడుతున్నారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడానికి ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు పంపించారో, ఎంతగా పోరాడారో లెక్క లేదు.

ఇక కవితా ప్రసాద్ తెలుగు సంస్కృతికి సంబంధించిన కళలు, నాట్యాలు, జానపద గీతాలు, హస్త కళలు వగైరా లన్నిటికీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో నాటక కళ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవడానికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నారు. ఇటీవల ఆయన తమ శాఖ తరఫున వంద రోజుల పాటు అవధాన కార్యక్రమం నిర్వహించి, జయప్రదంగా పూర్తి చేయడం విశేషం. అవధాన ప్రక్రియ ఒక్క తెలుగు సాహిత్యంలో మాత్రమే ఉంది.

సామెల రమేష్ బాబు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎటువంటి ఆహ్వాన పత్రిక అయినా తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలి. అంతే కాదు, ఎ తంతు అయినా సంస్కృతంలో కాక తెలుగులోనే జరగాలని, పెళ్లి, గృహప్రవేశం, ఉపనయనం వంటి కార్యక్రమాలన్నిటినీ తెలుగులోనే జరపాలని, చివరికి మంత్రాలను కూడా తెలుగులోకి అనువదించి జరపాలని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన పెళ్లి కార్యక్రమాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి తన కుమారుడికి పెళ్లి చేసారు కూడా.
గత కొంతకాలంగా ప్రభుత్వపరంగా తెలుగు భాషాభివృద్ధికి ఎటువంటి ప్రయత్నమూ జరగకపోయినా, ఇలా కొందరు మాత్రం స్వయంగా నడుం బిగించి భాష కోసం ఉద్యమం స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

మన భాష తరువాత తరానికి అందివ్వాలన్న తపన ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో ఇప్పుడిప్పుడే ఒక ఉద్యమ రూపంలో వూపందుకుంటుంది.  ప్రస్తుత ప్రపంచీకరణలో తెలుగువారు లేని భూభాగం అంటూ లేదంటే ఆశ్చర్యపోనక్కర లేదు.  జగమంతా ఒక తెలుగు కుటుంభంగా తరతరాల మన భాషా,  సంస్కృతీ సంప్రదాయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో అన్ని ముఖ్య పట్టణాల్లో తెలుగుబడి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు.  ఈ శుభ కార్యానికి శ్రీకారం చుట్టే కార్య వర్గాలు, ఎంతో మంది కార్యకర్తలు, తమ పిల్లలకు తెలుగు నేర్పించాలన్న పట్టుదల గలిగిన తల్లిదండ్రులు మరియు పిల్లలు ఎంతో అభినందనీయులు.

కాన్బెర్ర నగరంలో శ్రీ కృష్ణ నడింపల్లి గారి అధ్వర్యంలోనూ, మెల్బోర్న్ నగరంలో శ్రీ పవన్ మటంపల్లి గారి అధ్వర్యంలోనూ, అడిలైడ్ నరమలో శ్రీ ఆదిరెడ్డి యర్రా వారి అధ్వర్యంలోనూ, పెర్త్ నగరంలో శ్రీ ప్రశాంత్ రెడ్డి మేరెడ్డి వారి అధ్వర్యంలోనూ, ఆక్లాండ్(న్యూ జిలాండ్)నగరంలో శ్రీ శ్రీనివాస రావు పానుగంటి వారి అధ్వర్యంలోనూ తెలుగుబడి కార్యక్రమాలు సరిక్రొత్త రూపం దాల్చుకుంటున్నాయి.  ఈ భాషోద్యమ కార్యక్రమంలో మిగిలిన సంఘాలు కూడా పాలుపంచుకొని శాయిశక్తుల భాషోద్ధరణకు కృషి చేయగలవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.