మన దిశ ఎటువైపు?

జ్ఞానపీఠ పురస్కారం నెలకొల్పి 50 ఏళ్ళు గడిచింది. ఈ కాలంలో ముచ్చటగా ముగ్గురు తెలుగు సాహితీవేత్తలకు జ్ఞానపీఠ పురస్కారం లభించడం తెలుగుజాతికి గర్వకారణం. 1970లో “రామాయణ కల్పవృక్షం” వ్రాసినందుకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి, 1988లో విశ్వంభర కావ్యానికి గాను శ్రీ సి. నారాయణ రెడ్డి (సినారె) గారికి మరియు రావూరి భరద్వాజ గారికి 2012 లో “పాకుడురాళ్ళు” నవలకు ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు విభిన్నమైన రచనలు చేసి సాహితీ శిఖరాలలో అత్యున్నత పురస్కారం అందుకోగలిగారు.

అయితే గత నెల 12వ తేదీన సినారె మరణం ప్రతీ తెలుగు భాషాభిమానికి శోక సముద్రంలో ముంచివేసింది.
“నా పేరు కవి ఇంటి పేరు చైతన్యం ఊరు సహజీవనం తీరు సమభావం” అని తనగురించి తాను చెప్పుకొన్న సినారె విశ్వంభర కావ్యంలో “మానవుడు” కధానాయకుడుగా వర్ణించిన తీరు ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతిభకి నిదర్సనం. తెలుగు భాషాభిమానులందరూ తమ అభిమాన రచయిత వారిని విడిచి వెళ్ళిపోతే కన్నీళ్ళతో వీడ్కోలు పలికారు. మౌన రోదనతో, మనసు భారంతో, గుండె బరువుతో వెక్కి వెక్కి ఏడ్చారు. ఎందుకంటే సినారె కవిత్వం సామాన్య మానవునికి కూడా సుళువుగా అర్ధమయ్యేలా వుంటుంది. వారు వ్రాసిన సినిమా పాటలకు ఏభై ఏళ్ళు దాటినా ఈనాటికి కూడా ఆ సాహిత్యంలోని మధుర గుళికలు మైమరిపిస్తాయి. మనసుకి హాయినిగోలిపిస్తాయి.

ప్రవాసంలో నివసిస్తున్న తెలుగు సంఘాలు ఎందుకో ఇటువంటి గొప్ప వ్యక్తులకు నివాళులర్పించడానికి ఒకింత వెనుకాడుతున్నాయి. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన మహాత్ములకు నిజమైన నివాళి వారు చూపించిన మార్గాన్ని అనుసరించి మరింత ముందుకు వెళ్ళాలన్న తలంపుతో సభ్యులందరికీ ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నది గ్రహించాలి. “తెలుగు భాషోన్నతి” ప్రాధమిక లక్ష్యంగా తమ రాజ్యాంగంలోని (Constitution) నిబంధనలను వ్రాసుకొని వాటికే తిలోదకాలివ్వడం ఎంత మాత్రమూ సరికాదు. మన మనుగడ మన భాషతో ముడిపడి ఉందన్నది నిర్వివాదాంశం. మన భాషను మనం గౌరవించనినాడు మన ఉనికిని కోల్పోతామని వేరే చెప్పనక్కరలేదు.

చాలా తెలుగు సంఘాలు వీలైనన్ని తెలుగు బడులు నడుపుతున్నాయి. అయితే కొన్ని సంఘాలు వాటిని సమగ్రంగా నడపలేక మూత వేసిన సందర్భాలు కూడా వున్నాయి. ఈ విషయంలో FTAA వంటి కేంద్ర సంఘాలు బాధ్యత వహించి ఒక సమూలమైన పధకాన్ని తయారుచేయడానికి పునాదులు వేయాలి. తెలుగు భాషని ఇతర భారత భాషలు (తమిళ, పంజాబీ) వలె కమ్యునిటీ భాషగా గుర్తింపచేయడానికి అన్ని తెలుగు సంఘాలతో కృషి చేయాలి.

మలేషియా తెలుగు సంఘం అధ్వర్యంలో 4.5 మిలియన్ (US) డాలర్లతో సౌత్ ఈస్ట్ ఆసియా లో అతి పెద్ద తెలుగు అకాడెమీ కడుతున్నట్లు అధ్యక్షులు డా. అచ్చయ కుమార్ గారు తెలిపారు. షుమారు 200 సంవత్సరాల క్రితం వలస వెళ్లి ఇప్పటికీ తెలుగు భాషపై మమకారంతో అక్కడి ప్రభుత్వం ముస్లిం ఆధిపత్యం అయినా వారిని ఒప్పించి ప్రభుత్వ పరంగా కొంత గ్రాంటును తీసుకొని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ భవన సముదాయానికి శ్రీకారం చుట్టారు.

షుమారు 80, 000 వేల మంది (ఇక్కడ హిందీ భాష తరువాత తెలుగు మాట్లాడే వారే ఎక్కువ) తెలుగువారున్న ఆస్ట్రేలియాలో తెలుగు కమ్యునిటీ భాషగా గుర్తింపు పొందితే అనువాదకులకు, ఉపాధ్యాయ వృత్తి వారికీ ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం వుంది. 2016 గణాంక వివరాలు విడుదల కావలసివున్న తరుణంలో అందరూ ఏకమై కమ్యునిటీ భాషగా గుర్తింపునకు మొదట కృషి సలపాలని తెలుగుమల్లి ఆశిస్తుంది.

Signature200px

Send a Comment

Your email address will not be published.