మన పండగ - మకర సంక్రాంతి

మకర సంక్రాంతి హిందూ పండగలలో ముఖ్యమైన పండగ.  ఈ పండగ వివిధ పేర్లతో వివిధ రూపాల్లో భారత దేశమంతటా జరుపుకుంటారు.  ఈ పండగ మిగిలిన పండగల్లా చంద్రుని స్థానాన్ని బట్టి కాకుండా సూర్యుని స్థానం పై ఆధారపడి ఉంటుంది.  ఈ రోజున సూర్యుడు ధనుర్రాసి నుండి మకర రాసికి ప్రవేసిస్తాడు. మరో ముఖ్య విశేషమేమిటంటే ఈ రోజున పగలు రాత్రి సమంగా వుంటాయి.  ఈ రోజునుండి రధసప్తమి వరకు హిందూ పంచాంగంలో మంచి పుణ్య ఘడియలు ఎక్కువగా ఉంటాయని ఈ కాలంలో దానధర్మాలు చేసే వారు స్వర్గలోక ప్రాప్తి చెందుతారని ఎక్కువ నమ్మకం.  మహాభారతంలో భీష్మ పితామహుడు తన అస్త్రాలన్నీ విడిచిన తరువాత అంపశయ్యపై నెలరోజుల పాటు ఉండి వారి తుది శ్వాసను ఈ దినమే విడిచారని చెప్పబడింది.

అన్ని పండగలూ తిధి ప్రకారం తేదీ మార్పులతో వస్తూ వుంటాయి, కానీ సంక్రాంతి ప్రతీ సంవత్సరం జనవరి 14 లేక 15 తేదీలలో రావడం గమనార్హం.  సంక్రాంతి పండగ వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలవబడుతోంది.  దక్షిణ భారత దేశంలోని తమిళనాడులో పొంగల్ అని, అస్సాం రాష్ట్రంలో భొగాలి బిహు అని, పంజాబ్ లో లోహిరి అని, గుజరాత్ మరియు రాజస్తాన్ రాష్ట్రాల్లో ఉత్తరాయన్ అని పిలుస్తారు.  భారత దేశంలోనే కాకుండా ప్రక్క దేశాలైన నేపాల్, బర్మా, థాయిలాండ్ దేశాల్లో కూడా ఈ పండగని అత్యంత ఉత్సాహంతో జరుపుకోవడం విశేషం.

మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఈ పండగని ముఖ్యంగా పల్లెల్లో రైతులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు.  ఈ సంక్రాంతి పర్వ దినానికి పంటలన్నీ ఇంటికి చేరి రైతులు తమ 6 నెలల కష్టాన్ని మరిచిపోవడానికి ఆడపడుచుల్నీ అల్లుళ్ళని  ఆహ్వానించి సుఖ సంతోషాలతో జరుపుకునే పెద్ద పండగ.  ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో పండగ జరుపుకునే విధానం వేరుగా వుంటుంది.  చాలా మంది ఈ పండగకు తమ పూర్వీకులు తమ ఇంటికి వచ్చి వారిని ఆశీర్వదిస్తారనీ అందుకని వారికి ఇష్టమైన వంటకాలు చేసి దేవునికి ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీ.  సంక్రాంతి పండగ రోజు నువ్వుల నూనెతో తలంటు స్నానం చేసి నువ్వుల వంటకాలు ఆరగిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం.  కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు,  మరి కొన్ని ప్రాంతాల్లో ప్రభలు, పగటి వేషాలు, జాతరలు, పతంగులు ఎగురవేత ఇలా ఎన్నో విధాలుగా సంబరాలు జరుపుకుంటూ వుంటారు.

భారత దేశం వదలి వచ్చినా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లోని తెలుగు వారు ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతికి పట్టం కడుతూ మన భాషా సంస్కృతులను తరువాతి తరం వారికి అందివ్వడానికి శాయిశక్తులా కృషి చేయడం ఎంతో అభినందనీయం.  మకర సంక్రాంతి సందర్భంగా తెలుగుమల్లి పాఠకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Send a Comment

Your email address will not be published.