మన భాషతోనే వ్యక్తిత్వ వికాసం

“అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు”

ఈ మధ్య ఎవరో భాగవతం పద్యాలు ఎంత మధురంగా వుంటాయండి! అంటే అందులో క్రొత్తేముంది అనుకున్నాను. ఎప్పుడు చదివినా క్రొత్తగానే వుంటాయి గదా దానికి సరిక్రొత్తగా చెప్పవలసిన అవసరం ఏముందీ అన్న సందేహం కలిగి మళ్ళీ చదివితే ఇంకా ఏదైనా క్రొత్తదనం కనిపిస్తుందేమోనని మరో సారి చదవడం జరిగింది.

వ్యక్తిత్వ వికాసం (Personality Development) అని ఆధునిక జనజీవన స్రవంతిలో కొట్టుమిట్టాడుతున్న ప్రతీ వ్యక్తి, ప్రతీ సంస్థ కొన్ని వేల డాలర్లు వెచ్చించి ఒక నిష్ణాతుడిని పిలిచి కార్యగోష్ఠి నిర్వహించి రెండు రోజుల్లో ఎంతో లాభం పొందామన్న సంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. మన సంసృతిలోనే ఇమిడి ఉన్న ఎన్నో ఉత్తమమైన పద్యాలతో కూడిన ఉద్గ్రంధాలు ప్రతీ పదంలోనూ వ్యక్తిత్వ వికాసం గురించి, మన ఆలోచనా సరళి గురించి ఎంతో చక్కగా వివరించి మనకు అపారమైన మేధో సంపదను అందించాయి. ఈ కోణంలో మనకున్న సత్కవులు వ్రాసిన కొన్ని పద్యాలు చదివితే వ్యక్తిత్వ వికాసం పదింతలు పెరుగుతుందన్నది నిర్వివాదాంశం.

ఉదాహరణకి:
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ” డభ్రగపతిం బన్నింపఁ” డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

ఈ పద్యం యొక్క తాత్పర్యం చాలామందికి తెలిసిందే. అయితే భావాన్ని కూలంకషంగా పరిశీలిస్తే ఇందులో వ్యక్తిత్వ వికాసం కూడా ఇమిడి ఉందన్నది విశదమౌతుంది.

మహా విష్ణువు గజేంద్రుని ప్రాణాన్ని రక్షించడానికి లక్ష్మీ దేవితో సహా ఎవ్వరికీ చెప్పకుండా తన చీర కొంగును పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. గజేంద్రుడు నీరసపడి నీకంటే దిక్కు నాకెవరూ లేరని భక్తితో, భగవంతునిపై ప్రేమతో మొర పెడితే అంతకన్నా రెట్టింపు ప్రేమతో విష్ణువు లక్ష్మీదేవితో వున్న సమయంలో కూడా భక్తుని ప్రాణాల్ని కాపాడాలన్న సంకల్పంతో వెళ్ళడం ఈ కాలానికి కూడా వర్తిస్తుంది. ఆపదలోనూ, అవసరంలోనూ వున్న మిత్రుడు లేక బంధువు మన మీదున్న నమ్మకంతో సహాయం కోసం అర్ధిస్తే ఆపన్న హస్తం అందించాలన్నది సూక్తి. అలా ఒకరికి ఇంకొకరు సహకరించుకొని ఇరువురూ పైకి ఎదగితే సమాజానికి శ్రేయస్కరం అన్నది ఇందులో ఇమిడివున్న అర్ధం.

ఈ పద్యాలు చదివితే అర్ధం కావు కదా అన్న వాదన కూడా వుంది. అది ఒకప్పటి మాట. ఇప్పుడు అంతర్జాలంలో టీకాలు, తాత్పర్యాలతో సహా పద్యాలు అందుబాటులో వున్నాయి. గత 50 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు మన గ్రంధాలు మనకు అతి చేరువయ్యాయి. ఉదాహరణకి telugubhagavatam.org మరియు www.bhagavatamanimutyalu.com (ఇందులో పద్యాలు రాగబద్దంగా వినిపించే ఆడియో ఫైల్స్ కూడా ఉన్నాయి) అంతర్జాలంలో అన్ని పద్యాలకూ టీకాలు, తాత్పర్యాలు వున్నాయి.

ఇంకో విషయం – ప్రస్తుతం సాహిత్యం లేని పాటలు వింటే “చదువేస్తే ఉన్న మతి పోతుందని” మనం నేర్చుకున్న కాస్త తెలుగు కూడా మరచిపోవడం ఖాయం. అందుకని మన భాషపై పట్టు సాధించాలంటే మంచి గ్రంధాలు చదివితే భాషా చాతుర్యంతో పాటుగా భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం కూడా పొందగలమన్నది ఆశావాదం.
Signature RAO

2 Comments

  1. మాన్య సంపాదకులు మల్లికేశ్వర రావు గారికి ఈ సంపాదకీయంలో మన తెలుగుభాగవతాన్ని గురించి సూచించిన మీ ఆదర ఔదార్యాలకు ధన్యవాద పూర్వక నమస్కారములు అండి.. మన తెలుగుభాగవతం.ఆర్గ్ లో ఉన్న ప్రతి పద్యగద్యకు వినుకరులు చదువరికి అవసరమైన సహకారం ఇవ్వడమే ప్రధానంగా తీసుకోవడం జరిగిందండి. అదే భాగవతఆణిముత్యాలలో వినుకరులను ఆస్వాదించడం ప్రధానంగా తీసుకోవడం జరిగిందండి.. వీటిలో ఉన్న వ్యక్తిత్వ వికాస సమాచారాల గురించి బహు చక్కగా మనసుకు నాటేలా ఇచ్చారు. మీకూ మా తెలుగుమల్లికి , తెలుగు మల్లికిచెం దిన తెలుగులకు అందరికీ శుభాభినందనలు.. శుభాశీస్సులు….

    ఒక్క విషయం మనవి చేసుకుంటాను…
    మన సంప్రదాయ పరిరక్షణలో మన తెలుగుమల్లి కృషి బహుధా అభినందనీయం, ఆదర్శనీయం అండి. దీనిలో తిరుగులేదు..

  2. చాలా సంతోషం శ్రీ సాంబశివరావు గారు. మీరు చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయం. గత రెండు నెలలుగా మీ అంతర్జాల జాల గూడులోని పద్యాలూ కొన్ని చదివి మళ్ళీ మననం చేసుకోవడం జరిగింది. నా ఉద్దేశ్యంలో ఈ అంతర్జాలం తెలుగువారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియాలోని తెలుగువారందరి తరఫునా కృతజ్ఞతాభినందనలు.

Send a Comment

Your email address will not be published.