రత్నాల బతుకమ్మ ...ఉయ్యాల

ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ మరియు న్యూ జిలాండ్ దేశం లోని తెలుగు వారు బతుకమ్మ పండగ ఉత్సవాలు ఎంతో భక్తీ శ్రద్ధలతో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంతోమంది భారతదేశం నుండి అతిధులు కూడా వస్తున్నారు. వారిలో ముఖ్యంగా శ్రీ రసమయి బాలకృష్ణ (జానపద గీతాల గాయకుడు మరియు ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర M.L.A) , శ్రీమతి రుద్రమ దేవి (పత్రికా సంపాదకులు మరియు టి.వి anchor) మరియు శ్రీమతి ఉదయభాను (నటి మరియు టి.వి anchor) వున్నారు.

గత నాలుగేళ్లగా బతుకమ్మ పండగ ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో తు.చ. తప్పకుండా జరుపుకోవడం ఎంతో ముదావహం. ఈ క్రింద మరిన్ని వివరాలు తెలుగుమల్లి పాఠకుల కొరకు పొందుపరచబడ్డాయి.

చారిత్రిక వివరాలు:
బతుకమ్మ పండగ తెలుగువారి చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా ఈ పండుగను తెలంగాణా ప్రాంతంలో జరుపుకుంటారు. దసరా దీపావళి పండగల తరువాత బతుకమ్మ పండగ ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. చోళ వంశపు రాజైన ధర్మాంగదుడుకి చాలా కాలం వరకు పిల్లలు కలగకపోవడం వలన ఎన్నో పూజలు చేసిన తరువాత తన సతీమణి “లక్ష్మి” అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమె ఎన్నో అపాయాలను, ఆపదలను అధిగమించి బ్రతికినందుకు “బతుకమ్మ” అని పేరు పెట్టారంటారు. యుక్త వయసులో వున్న ఆడపడుచులు ముఖ్యంగా ఈ పండగను శ్రద్ధతో ఆచరిస్తే తగిన వరుడు లభించి వారు కూడా కుటుంబాన్ని మంచి ఉన్నత స్థితిలోకి నడిపించగలరని ఒక భావన.
ఈ పండగని దసరా నవరాత్రులు సందర్భంగా ఆచరిస్తూ దుర్గాష్టమి నాడు ముగుస్తుంది. ఆఖరి రోజుని “సద్దుల బతుకమ్మ” అంటారు. ఈ రోజునే బతుకమ్మ నిమజ్జనం జరుగుతుంది.

బతుకమ్మ తయారుచేయడం:
వెదురుకర్రలతో చేసిన ఒక బల్లపై రంగు రంగుల పూలతో (గునుగు, తంగెడు, బంతి, చామంతి, తామెర, గుమ్మడి, దోస, అల్లి, గడ్డి, వామ మొదలగు ఔషద పూలు) గోపుచ్ఛాకృతిలో వరుస క్రమంలో ఉంచుతారు. పై వరసలో పసుపుతో గానీ, గుమ్మడి పూవుతో గానీ అలంకరిస్తారు. ఇది బతుకమ్మ రూపు ఆకృతి ఇస్తుంది. గత సంవత్సరం బతుకమ్మ పండగ గురించి పర్యావరణ పరిశుద్ధ కోణంలో తెలుగుమల్లి లో ఒక వ్యాసం వ్రాయ బడింది. ఇందులో ఇన్ని రకాల పూలు ఎందుకు వాడతారో సవివరంగా తెలుపబడింది.

సంబరం:
దసరా శరన్నవరాత్రులు ప్రతీ రోజు అమ్మలక్కలు సాయంత్రం బతుకమ్మను విభవము కొలది ముస్తాబు చేసి జానపద పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్య రూపంలో తిరుగుతారు. ఈ ప్రక్రియ చూడ ముచ్చటగా వుంటుంది. ఈ కార్యక్రమం ఉత్తరాంధ్రలో గౌరమ్మ పండగను తలపింపజేస్తుంది. వారు పాడే పాటలు కూడా దుర్గాదేవి వివిధ రూపాలను వర్ణిస్తూ వుంటాయి.

Send a Comment

Your email address will not be published.