'విజయ దశమి'

భారతీయ సంస్కృతిలో పర్వదిన వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. వాటిలో ‘విజయదశమి’ పండుగకు ఓ విశిష్ఠ స్థానం వుంది. ప్రాంతీయ విభేదాలు ఏమాత్రమూ లేకుండా దేశవ్యాప్తంగా హిందువులు, సిక్కులు, జైనులుతో బాటుగా బంగ్లాదేశ్, నేపాల్, బర్మా (మయన్మార్), మలేసియా, సింగపూర్ దేశాల ప్రజలు కూడా ఈ పండుగని ప్రతి ఏటా అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు.ఈ ఈ పండుగనే ‘దసరా’ గాపిలువటం సర్వ సాధారణంగా మారిపోయింది..

దసరా పండుగ సెప్టెంబర్ – అక్టోబర్ మాసాల మధ్య కాలంలో దక్షిణాయనం, శరధ్రుతువు, ఆశ్వయుజ శుద్ధ దశమినాడు జరుపబడుతుంది.

ఈ పండుగ సందర్బంగా దుర్గామాత మందిరాలలో నవరాత్రి ఉత్సవాల్ని జనరంజకంగా నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీ సీతారామ ఆలయాల్లో ఓ పది రోజులు పెద్ద ఎత్తున అర్చనలూ అభిషేకాలు కొనసాగుతాయి. ముఖ్యంగా ఆ పూజల చివరి రోజున మాత్రం సాయంత్రం వేళలో జమ్మిచెట్టునూ, ఆయుధాలనీ ప్రత్యేకంగా పూజిస్తారు.

పౌరాణిక పరంగా పరమశివుని సతి పార్వతీదేవినే దుర్గామాతగా భావించటం జరుగుతోంది. ‘దుర్గ’ పదానికి అర్థం పౌరాణిక పరంగా సర్వదుష్ఠనాశిని అని చెప్పబడుతోంది. అందుకు ఆధారాలుగా ఆదేవి యొక్క వివిధ అవతార గాథలు పురాణాల్లో వివరించబడ్డాయి.

దుర్గామాత జననం మహిషాసుర మర్ధనంతో ముడివడివుంది. ఆరాక్షస సంహారార్థమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ అంశలని కలగలిపి సృష్ఠించిన శక్తి రూపాన్నేదుర్గగా శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. దుర్గామాత సింహాన్ని అధిరోహించి వెళ్లి మహిషాసురుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసిందట. చివరకు పదవరోజున ఆమె తన కరవాలంతో ఆరాక్షసుని గొంతును నరికి వేసిందట. ఆ రాక్షస సంహారానంతరం దేవగణాలన్నీకలిసి వరుసగా తొమ్మిది రోజులు మాతను కీర్తిస్తూ, పూజిస్తూ పదవ రోజుని ‘విజయ దశమి’గా పరిగణిస్తూ ఆరాధించారట. ఆ పది రోజులనే హిందీలో ‘దస్ రాత్’అంటారు. అందులోని మొదటి మూడక్షరాలే ‘దసరా’ పండుగ పిలుపుగా చరిత్రలో మిగిలిపోయింది.

సృష్ఠి పరంగానే దుర్గాదేవి ఓ సర్వ శక్తి స్వరూపిణిగా పరిగణించ బడుతోంది. రాక్షస సంహారార్థం దుర్గయే కాళికాదేవిగానూ, చండీ, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ, రాజ రాజేశ్వరి, కనకదుర్గగానూ కూడా అవతరించిన వైనం అంతటా బహుళ ప్రచారంలో వుంది.

త్రేతా యుగంలో శ్రీరాముల వారు సోదర లక్ష్మణ, భక్త ఆంజనేయ , అనుచర వానర సైన్యసహితులై లంకాదేశంపైన దండెత్తి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించిన రోజు కూడా ఆశ్వయుజ శుద్ధ దశమి గానే పరిగణించబడింది. ! ఆనాటి యుద్ధంలోనే రావణాసురుడితో బాటుగా అతనిసోదరులు కుంభ కర్ణాదులు కూడా శ్రీ రామునిచే వధించబడ్డారు. ఆ విజయానంతరమే సీతాదేవికి చెరసాల నుంచి విముక్తి లభించింది. ఆ యుద్ధం పరిసమాప్తి అయిన మరుక్షణమే లంకేశ్వరుడిగా విభీషణుని పట్టాభిషిక్తుణ్ణి గావించాడు శ్రీరామచంద్రుడు .

రావణాసురిడి అరాచక పాలన తొలగిపోయిన ఆనందంతో శ్రీలంకవాసులు ఆనందోత్సాహాలతో నగరమంతటా విజయోత్సహాలు జరుపుకున్నారు. అదే సమయంలో విభీషణ సార్వభౌముడు శ్రీరామదంపతులకి సముద్రతీరంలో వీడ్కోలు పలుకుతుండగా ప్రజలంతా కూడా అక్కడికి చేరి వారిని సగౌరవంగా సాగనంపారు .

లంకా నగర ద్వీపంనుంచి శ్రీరాముడు అయోధ్యా నగరానికి చేరేందుకు సరిగ్గా యిరువయి రోజుల సమయం తీసుకుంది. ఆ యిరువయి రోజులూ శ్రీరాముడు వెడుతున్న మార్గంలోని ప్రజలు ఆయన్నివిజయ చిహ్నాలతో, హర్షధ్వానాలతో ఆహ్వానిస్తూ తమ ప్రాంతాలనుండి వినమ్రంగా వీడ్కోలు పలుకుతూ పోయారు .

అదే సంస్కృతి ననుసరిస్తూ దసరా రోజున ఈ యుగంలోని ప్రజలు రావణ, కుంభకర్ణ, మేఘనాథుల గ్రహాలని దహనం చేసి ఆనందించటం జరుగుతోంది.

అదేవిధంగా ద్వాపర యుగంలో ధృతరాష్ట్రుని కొలువులో పాచికలాడి ఓడిపోయిన పాండవులు పద్నాలుగేళ్ళఅరణ్యవాసం చేసారన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే వనవాసానికి వెళ్లేముందు వారు తమ శక్తివంతమయిన ఆయుధాలన్నింటినీ మూటగట్టి ఓ జమ్మి చెట్టు పైనున్నతొర్రలో దాచి పెట్టి వెళ్లారు. వెళ్ళే ముందు తాము తిరిగి వచ్చేదాకా వాటిని కాపాడవలసిందిగా కోరుతూ ఆ జమ్మి వృక్షానికి పూజలు జరిపి వెళ్లారు. ఆ మూట కాస్తా శయనించిన ఓ శవరూపంలో కనిపించేది. ఓ పాముకాస్తా ఆ కట్టని చుట్ట చుట్టుకుని ఆ ఆయుధాలని కాపాడుతుండగా పాలపిట్టలు ఆ మూట సందుల్లో గూళ్ళు పెట్టుకుని నివసించేవి.

పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత విరాట రాజు కొలువులో ఓ సంవత్సరం అజ్ఞాత వాసాన్ని ముగించిన అనంతరం ఆ జమ్మి చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి మళ్ళీ ఆ చెట్టుని పూజించి ఆయుధాల్ని ధరించి వెళ్లి భారత యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు పాండవులు. ఆవిధంగా జమ్మి చెట్టు కాస్తా మహాభారత గాథా పరంగా ఓ పూజనీయ వృక్షంగానిలిచి పోయింది.

అలాగే మహాభారత యుద్ధం కూడా ఆశ్వయుజ శుద్ధ దశమినాడేవిజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగానే విశ్వవ్యాప్తంగా మహాభారత సృష్టికర్త ‘వేద వ్యాస మహర్షి’కి పూజలని నిర్వనించటం జరుగుతోంది. .

ఇక ఈ యుగంలో దసరా పండుగ నాడే ‘విశ్వకర్మ దినోత్సవం’ కూడా నిర్వహించబడుతోంది. ఆ పర్వదినం సందర్భంలోనే ఛత్రపతి శివాజీ మహారాజు యిదే రోజుని విదేశీ దురాక్రమణదారుల పైన ‘సీమోల్లంఘన దినం’ గా ప్రకటించి తన దండయాత్రకి నాంది పలికాడట. అందుకని ఆ యుద్ధానికి బయలు దేరేముందు తమ యుద్ధ రథాలని, శస్త్రాయుధాల వాహనాలనీ శోభాయమానంగా అలంకరింప చేయించి దుర్గామందిర ప్రాంగణంలో వాటిని పూజించి ఆ మాత ఆశీస్సుల్ని గైకొన్నాడట ఆ మహరాజు.

అదే అనుక్రమణికలో దుర్గామాత తెలుగునాట విజయవాడలో ‘ఇంద్ర కీలాద్రి’ పర్వతం పైన ‘ బెజవాడ కనకదుర్గ’ గానూ కర్ణాటక రాష్ఠ్రంలోని మైసూరు మహానగరంలో ‘మహిషాసుర మర్ధని’ గానూ పూజల్ని అందుకుంటోంది.

అయితే బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకా నగరంలో వున్న ఢాకేశ్వరీ మందిరంలో మాత్రం ఈపండుగని కేవలం ఐదురోజులు మాత్రమే నిర్వహిస్తారు.SP Chari

Send a Comment

Your email address will not be published.