ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణా రాష్ట్ర సమితి ఘన విజయాలు సాధించడం మీద అటు ప్రజల్లో, ఇటు మీడియాలో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకూ ప్రజలు కాంగ్రెస్ పై పూర్తిగా విసిగెత్తి పోయినట్టు కనిపిస్తోంది. దేశం మొత్తం మీద వీస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక, మోడీ అనుకూల పవనాల ప్రభావంతో పాటు, కాంగ్రెస్ అధినేతలు మొండిగా, అక్రమంగా రాష్ట్రాన్ని విభజించిన తీరును ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. వారికి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం జగన్ నాయకత్వంలోని వై.ఎస్.అర్.సి.పీ, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ.
జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఇంకా పూర్తిగా నమ్మకం కుదరలేదు. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి తీసుకున్న సంక్షేమ చర్యల ప్రభావం ఇంకా పనిచేస్తోంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉండడం, ఎన్నికలు పూర్తయి, గెలిచిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసే అవకాశం ఉందంటూ ప్రచారం జరగడం ఆయన విజయావకాశాలను దెబ్బ తీశాయి. విశాఖపట్నం లోక్ సభ స్థానంలో ఆయన తల్లి విజయలక్ష్మి పరాజయం పాలు కావడం, ఆయనకు కూడా తక్కువ మెజారిటీ రావడం ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇవన్నీ చంద్రబాబుకు ఉపయోగపడ్డాయి. చంద్రబాబుకు ఉన్న పాలనాదక్షుడనే పేరు కూడా ఈ సందర్భంగా ఉపయోగపడింది. అంతే కాక, ఆయన బీజేపీతో పొత్తు కుదర్చుకోవడం కూడా ఆయన విజయానికి దోహదం చేసింది.
ఇక తెలంగాణా విషయానికి వస్తే, 12 ఏళ్లుగా తెలంగాణా ఉద్యమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖర్ రావు కు ఈ సారి అవకాశం ఇవ్వాలని తెలంగాణా ప్రాంత ప్రజల్లో అభిప్రాయం కలిగింది. దేశంలో మిగిలిన ప్రాంతాలతో పాటే ఇక్కడ కూడా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి. బీజేపీతో చంద్రబాబు పొత్తు కుదర్చుకునే సరికి, బీజేపీ ఇక్కడ లబ్ధి పొందలేక పోయింది. ప్రత్యేక తెలంగాణా కోసం బీజేపీ పాటుపడ్డప్పటికీ, ఆ పార్టీ సమైక్య వాద తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం తెలంగాణా ప్రజలకు నచ్చలేదు. అయినప్పటికీ బీజేపీ, టీడీపీ పొత్తుకు 20 స్థానాల వరకూ లభించడం విశేషం.